బెజవాడ బెంజ్ సర్కిల్ తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో... విజయవాడకే ఒక గుర్తింపు ఈ బెంజ్ సర్కిల్.. ఒక పక్క చెన్నై, ఒక పక్క మచిలీపట్నం, ఒక పక్క హైదరాబాద్, ఒక పక్క విశాఖ వెళ్ళే రోడ్డులను కలిపే ఈ బిజీ బెంజ్ సర్కిల్ కు ఆ పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అటు చెన్నై, ఇటు కోలకత్తాను కలిపే జాతీయ రహదారాలను కలిపే, బెంజ్ సర్కిల్ అంటే గుర్తుకువచ్చేది ట్రాఫిక్.. ఎటు నుంచి, ఎటైనా ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్ దాటితే, ప్రపంచాన్ని జయించినంత ఆనందం వేస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో... ఇప్పటి జనరేషన్ కు, బెంజ్ సర్కిల్ అంటే, ట్రెండ్ సెట్ మాల్ అనే ల్యాండ్ మార్క్ స్ట్రైక్ అవుతుంది. అంతటి పెద్ద మల్టీప్లెక్ష్ వచ్చింది మరి. కాని, మన తాతలకి, తండ్రులకి, బెంజ్ సర్కిల్ అంటే గుర్తుకు వచ్చేది అక్కడ ఒక మూలన ఉండే, "బెంజీ కంపనీ". బెంజ్ సర్కిల్ అనే పేరు కూడా, ఆ బెంజ్ కంపెనీ వల్లే వచ్చింది.

ఇప్పుడు ఉన్న బెంజ్ సర్కిల్ పక్కన, B.శేషగిరి రావు & సన్స్ అనే ఆటోమొబైల్ కంపెనీ ఉండేది. తరువాత అది జాస్పర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది. బాడిగ శేషగిరి రావు గారు, ఈ కంపెనీ ఫౌండర్. ఈయన, మచిలీపట్నం MPగా పని చేసిన బాడిగ రామకృష్ణ తండ్రిగారు. B.శేషగిరి రావు & సన్స్ , 1955 ప్రాంతంలో, టెల్కో అనే ఆటోమొబైల్ కంపనీకి డీలర్ గా ఉండేది. ఈ టెల్కో కంపెనీనే, ఇప్పటి టాటా మోటార్స్. ఈ షోరోంలో బెంజ్ ట్రక్స్ అమ్మేవారు, ఈ షోరోం కారణంగానే అప్పటి నుంచి ప్రజలు, ఈ ప్రదేశాన్ని, బెంజ్ సర్కిల్ అని పిలవటం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ, జాస్పర్ ఆటో సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో బెంజ్ సర్కిల్లో కార్యకలపాలు చేస్తుంది.

బెంజ్ సర్కిల్లో ఒక విగ్రహం ఉంటుంది, ఎప్పుడైనా గమనించారా ? ఆ విగ్రహం కాకాని వెంకటరత్నం గారి విగ్రహం. వీరు జై ఆంధ్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డిల వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు. 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు.

ఇప్పుడు బెంజ్ సర్కిల్, నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఒక ముఖ్య కూడలి. దాదాపుగా రోజుకి 80 వేల నుంచి, లక్ష వరకు వాహనాలు వెళ్తాయి అనేది ఒక అంచనా. బెంజ్ సర్కిల్ ట్రాఫిక్ సమస్య తీర్చటానికి ఇక్కడ ఒక పెద్ద ఫ్లై ఓవర్ కట్టటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మన కలల రాజధాని అమరావతిలో, బెంజ్ సర్కిల్ కు ఒక ప్రత్యెక గుర్తింపు ఉండాలి అని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read