ఆగస్టు 12 నుంచి 16వ తేదీ వరకు, తిరుమల దర్శనం ప్లాన్ చేసుకున్నారా ? అయితే, ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఆ సమయంలో, పరిమితి స్థాయిలోనే, అతి తక్కువ మందికి మాత్రమే స్వామి వారి దర్శనం జరుగుతుంది. ఇవి వివరాలు... మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని తితిదే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 24న జరగనున్న దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు ఆగస్టు 12 నుంచి 16 వరకు తితిదే ముహూర్తం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా క్రతువు సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు.

tirumala 05072018 2

గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు. ఆనంద నిలయం చుట్టూ కూడా పలు క్రతువులు జరగనున్నాయి. ఈ కారణంగా శ్రీవారి దర్శనాన్ని గంటల తరబడి నిలిపివేయాల్సి ఉంటుంది. కొద్ది సమయం మాత్రమే.. పరిమిత సంఖ్యలో భక్తులకు దర్శనం అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో వరుస సెలవులు ఉండడంతో పాటు సంప్రోక్షణను పురస్కరించుకొని భక్తులు అధికంగా తరలివస్తే.. దర్శనం కల్పించటం సాధ్యపడదని తితిదే అంచనా వేస్తోంది. ఈ తరుణంలో స్వామివారి దర్శనాన్ని పూర్తిస్థాయిలో నిలిపివేయాలని యోచిస్తోంది. తిరుమలకు చేరుకున్నాక యాత్రికులు నిరీక్షించడం కంటే.. ముందుగానే అప్రమత్తం చేయడం ఉత్తమమన్న ఆలోచనతో ఉంది.

tirumala 05072018 3

పన్నెండేళ్లకోసారి ఈ క్రతువును నిర్వహిస్తారని, శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ఉపఆలయాల మహాసంప్రోక్షణ చేస్తారని అన్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో నిర్వహించే తోమాల, అర్చన సేవలకు ఉదయాస్తమాన సేవ భక్తులను మాత్రమే అనుమతిస్తారు. 16న ఉదయం మహాసంప్రోక్షణ జరుగుతుంది. చివరి రోజున యాగశాలలోని ఉత్సవమూర్తులను గర్భాలయంలోకి చేర్చడంతో వైదిక కార్యక్రమాలు సమాప్తమవుతాయి. మహాసంప్రోక్షణలో భాగంగా శ్రీవారి మూలవిరాట్టు, ఇతర దేవతామూర్తుల శక్తిని బింబం నుంచి కుంభంలోకి ఆవాహనచేసి ఉపచారాలు, శాంతిహోమాలు నిర్వహిస్తామని ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. అష్టబంధనం అంటే ఎనిమిది రకాల వస్తువులతో తయారుచేసిన చూర్ణమని, దీని ఆయుర్దాయం 12 ఏళ్లు ఉంటుందని ఆగమ సలహాదారు సుందర వరదభట్టాచార్యులు వివరించారు. ఈ అష్టబంధనాన్ని శ్రీవారి పాదాల కింద ఉంచుతామన్నారు.

అనంతపురం జిల్లాలో ప్రారంభించిన కియ కార్ల తయారీ పరిశ్రమ యమ స్పీడుగా రూపుదిద్దుకొంటోంది. 2019లో కార్లను ఉత్పత్తి చేసి, రోడ్డెక్కించడం లక్ష్యంగా పనులు పరుగులు తీస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే, ఇప్పుడు కియా మరో గుడ్ న్యూస్ వినిపించింది. కియా ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సైతం రాష్ట్రం వేదిక కానుంది. దేశంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన ప్రతినిధుల బృందం చివరకు ఆంధ్రప్రదేశ్‌లోనే యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించింది. భారత్‌లో మార్కెట్‌తోపాటు విదేశాలకు ఎగుమతులకూ వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కర్మాగార పనులు అనంతపురం జిల్లా వెనుకొండ మండలం ఎర్రమంచిలిలో ప్రారంభించిన విషయం తెలిసిందే.

kia 05072018 2

535 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన ఈ కర్మాగారంలో కొత్త సంవత్సర కానుకగా మొదటి కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కియా యత్నిస్తోంది. పనుల పురోగతిని కియా ప్రతినిధుల బృందం ఇటీవల అమరావతిలో ముఖ్యమంత్రికి వివరించగా.. జనవరి ఒకటికల్లా తొలి కారును మార్కెట్లోకి తేవాలని చంద్రబాబు సూచించారు. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన కర్మాగార పనులు నిర్వహిస్తున్నారు. ఇదే ప్రాంగణంలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌నూ నెలకొల్పేందుకు కియా ఆసక్తి చూపుతోంది. ఇదే అంశాన్ని సూత్రప్రాయంగా ముఖ్యమంత్రి ముందుంచగా తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కియా మోటార్స్‌ కోసం ఎర్రమంచిలిలో ఇదివరకే దాదాపు 672 ఎకరాల భూములను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో వందెకరాల్లో కొండ కూడా ఉంది.

kia 05072018 3

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు మరో 570 ఎకరాలకు పైగా భూములు అవసరమని కియా మోటార్స్‌ తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. 73.50 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ ప్లాంట్‌, 433 ఎకరాల్లో అనుబంధ పరిశ్రమలు వస్తాయని, ఇంకో 84 ఎకరాలు డంపింగ్‌ యార్డు కోసం అవసరమని సూచించింది. దీంతో అదనపు భూ సమీకరణ కోసం అధికారులు దృష్టిపెట్టారు. భూ కేటాయింపు పూర్తయ్యాక కియా ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ యూనిట్‌ విషయాన్ని అధికారికంగా ప్రకటించే యోచనతో ప్రభుత్వం ఉంది. దీంతో అధికారులు ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.

వైకుంఠపురం రిజర్వాయర్ దగ్గర కృష్ణానదిపై నిర్మించనున్న వారధిని ఐకానిక్ నిర్మాణంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిని అమరావతికి అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే డజనుకు పైగా వారధులన్నీ రాజధానికే మకుటాయమానంగా నిలవాలని ఆయన స్పష్టంచేశారు. రాజధాని నగరంలో చేపట్టిన రహదారుల నిర్మాణాలు డిసెంబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. నిర్మాణంలో వేగం పుంజుకుంటే తప్ప నిర్దేశిత వ్యవధిలో పనులను పూర్తి చేయడం సాధ్యం కాదని అన్నారు. ముఖ్యంగా సీడ్ యాక్సెస్ నిర్మాణం మరింత చురుగ్గా సాగాలని చెప్పారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్‌డీఏ 17 వ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి పనులను సమీక్షించారు.

amaravati 05072018 2

సీడ్ యాక్సెస్ రహదారి, సబ్ ఆర్టియల్ రహదారుల నిర్మాణాలలో జాప్యానికి గల కారణాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక్కొక్క రహదారికి 150కి పైగా యుటిలిటీ క్రాసింగ్స్ వున్నాయని, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తే కానీ, రహదారుల నిర్మాణాలను పూర్తి చేయలేమని అమరావతి అభివృద్ధి సంస్థ సీఎండీ లక్ష్మీ పార్ధసారధి ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలలో భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాకపోవడం కూడా రహదారుల నిర్మాణాలకు ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పారు. సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణంలో 63శాతం పని పూర్తయ్యిందని, రూ.140.60 కోట్ల మేర నిధులను ఖర్చు పెట్టామని తెలిపారు. సీడ్ యాక్సెస్, ఇతర సబ్ ఆర్టియల్ రహదారులన్నింటికీ కలిపి ఇప్పటి వరకు రూ.1,196 కోట్ల మేర నిధులు వెచ్చించామని చెప్పారు. సాధారణ ప్రభుత్వ విధానాలతో కాకుండా వృత్తి నైపుణ్య పద్ధతులను అనుసరించడం ద్వారా మాత్రమే నిర్ధిష్ట లక్ష్యాలను సాధించగలుగుతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు.

amaravati 05072018 3

ప్రాజెక్టు మేనేజ్‌మెంటులో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ఇప్పటి వరకు వీజీటీఎం ఉడా పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులను సీఆర్‌డీఏ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. ప్లానింగ్, ఇంజనీరింగ్, అడ్మిన్‌స్ట్రేషన్, క్లాస్ 4 ఉద్యోగులను మొత్తం నాలుగు కేటగిరిలలో తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రతి ఆదివారం డ్రోన్ సహాయంతో తీసిన చిత్రాల ద్వారా రెండు సెం.మీ. పనుల పురోగతిని కూడా త్రిడీ గ్రాఫిక్స్‌లో విజువలైజ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నిర్మాణ సామాగ్రిని సమకూర్చుకోవడం దగ్గర నుంచి నిర్మాణంలో పాలు పంచుకునే కార్మిక సిబ్బంది పనితీరు వరకు సమస్తం డ్రోన్ల ద్వారా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో నేరుగా క్షేత్రస్ధాయి పనుల పురోగతిని తెలుసుకోవచ్చునని చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో సీఆర్‌డీఏ 17 వ అథారిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రాజధాని అభివృద్ధి పనులను సమీక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అమరావతి పరిధిలో గల కృష్ణానది తీరంలో శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదనపై సమావేశంలో చర్చించారు. పవిత్ర సంగమ ప్రాంతంలో ఇప్పటికే దీనికి అనుకూలంగా ఉండే స్థలాన్ని గుర్తించారు. టీటీడీ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. రాజధానిలో సొంత ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ కాంట్రాక్టు ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి వస్తున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతానికి వెయ్యి గృహాలను వాణిజ్యపరంగా నిర్మించడం కోసం రూపొందించిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. 1285, 1580, 1880, 2150 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తారు. చదరపు అడుగుకు రూ.3 వేల ధరను ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.500 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేశారు.

amaravati 05072018 2

రాజధానిలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఇటువంటి వ్యవస్థ దేశంలో ఇదే ప్రథమమని సీఆర్‌డీఏ కమిషనర్ చెప్పారు. అమరావతిలో విద్యాలయాలను నెలకొల్పడానికి 8 ప్రఖ్యాత సంస్థలు ముందుకొచ్చాయని, నిర్మాణాలను చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయని చెప్పారు. ఇవిగాక సెయింట్ గేబ్రియల్, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ సొసైటీ, పీహెచ్ఆర్ ఇన్వెంట్ ఎడ్యుకేషనల్ సొసైటీ, జూబిలీహిల్స్ ఎడ్యుకేషనల్, సొసైటీ ఆఫ్ సెయింట్ మేరీ, ఎన్ఎస్ఎం కూడా దరఖాస్తు చేశాయని తెలిపారు.

amaravati 05072018 2

కొన్ని స్టార్ హోటళ్లు ముందుకొస్తున్నాయని పైవ్ స్టార్ హోటళ్లు 4, ఫోర్ స్టార్ హోటళ్లు 4, త్రి స్టార్ హోటల్ ఒకటి రాజధానిలో త్వరలో నిర్మాణాలను చేపట్టనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విజయవాడలో 1700 హోటల్ గదులు అందుబాటులో వున్నాయని, అమరావతి నగరంలో మొత్తం 10 వేల గదులు అందుబాటులోకి తీసుకురావాలన్నదే లక్ష్యమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. శాఖమూరులో 7.5 ఎకరాల విస్తీర్ణంలో శిల్పారామం తరహాలో ఏర్పాటు చేయనున్న ఎత్నిక్ విలేజ్‌లో ఎకరం స్థలంలో క్రాఫ్ట్ బజారును ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్ కౌన్సిల్ ముందుకొచ్చింది.

Advertisements

Latest Articles

Most Read