నూతన శాసనసభలో ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయనకు సీఎం కార్యాలయం నుంచి బుధవారం సమాచారం వచ్చింది. శంబంగి సానుకూలంగా స్పందించడంతో దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది. నూతన శాసనసభ్యులతో ప్రమాణం చేయించడంతో పాటు శాసనసభ స్పీకర్ ఎన్నికను ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు. నూతన స్పీకర్‌కు పదవీ బాధ్యతలు అప్పగించాక ప్రొటెం స్పీకర్ పదవీ కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికల్లో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావుపై విజయం సాధించిన శంబంగి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రొటెం స్పీకర్‌గా అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందని శంబంగి మీడియాకు చెప్పారు.
news
ప్రజావేదికను తమకు కేటాయించాలని చంద్రబాబు కోరగానే, వైసీపీ ఏమి చేసిందో తెలుసా...!
ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజావేదికను తనకు కేటాయించాలని సీఎం జగన్ కు చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయగా.. ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమన్నట్లు రఘురాం తెలిపారు. టీడీపీ, వైసీపీలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉండవల్లిలోని ప్రజావేదిక భవనాన్ని తన నివాసానికి అనుబంధ భవనంగా అధికారికంగా కేటాయించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఉండవల్లిలో తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రైవేటు భవనంలోనే ఇకపైనా కొనసాగనున్నానని, ఆ నేపథ్యంలో తన నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని అధికారిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, శాసనసభాపక్ష సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి వీలుగా అనుబంధ భవనంగా ప్రకటించాలని ఆయన కోరారు. ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదికను నా నివాసానికి అనుబంధ భవనంగా ప్రకటించాం. చుట్టుపక్కల ఖాళీ ప్రదేశమేదీ లేని నేపథ్యంలో వివిధ సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి ఆ భవనాన్నే వినియోగిచాం. నేను నివసిస్తున్న ప్రైవేటు భవనంలోనే...ఆ భవన యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇకపైనా కొనసాగుతాను. నేను శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం మీకు తెలుసు. ఆ నేపథ్యంలో నా నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని నా అధికారిక కార్యకలాపాల కోసం ఉంచుకోవాలని భావిస్తున్నాను. అనుబంధ భవనంగా ప్రకటించాలని కోరుతున్నాను. నా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయమని కోరుతున్నాను’’ అని జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
కర్నూలు మెగా సీడ్ ప్రాజెక్ట్ ఆపేయమని, జగన్ కీలక నిర్ణయం...
కర్నూలు మెగా సీడ్ ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునఃసమీక్ష జరిపారు. ఇవాళ మధ్యాహ్నం జలవనరుల శాఖపై ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కర్నూలు జిల్లా మెగా సీడ్ ప్రాజెక్ట్ పనులు ప్రస్తుతానికి నిలిపివేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు విషయమై మేలైన ఆలోచనలతో రావాలని అధికారులకు జగన్ సూచించారు. రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చెయ్యటానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చింది. కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మెగా సీడ్ పార్క్ కోసం అప్పట్లో ప్రభుత్వం 650 ఎకరాలు కేటాయించింది. ఈ పార్క్ కోసం అమెరికాకు చెందిన ఐయోవా యూనివర్శిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది.
రూ.670 కోట్లతో వ్యయంతో కట్టే ఈ మెగా సీడ్ పార్క్ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ పార్కులో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ స్థాయి ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు విత్తన ఎగుమతి అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన అన్ని ఏర్పాట్లూ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా విత్తన పరిశోధన, నవ్య ఆవిష్కరణలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధితో పాటు విత్తన వ్యాపారానికి ఇంక్యూబేటర్ గా ఉండడం, మానవ వనరుల అభివృద్ధి పర్చడం, ప్రపంచ విత్తన కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ విత్తన విధి విధానాలకు చేయూతనివ్వడం, రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందివ్వడం వంటి కార్యక్రమాలకు మెగా సీడ్ పార్క్ వేదికగా నిలుస్తుందని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయంతో, ఈ మెగా సీడ్ పార్క్ ఆగిపోయింది.
విజయసాయిరెడ్డి ట్వీట్ పై యనమల కౌంటర్...
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రాజకీయంగా చూడటం గర్హనీయమని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ విజయసాయి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు రాసింది..మొదటి లేఖ కాదని.. ఈ విషయం విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారని యనమల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా.. వైసీపీ నేతలు అబద్ధాలు మానడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విలాసవంతమైన భవనాలు ఊరికొకటి చొప్పున.. ఎవరికి ఉన్నాయో అందరికీ తెలిసిందేనని యనమల అన్నారు.

కృష్ణా నది కరకట్టపై తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని టీడీపీకి కేటాయించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు నుంచి జగన్‌కు లేఖ వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. " సీఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా..? పోతుందా..? అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.