
సంక్రాంతి పండుగ... పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు... మొన్నటి వరకు రైతులు ఎలా ఉన్నా, ఈ సంవత్సరం రైతులు నిజంగానే సంతోషంగా ఉన్నారు. సంక్రాంతి పండుగను ఆస్వాదించి ఎన్నో ఏళ్ళు అవుతుంది అంటున్న కృష్ణా డెల్టా రైతుల ఆనందానికి అవధులు లేవు...
కృష్ణా డెల్టా మొత్తం ఏ రైతుని కదిలించినా పట్టిసీమకు కృతజ్ఞత చెప్తున్నారు. ఈ సంవత్సరం కేవలం పట్టిసీమ ద్వారానే తమ పంటలు కాపడుకోగలిగామని చెప్తున్నారు. కాపుడుకోవటమే కాదు, గోదారమ్మ పుణ్యమా అని, ఈ సారి బంపర్ పంట పండింది అని, గోదారమ్మకు పూజలు కూడా చేస్తున్నారు. నిన్న కాక మొన్న, కృష్ణా డెల్టా రైతులు చంద్రబాబుని కలిసి కృతజ్ఞతలు తెలపి, తొలి పంట ధాన్యాన్ని కానుకగా ఇవ్వటం చూసాం. ఇప్పుడు, బాపులపాడు మండలం దంటగుంట్ల గ్రామంలో, పొలాల్లో పండిన ధాన్యాన్ని రాసిగా పోసి గోదారమ్మ చిత్రపటాన్ని ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు.
గోదావరి జలాలతో సాగు చేయటం వల్ల బీపీటీ వరివిత్తనం 45 బస్తాల దిగుబడి అందిందని రైతులు సంతోషంగా ఉన్నారు. కొన్నిసంవత్సరాలుగా డెల్లాలో నీరు సకాలంలో అందేది కాదని, తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో చంద్రబాబు నదుల అనుసంధానం చెయ్యటంతో ఈ సారి నీరు అంది, బంపర్ పంట పండింది అని రైతులు ఆనందంతో ఉన్నారు. సాగు సకాలంలో జరగడం అధిక దిగుబడులకు ఒక కారణం అయితే, పట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి నీటిలో సారవంతమైన బురద మట్టి, జిగురు, ఒండ్రు ఉండటంతో పంట బాగా పండేందుకు దారి తీసిందని రైతులు చెబుతున్నారు.
దాన్యం దిగుబడులలో డెల్టా రైతులు కొత్త రికార్డు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది వరి విరగ పండింది. ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది. ఎకరానికి 35 నుంచి 45 బస్తాల మేర గింజ రాలుతోంది. సగటున 38 బస్తాలు తగ్గడం లేదు. ఈ ఏడాది వరి అధిక దిగుబడులకు పట్టిసీమ ఎత్తిపోతల ప్రధాన కారణంగా అందరూ అంగీకరిస్తున్నారు. పట్టిసీమ ద్వారా గడిచిన ఖరీఫ్ సీజనలో 55 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించారు. పులిచింతల నుంచి 30 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. దీంతో నాగార్జునసాగర్‌పై ఆధారపడాల్సిన పని లేకుండా కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగు ముందుకు సాగింది. సాధారణంగా కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు 180 టీఎంసీల నీటిని అందించే వారు. ఈ ఏడాది కేవలం 107 టీఎంసీలతోనే రైతులు పంట పండించారు. ఇందులో కూడా 85 టీఎంసీలు పట్టిసీమ, పులిచింతల ద్వారా సమకూరాయి.
కృష్ణా డెల్టా నే కాదు, త్వరగా ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్ లు పూర్తి అయ్యి, రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రం మొత్తం సస్యస్యామలం అవ్వాలి అని కోరుకుందాం.

