మే 23న ఎన్నికల ఫలితాలు వచ్చింది మొదలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ తెలుగుదేశం కార్యకర్తల పై ఏదో ఒక చోట వైసీపీ నేతల అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో వైసీపీ నేతలు చేసిన పని అందరినీ అవాక్కయ్యేలా చేసాయి. ప్రోక్లైన్ తీసుకొచ్చి ఏకంగా ఒక రోడ్డును తవ్వి ధ్వంసం చేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయలేదన్న ఒకే ఒక్క కారణంతో, వైసీపీ నేతలు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎందుకు ఇలా చేస్తున్నారని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి, పై కూడా దాడికి దిగారు. ప్రకాశం జిల్లాలో స్థానికంగా ఉప్పలపాడులోని ముస్లిం కాలనీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా, రాష్ట్రంలో అన్ని చోట్లా వేసినట్టే ఇక్కడ కూడా రూ. 5 లక్షల నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.
10 నెలల క్రితమే ఈ సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయింది. దీంతో అభివృద్ధి కళ్ళ ముందు కనిపించటంతో, ఇటీవల ఎన్నికల్లో ఆ కాలనీ వాసులు అందరూ కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనర్సింహరెడ్డికి ఓటు వేసారు. మాకు ఎందుకు ఓట్లు వెయ్యలేదు అంటూ, ఆగ్రహించిన వైసీపీ నేతలు, ప్రోక్లైన్ తీసుకొచ్చి ఆ రోడ్డును తవ్వి ధ్వంసం చేశారు. ఇలా చెయ్యటం తప్పు అని అడ్డుకోడానికి వచ్చిన వారి పై కూడా దాడి చేసారు. మాకు ఓటు వెయ్యకపోతే ఇలాగే ఉంటుంది, అధికారం ఇప్పుడు మాది, మీకు ఇదే తగిన శాస్తి, చేతనైంది చేసుకోండంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ చేసిన ఈ దురాగతం పై, స్థానిక కాలనీ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

