రాజధాని ప్రాంతంలోని కృష్ణా కరకట్ట రహదారిని 4 లేన్లుగా విస్తరించాలనే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. కరకట్టను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయడం వల్ల అమరావతి తదితర ప్రాంతాలకు తక్కువ సమయంలో చేరుకోవడమే కాకుండా రాజధాని ప్రాంతం భవిష్యత్తులో వరదల బారిన పడకుండా ఉంటుందనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ 2016 జనవరిలో నిర్ణయించింది. సీతానగరం పీడబ్ల్యూ వర్క్‌షాప్‌ నుంచి తాళ్లాయపాలెం, వైకుంఠపురం, అమరావతి, ధరణికోట, పొందుగల, అంబడిపూడి, తాడువాయి, మాదిపాడు అగ్రహం వరకూ కరకట్ట విస్తరించి ఉంది. దీనిని ఎత్తు, వెడల్పులను పెంచి పటిష్టం చేయడం వల్ల రవాణా వ్యవస్థ మెరుగవుతుందనేది అధికారుల భావన.

karakatta 24062018 2

ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనలో రూ. 3,600 కోట్ల వ్యయంతో తొలి దశలో 72 కిలోమీటర్ల రహదారిని 4 లేన్లుగా నిర్మించాలని పేర్కొంది. కరకట్ట సమీపంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడంతో ప్రకాశం బ్యారేజ్‌ సమీపం నుంచి కరకట్టను కొంతమేరకు విస్తరించి తారు రోడ్డు నిర్మించారు. ఇదిలా ఉండగా సీఎం నివాసం వద్దే గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటు చేయడంతో కరకట్టపై వాహనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. నిత్యం ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తుండడంతో కరకట్ట వినియోగం బాగా పెరిగింది. అయితే ఇరుకుగా ఉండడం వల్ల మంత్రులు, ఉన్నతాధికారుల వాహనాలు మినహా మిగిలిన వాటిని ఉండవల్లి మీదుగా మళ్లించిన సందర్భాలు అనేకం.

karakatta 24062018 3

ఇక శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో అయితే ఈ మార్గం మరింత రద్దీగా తయారయ్యేది. పలు సందర్భాలలో కరకట్టపై చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమరావతి అభివృద్ధిపై చంద్రబాబు అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) సీఎండీ లక్ష్మీపార్ధసారథితో నిర్వహించిన సమీక్షలో కరకట్ట అంశం ప్రస్తావనకు వచ్చింది. కరకట్టను పటిష్టపరచి 4 లేన్లుగా విస్తరిస్తే వాహనాలలో సురక్షితంగా ప్రయాణించవచ్చని సీఎం సూచన చేశారు. దీంతో రెండున్నరేళ్ల తర్వాత కరకట్ట విస్తరణ మరోసారి తెరపైకి వచ్చినట్లయింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో సీడ్‌ యాక్సిస్‌ రహదారుల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ దక్షిణం వైపున ఉన్న పాత గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ నుండి కృష్ణా కుడి ప్రధాన కాలువ, కొండవీటి వాగులపై నూతనంగా 4 లేన్ల వంతెలను నిర్మించవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కరకట్ట రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉన్న విజయవాడ నుంచి రాజధానికి రెండు రహదారులు అందుబాటులోకి వస్తాయన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read