ఆంధ్రప్రదేశ్ లో, అన్ని రకాల సర్వేలు పూర్తి చేసుకున్న, జాతీయ జల రవాణా ప్రాజెక్ట్, ఇక కార్యరూపం దాల్చనుంది. పనులు వేగవంతం అవుతున్నాయి. జాతీయ నాలుగో జల మార్గం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరున శ్రీకారం చుట్టనున్నారు. నాలుగో జాతీయ జల రవాణా ప్రాజెక్టులో భాగంగానే బకింగ్‌హామ్ కాలువ లోతు, వెడల్పు పెంచుతారు. చౌకగా జల రవాణా సౌకర్యం లభించడమే కాకుండా ప్రధానంగా పర్యాటకాభివృద్ధి ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.

కృష్ణా- గోదావరి నదులను అనుసంధానం చేస్తూ, మొత్తం 1078 కిలోమీటర్ల పోడువుతో, పుదుచ్చేరి వరకు కొనసాగే ఈ కాలువ పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ కాలువ ఒక్క ఎపిలోనే 888 కిలోమీటర్లు ఉంది. రాజధాని అమరావతితో ఈ ప్రాజెక్టును అనుసంధానం చేస్తూ జలరవాణా మార్గం పనులు చేపట్టారు.

ఫిబ్రవరి మొదటి వారంలోగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో అవసరమైన భూసేకరణకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 50 కిలోమీటర్ల పరిధిలో 600 ఎకరాలు అవసరంగా గుర్తించారు. ధవళేశ్వరం, వేమగిరి, కడియం, మేడపాడు, తొస్సిపూడి, చింతపల్లి, కొవ్వాడ, కాకినాడ మీదుగా ఈ కాలువ ఉంది. ఈ మార్గంలో ఏడు లాకులు, 19 వంతెనలు నిర్మిస్తారు. కాకినాడ కాలువ పరిధిలో 227 హెక్టార్లు, ఏలూరు కాలువ పరిధిలో 524.3 హెక్టార్లు, కొమ్మలూరు కాలువ పరిధిలో 497 హెక్టార్లు, నార్త్ బకింగ్ హామ్ కాలు పరిధిలో 129 హెక్టార్లు, దక్షిణ బకింగ్ హామ్ కాల్వ పరిధిలో 298 హెక్టార్లు, పుదుచ్చేరి పరిధిలో 27 హెక్టార్లు అవసరమని గుర్తించారు.

ప్రాజెక్టులో భాగంగా సాగునీటి కాలువలను కూడా ఆధునికీకరించాల్సి ఉంది. దాదాపు 200 వంతెనలు, 48 లాకులను రవాణాకు అనువుగా నిర్మిస్తారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ మధ్య కాలువ పొడవు 139 కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు. వజీరాబాద్ విజయవాడ వరకు కృష్ణా నది పరిధిలో 157 కిలో మీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. భద్రాచలం నుంచి రాజమహేంద్రవరం వరకు గోదావరి నది పరిధిలో ఈ కాలువ 171 కిలోమీటర్ల పరిధిలో ఉంది. గోదావరి నది పరిధిలో ప్రస్తుతం 40 టన్నుల సామర్ధ్యం కలిగిన పడవలు మాత్రమే తిరుగుతున్నాయి. ఈ కాలువల సామర్ధ్యాన్ని 210 టన్నులకు పెంచి నిర్మించనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read