ప్రార్థించే పెదవులకన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులు నిజం చేసి చూపించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జీవనం చిధ్రమై..బ్రతుకు భారమై కన్నీటి కడలిలో దేవుడా నీవే దిక్కు అంటూ సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ కేరళ వరద బాధితుల దయనీయ దుస్తితి చూసి ఉద్యోగస్తులందరూ చలించిపోయారు. తమవంతుగా కేరళ ప్రజలకు సాయం చేయాలని తలంచారు. ఆలోచన వచ్చిందే తడవుగా పెద్ద మనసుతో తమ సేవా తత్పరతను చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ రూ. 20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఉండవల్లిలో ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన ఎన్జీవో నేతలు ఆ మేరకు అంగీకార పత్రం అందజేశారు. ఎన్జీవో జేఏసీ నేతలు అశోక్ బాబు, జోసఫ్ సుధీర్ ల నేతృత్వంలో ఎన్జీవో నేతలు సీఎంను కలిసారు.

విజయవాడలో ఏపీ ఎన్జీవో హోం లో సమావేశమై కేరళ వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ తరఫున రూ. 20 కోట్లు విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. కేరళ లో భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవడంపట్ల సానుభూతితో విరాళాలు ఇవ్వడానికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పించనుదార్లు ఏకపక్షంగా ముందుకు వచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 4.1లక్షల ఉద్యోగులు,మరో 4 లక్షల పించనుదార్లు విరాళాలు ఇవ్వటానికి సుముఖత తెలిపారన్నారు. ఎన్జీవో జేఏసీ సభ్యుల ఆగస్టు నెల జీతంలో ఈమేరకు మినహాయించాలని ముఖ్యమంత్రికి అందజేసిన అంగీకార పత్రంలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి జమ చేసి అక్కడి నుంచి కేరళ వరద బాధితుల సహాయార్థం పంపించాలని కోరారు.

మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు కూడా స్పందించారు. కేరళ వరద బాధితులకు ఒకరోజు వేతనం విరాళంగా ఇస్తున్నట్లు ఏపి ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళలో జరిగిన వరద బీభత్సానికి ఐఏఎస్‌లు అందరూ తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కేరళ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఆపన్న హస్తం అందించేందుకు తాము ముందుంటామని ఏపి ఐఏఎస్‌లు ధీమా వ్యక్తం చేశారు. సహాయ పునరావాస చర్యలలో తమవంతుగా సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. మరోవైపున కేరళ వరద బాధితుల సహయార్ధం కేరళ ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి కృష్ణాజిల్లా అధికారులు వారి ఒకరోజు వేతనాన్ని స్వచ్ఛందంగా అందించాలని జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని ఇవ్వడానికి జిల్లా అధికారులంతా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తమ వంతు విరాళంగా రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని శనివారం ప్రకటించారు.


ఇందులో భాగంగా ఆదివారం ఎలమంచిలి నేతలు, కార్యకర్తలతో మునగపాకలో సమావేశం నిర్వహించారు. తొలుత నియోజకవర్గం మాజీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తర్వాత మైకు తీసుకున్న కన్నబాబురాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ఎన్నికల్లో జిల్లాలో ఎవరూ ఇవ్వనంత డొనేషన్‌ను జగన్‌కు ఇచ్చాను. ఇక్కడ ఎవరు ఎటువంటివారో నాకు తెలుసు. ఎవ్వరి మాటా లెక్కచేయను. ఎవరెన్ని చెప్పినా నా స్టైల్ మారదు. ఎన్నికల్లో ఎలా గెలవాలో నాకు బాగా తెలుసు’’ అని అన్నారు. దీంతో ఇరువర్గాల కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేశారు.
రెండు రోజుల క్రితం విజయసాయి సమక్షంలో ఇలాంటి గొడవే జరిగింది. విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో సీనియారిటీపై తంగేడు రాజులకు, మండల పార్టీ అధ్యక్షుడికి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే సభలో జరిగిన గొడవను విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయగా...విజయసాయిరెడ్డి వెనుక ఉన్న కొంతమంది సభ్యులు సెల్‌ను లాక్కొని ఫొటోలను దౌర్జన్యంగా తొలగించారు. దీని పై విలేకరులు భగ్గు మంటున్నారు. విజయసాయిరెడ్డి ఉండగానే, ఇంత జరిగినా, ఆయన ఏమాత్రం వాళ్ళని ఆపలేదని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సమక్షంలో , మీడియా పై దాడి చేసి, ఫూటేజ్ ధ్వంసం చేస్తే, కనీసం విజయసాయి వాళ్ళని ఆపలేదని విలేకరులు బాధపడుతున్నారు. దీని పై చర్చించి, తగు నిర్ణయం తీసుకుంటాం అంటున్నారు.

