అన్నదాతల నుంచి అటో డ్రైవర్ల వరకు... చేనేత కార్మికుల నుంచి అగ్రిగోల్డ్‌ బాధితుల వరకు... అనేక వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర కేబినెట్‌ సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్లను రెట్టింపు చేయాన్న నిర్ణయానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనిద్వారా 54.61 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. ఇక... ఉద్యోగులకు బకాయి ఉన్న రెండు విడతల డీఏలో ఒక విడతను ఈ నెల నుంచే ఇవ్వాలని సోమవారం సమావేశమైన మంత్రివర్గం నిర్ణయించింది. డీఏ బకాయిల మొత్తం రూ.513 కోట్లను ఉద్యోగులకు వాయిదాల రూపంలో చెల్లించాలని, దీనిపై ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. వివిధ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు రివైజ్డ్‌ పే స్కేలు-2015 ప్రకారం మినిమం టైమ్‌ స్కేల్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. దీనిప్రకారం వారి వేతనం దాదాపు 50 శాతం పెరుగుతుంది. గతంలో వారికి ఏటా 10 నెలల జీతం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు పది రోజులు మాత్రం మినహాయించి... మొత్తం 12 నెలలకు జీతం ఇస్తారు. ఆటోలు, ట్రాక్టర్లకు కేటగిరీలను బట్టి త్రైమాసిక, జీవిత కాల పన్ను మినహాయించారు. దీని వల్ల 9 లక్షల మంది ఆటో డ్రైవర్లు, ట్రాక్టర్లు 1.82 లక్షల మంది ట్రాక్టర్‌ యజమానులకు లబ్ధి చేకూరనుంది.

cabinet 22012019

చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా.. చేనేత కార్మికులకు వైద్య- ఆరోగ్య బీమ పథకాన్ని ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తోంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో దీనిని చేపడుతున్నారు. అలాగే... బుడగ జంగాల సామాజిక హోదా మార్పుపై శర్మ కమిటీ నివేదికపై మంత్రి మండలి చర్చించింది. రాబోయే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది. రైతుకు సాయం... రాష్ట్రంలో రైతులకు మరింత మేలు చేసేలా పెట్టుబడి సాయం అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. రైతులతోపాటు కౌలు రైతులకూ ప్రయోజనం చేకూర్చే ఈ పథకాన్ని వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అమలు చేస్తారు. దీనికి సంబంధించిన తుది విధి విధానాలను త్వరలోనే ఖరారు చేస్తారు. అగ్రి గోల్డ్‌ బాధితులకు అండ.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చిన్న డిపాజిట్లను తానే చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.250 కోట్ల మొత్తాన్ని హైకోర్టులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఈ మొత్తాన్ని చిన్న డిపాజిట్‌దారులకు అందచేస్తారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల అమ్మకంతో వచ్చిన మొత్తాన్ని కూడా దీనికి జతచేస్తూ బాధితులకు చెల్లింపులు చేస్తారు.

cabinet 22012019

2014 జూన్‌ నుంచి మంజూరు కాకుండానే నిర్మించుకున్న 1.26 లక్షల ఇళ్లకు సాయం అందించనున్నారు. ఒక్కో ఇంటికి రూ. 60 వేలు చొప్పున ఇస్తారు. అందులో మరుగుదొడ్డికి రూ.15వేలు కేటాయిస్తారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.756 కోట్లు భారం పడనుంది. అలాగే... 1996-2004 మధ్యలో పట్టణ ప్రాంతాల్లో నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కో ఇంటికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 20వేల యూనిట్లకు రూ.20 కోట్లు చెల్లిస్తారు. అలాగే... అర్బన్‌ హౌసింగ్‌ కోసం భీమునిపట్నం మండలం కొత్త వలసలో 94.86 ఎకరాలు,పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురంలో 127.46 ఎకరాలను ల్యాండ్‌పూలింగ్‌లో సమీకరించేందుకు అనుమతించారు.

వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైంది. కృష్ణా జిల్లాతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి సోమవారం పెద్ద ఎత్తున రాధారంగా మిత్రమండలి సభ్యులు విజయవాడలోని రాధా నివాసానికి తరలివచ్చారు. వారితో ప్రత్యేకంగా భేటీ అయిన రాధా తన రాజకీయ భవిష్యత్తు పై వారితో చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో అత్యధికులు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో చేరడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని జనసేనలో చేరితే బాగుంటుందన్న సూచనలూ వచ్చినట్లు తెలిసింది. మరోవైపు రాధాతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

cbn 22012019

మొత్తం పరిణామాలను అంచనా వేస్తున్న రాధా టీడీపీవైపు వెళ్లడానికే సుముఖంగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మంగళ, బుధవారాల్లో ఆయన సీఎం చంద్రబాబును కలిసే అవకాశముంది.. అనంతరం పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి టీడీపీలో చేరవచ్చని సన్నిహితులు చెబుతున్నారు. రాధాతో భేటీ అనంతరం రాధారంగా మిత్రమండలి సభ్యులు విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌ వైసీపీ టికెట్లను అమ్ముకుంటున్నారు. అందుకే రాధాకు టికెట్‌ను నిరాకరించారు. రానున్న ఎన్నికల్లో రాధారంగా అభిమానులు ఎవరూ వైసీపీకి ఓట్లు వేయవద్దు’’ అని వారు పిలుపునిచ్చారు. తెలుగుదేశంలోకి వంగవీటి రాధా రాకను సీఎం చంద్రబాబు ధ్రువీకరించారు. 25న రాధాకృష్ణ పార్టీలో చేరుతున్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాల రీత్యా ఆయనను తీసుకుంటున్నామని, కలుపుకుని వెళ్లాలని జిల్లా నేతలను చంద్రబాబు ఆదేశించారు.

cbn 22012019

సోమవారం రాత్రి మంత్రిమండలి సమావేశం ముగిసిన తరువాత ఆయన విడిగా జిల్లా నేతలతో సమావేశమయ్యారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, విజయవాడ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యలను పిలిపించుకుని మాట్లాడారు. ముందుగా ‘రాధాను తీసుకోవాలని అనుకుంటున్నాం. మీ అభిప్రాయం చెప్పండి’ అని అడిగారు. నేతలందరూ మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వంగవీటి రాధాను విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నాం. కలుపుకుని వెళ్లాలి. వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’’ అని నేతలకు స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ మంత్రి దేవినేని నెహ్రూ తనయుడు అవినాశ్‌కు న్యాయం చేయాలని బుద్దా వెంకన్న, చంద్రబాబును కోరారు. ‘నేను చూసుకుంటాను. తగిన న్యాయం చేస్తా’ అని సీఎం హామీ ఇచ్చారు.

తెలుగు మీడియా ప్రపంచంలో లలితా జ్యెవెలర్స్ యాడ్ సరికొత్త సునామీ సృష్టించింది. ఏ చానెల్ చూసినా, ఏ పేపర్ చదివినా, ఏ రేడియో విన్నా, ఎక్కడ చూసినా లలిత జ్యువెలర్స్ యాడ్ ప్రత్యక్షమవుతుంది. ఆ యాడ్ కోసం ఆ సంస్థ వాళ్లు ప్రచారం కోసం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏమో కానీ ఆ ప్ర‌క‌ట‌న ప్ర‌తి చానెల్‌లోనూ, విరామ స‌మ‌యాల్లో అన్ని చాన‌ళ్ల‌లోనూ ఒకేలా వ‌స్తోంది. దీంతో ఈ యాడ్ చూడ‌ని టీవీ ప్రేక్ష‌కులు లేరంటే అతిశ‌యోక్తి కాదేమో. అయితే ఇప్పుడు, చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ జువెలరీ సంస్థ లలితా జువెలరీ, విజయవాడలోకి అడుగుపెట్టింది. పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో ఈ షో రూం ప్రారంభం అయ్యింది. శనివారం నాడిక్కడ లలితా జువెలరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమకు ఇది నాలుగో షోరూమ్‌ అని తెలిపారు.

lalitha 21012019 1

రూ.300 కోట్ల పెట్టుబడితో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం లలితా జువెలరీ తెలంగాణలోని హైదరాబాద్‌లో ఒక షోరూమ్‌ను నిర్వహిస్తుండగా ఏపీలో తిరుపతి, విశాఖపట్నంల్లో ఒక్కో షోరూమ్‌ను నిర్వహిస్తోందని కిరణ్‌ వెల్లడించారు. ఏపీలో మరో షోరూమ్‌ను తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రిలో త్వరలోనే ప్రారభించనున్నట్లు ఆయన చెప్పారు. చెన్నైకి సమీపంలో ఆంధ్రప్రదేశ్‌ ఉండటంతో ఇక్కడ కార్యకలాపాల విస్తరణపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రూ.15,000 కోట్ల టర్నోవర్‌ లలితా జువెలర్స్‌ గత ఆర్థిక సంవత్సరం రూ.11,000 కోట్ల టర్నోవర్‌ సాధించింది. ఈ సంవత్సరం ఇది రూ.15,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తోంది.

lalitha 21012019 1

మరో మూడేళ్లలో (2020నాటికి) రూ.50,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కిరణ్‌ కుమార్‌ చెప్పారు. జిఎస్టి అమలుతో నగల వ్యాపారానికి ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. నిజానికి జిఎ్‌సటితో వ్యాపార లావాదేవీల్లో పూర్తి పారదర్శకత ఏర్పడి, రాష్ట్రాల పన్ను ఆదాయమూ పెరుగుతుందని చెప్పారు. వచ్చే మార్చిలోగా రాజమహేంద్రవరంలో రెండు కొత్త షోరూమ్‌ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ద‌క్షిణ భార‌త‌దేశంలో ల‌లితా జువెల‌ర్స్‌కు ప్ర‌స్తుతం 11 షోరూంలు ఉన్నాయి. తిరుప‌తి, హైద‌రాబాద్, వైజాగ్ న‌గ‌రాల్లో షోరూంలు ఉన్నాయి. చెన్పైలో మొద‌లైన ల‌లితా జువెల‌ర్స్ ప్ర‌స్తుతం దేశ‌మంతా విస్త‌రించింది. దేశ‌వ్యాప్తంగా 16 బ్రాంచీలు ఉన్నాయి.

విజయవాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ రోజు ఉదయం అనుమానాస్పద బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 12 మంది నిందితులను అదుపులోకి తీసుకొని.. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారణ మొదలుపెట్టారు. విచారణలో బాక్స్‌ను చెన్నై నుంచి రూ.5 లక్షలకు కొనుగోలు చేసినట్టుగా నిందితులు తెలిపారు. బాక్స్‌లో ఇరీడియం, యురేనియం వంటి ఖరీదైన పదార్థాలున్నాయన్నారు. వీటిని సాధారణంగా రాకెట్లు, విమానాల తయారీలో వినియోగిస్తుంటారు. ఇవి బంగారం కంటే ఖరీదైనవి. దీంతో బెంబేలెత్తిన పోలీసులు... వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజెప్పారు. అంతలోనే ఈ వార్త రాష్ట్రమంతా దావానలం వ్యాపించింది.

uranium 21012019 1

దీనిపై డీఆర్ డీవో, అని పేలుడు పదార్థం అని రాసి ఉండటంతో అధికారులు డీఆర్ డీవో శాస్త్రవేత్తలకు సమాచారం అందించారు. డీఆర్ డీవో శాస్త్రవేత్తల సూచన మేరకు బాక్సును జనావాసాలకు దూరంగా ఉన్న మంగళగిరి లోని పోలీస్ క్యాంప్ కు తరలించారు. దాన్ని తెరిచేందుకు నిపుణులను పిలిపించారు. మరోపక్క డీఆర్డీవోకి ఫోన్ చేసి.. అక్కడి మెటీరియల్ ఏమైనా బయటకు వెళ్లిందా అనే కోణంలో ఆరా తీశారు. అయితే వాళ్లు అలాంటిది ఏమీ లేదని తెలపడంతో ... నిపుణుల పర్యవేక్షణలో బాక్స్‌ను తెరిపించారు. చివరికి రాగి బిందె, అయస్కాంతం, రెండు బ్యాటరీలు బయటపడ్డాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

uranium 21012019 1

ఉదయం నుంచి నెలకొన్న ఉత్కంఠతకు తెరపడింది. ఒక ఏసీపీ, ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, పది మంది పోలీసులు, బాంబ్ స్క్వాడ్ ఇంత మందిని ఉరుకులు పరుగులు పెట్టించిన బాక్స్ రహస్యం ఎట్టకేలకు బయటపడింది. దీన్ని హై ప్రొఫైల్ రైస్ పుల్లింగ్ బ్యాచ్ ఎత్తుగడగా పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళికగా దీన్ని తయారు చేశారని చెబుతున్నారు. పోలీసులు ఒక పక్కన నానా హైరానా పడుతుంటే.. నిందితులు మాత్రం కాలక్షేపం చేసుకుంటూ జరుగుతున్న దాన్ని ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం నిందితులను తమదైన శైలిలో విచారించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. వీటిని ఎక్కడికి తీసుకువెళుతున్నారు.. ఎవరు పంపించారు.. వీరి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఏంటి.. అన్న కోణాల్లో విచారించనున్నారు.

Advertisements

Latest Articles

Most Read