
అమరావతి: ఏపీ లిక్కర్ రవాణా టెండర్లలో అక్రమాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
లిక్కర్ రవాణా టెండర్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో పాటు, ఈ వ్యవహారంలో జరిగిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా హవాలా మార్గంలో జరిగినట్లు అనుమానిస్తున్న ఆర్థిక లావాదేవీలపై కూడా దర్యాప్తును ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డి ఉన్నారు.
లిక్కర్ రవాణా టెండర్ల వ్యవహారంలో సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే సంస్థను ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఈడీ అనుమానిస్తున్నట్లు సమాచారం. టెండర్ల ప్రక్రియ, కంపెనీల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు, నగదు బదిలీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్‌తో ఈ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. టెండర్ల వెనుక ఉన్న ఆర్థిక వ్యవహారాలు, హవాలా లావాదేవీలు, ఇతర వ్యక్తుల పాత్రపై ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

