నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం... ఇది ఒక సుందర నగరం... ఎన్నో కంపెనీలు ఇక్కడకు వస్తున్నాయి... టూరిస్ట్ స్పాట్ గా కూడా పేరు ఉంది. ఇలాంటి విశాఖకు, ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్ కు ఇబ్బంది వచ్చే చర్యలు మొదలయ్యాయి.. కేంద్రం పెడుతున్న టార్చర్ లో, ఇది మరో రకమో ఏమో కాని, విశాఖ ఎదుగుదలకు పెద్ద ఇబ్బంది వచ్చి పడింది. విశాఖ ఎయిర్ పోర్ట్, తూర్పు నౌకాదళం ఆధీనంలో ఉంది. విమాన రాకపోకలకు నియంత్రించే అధికారం వారికి ఉంది. ఇప్పుడు రోజుకు 5 గంటలపాటు పౌర విమానాల రాకపోకలను నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అవతరిస్తున్న విశాఖ ప్రగతికి తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఏటా 24 లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని దేశ, విదేశీ గమ్యస్థానాలకు చేరుస్తూ కీలక గుర్తింపు తెచ్చుకున్న ఈ విమానాశ్రయంలో రాకపోకలను నిషేధిస్తే ప్రయాణికులపై ఆర్థిక భారం పడటమే కాకుండా.. సమయం వృథా కానుంది.

vizag 10062018 2

తూర్పు నౌకాదళం సారథ్యంలో నడుస్తోన్న విశాఖ విమానాశ్రయం రన్‌ వేను యుద్ధ విమానాల శిక్షణ కోసం ఉపయోగించుకోవాలని నేవీ నిర్ణయించింది. దీని కోసం రోజుకు ఐదు గంటలు పౌర విమాన సేవలు నిలిపివేయాల్సి వస్తుంది. దీనిపై గత నెలలో విమానాశ్రయం అధికారులు, విమాన సంస్థలతో నేవీ సమావేశం ఏర్పాటు చేసింది. తాము సూచించిన వేళల్లో విమానాలు నడపవద్దని కోరింది. నవంబరు ఒకటవ తేదీ నుంచి పూర్తిగా విమానాశ్రయాన్ని స్వాధీనంలోకి తీసుకుంటామని, ప్రస్తుతం నడుస్తున్న విమానాలను రీ షెడ్యూల్‌ చేసుకోవాలని నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. విమానాశ్రయ సమయాలు తగ్గిస్తే విమానాలు తగ్గి రాష్ట్ర ఆర్థిక ప్రగతి, నగర అభివృద్ధి దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పటికీ అటు విమానాశ్రయ అధికారులుగానీ, ఇటు నౌకాదళ అధికారులుగానీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను సంప్రదించ లేదు.

vizag 10062018 3

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాక దీనిని తీసుకుంటే అభ్యంతరం లేదు. కాని అక్కడ రాకముందే ఇక్కడ రాకపోకలు తగ్గించేస్తే విశాఖలో వాణిజ్య వ్యవహారాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నౌకాదళ అధికారుల నిర్ణయం కారణంగా ఐటీ, ఫార్మా, పర్యాటక, ఆతిథ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడి ఆర్థిక ప్రగతి దెబ్బతినడమే కాకుండా విశాఖ వచ్చే వారి సంఖ్య తగ్గి కొన్ని విమానాలు రద్దయ్యే ముప్పు ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రోజుకు 16 విమానాలు రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే విదేశీయులను ఆకర్షిస్తున్న పర్యాటక రంగంతో పాటు ఫార్మా, సీఫుడ్‌, అపెరల్‌ ఉత్పత్తులపైనా ప్రభావం పడుతుంది. ప్రస్తుతం విశాఖపట్నం జీడీపీలో దేశంలో తొమ్మిదవ స్థానంలో వుంది. నేవీ నిర్ణయం వల్ల ఈ స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది.

రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేది... నవ్యాంధ్రలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ ! ‘కియ’ కార్ల కంపెనీ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. మరొక్క ఏడాదిలోనే కియ ప్లాంటు నుంచి మొదటి కారు రోడ్డెక్కనుంది. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో... యర్రమంచి గ్రామం వద్ద, జాతీయ రహదారి పక్కనే ‘కియ’ ప్లాంటు ఏర్పాటవుతోంది. మొత్తం 535.5 ఎకరాలను దీనికి కేటాయించారు. అందులో 84.14 ఎకరాల్లో బాడీషాప్‌, పెయింట్‌షాప్‌, అసెంబ్లీ షాప్‌, ఇంజిన్‌ షాప్‌, ప్రెస్‌కు సంబంధించిన యూనిట్లను నిర్మిస్తున్నారు. భూమి చదునులో రాష్ట్ర ప్రభుత్వం చూపిన వేగాన్ని... కంపెనీ ఏర్పాటులో కియ కూడా చూపిస్తోంది. ప్రస్తుతం కొరియాకు చెందిన 200 మంది సిబ్బంది ఇక్కడ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1500 మంది కార్మికులు ఈ పనుల్లో పాల్గొంటున్నారు.

kia 10062018 2

మరో పక్క, కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగాల కోసం ఇవాల్టి నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అవసరాలకు అనుగుణంగా తొలిదశలో ఆరు వందల మంది పాలిటెక్నిక్ డిప్లమా పూర్తిచేసిన వారిని నియమించడానికి కియా యాజమాన్యం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ-వెలుగు సంస్థల ఆధ్వర్యంలో ముందుగా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జేఎన్‌టీయూలో ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించారు. డిప్లమో పరీక్షల మార్కుల ఆధారంగా మెరిట్ ఉన్న 340మంది విద్యార్థులకు ఈరోజు పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తం 5వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో అనంతపురం జిల్లాకు చెందిన వారు 2వేల మంది ఉన్నారు.

kia 10062018 3

వీరికి విడుతల వారిగా పరీక్షలు నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఐదు రోజుల పాటు సాంకేతిక శిక్షణ ఇవ్వనున్నారు. అక్కడ కూడా ప్రతిభ కనబరిచిన వారికి కియాలో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. కియా మోటార్స్‌లో రాష్ట్రానికి చెందిన వారికే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఎస్‌డీసీ), కియా మోటార్స్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. కియా సంస్థలో పనిచేసేందుకు అవసరమయ్యే నైపుణ్యం గల అభ్యర్థుల ఎంపిక, విధివిధానాలను పరిశ్రమల శాఖ సమన్వయంతో రూపొందించారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ అంచనా ప్రకారం..కియా కార్ల కంపెనీలో నేరుగా, దాని అనుబంధ కంపెనీల్లో పని చేసేందుకు సుమారు 9వేల మంది వరకు నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అవసరం కానున్నారు. మెకానికల్‌, ఆటోమొబైల్స్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పాలిటెక్నిక్‌ చదివిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కియాలో నేరుగా నైపుణ్యం కలిగిన 2వేలు మంది, కొద్దిపాటి నైపుణ్యం కలిగిన వెయ్యిమందికి ఉద్యోగాలు లభించనున్నాయి.

ఢిల్లిలో జరగనున్న నీతిఆయోగ్‌ సమావేశంలో తాను పాల్గొన నునట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇంకా అజెండా తమకు అందలేదని, అనంతరమే ఏయే అంశాలపై ప్రస్తావించాలో ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. శనివారం వెలగపూడి సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయమై స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సైతం ఈ భేటీలో పాల్గొనే అవకాశం వుందని పేర్కొన్నారు. కాగా ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన అనంతరం మొట్టమొదటిసారిగా ప్రధాని, చంద్రబాబునాయుడు కలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతోంది. ఫలితంగానే ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా మోడీని కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోరే అవకాశాలున్నాయని సమాచారం.

cbn 10062018 2

అయితే, ఇదే సందర్భంలో, 17వ తారీఖు, చంద్రబాబు, మోడీ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారని, దీని కోసం ఇప్పటికే ప్రధాని కార్యాలయం, ముఖ్యమంత్రిని కలిసి అప్పాయింట్మెంట్ అడిగినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే విషయం పై విలేకరులు, చంద్రబాబుని అడగగా, ఆయన నవ్వుతూ, సోషల్ మీడియాలో ఎన్నో వస్తాయి, వాటికి నన్ను అడిగితే ఎలా, ఇప్పటికి అయితే నీతి అయోగ్ సమావేశంలో పాల్గునటానికి వెళ్తున్నా అని సమాధానం ఇచ్చారు. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నీతిఅయోగ్‌ మీటింగ్‌ జరుగుతుండడంతో ఈ సమావేశంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

cbn 10062018 3

రాష్ట్రాలకు గ్రాంట్ల విషయంలో పీఓఆర్‌పై పలు రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య పన్నుల ఆదాయం పంపిణీ, రాష్ట్రాల గ్రాంట్ల విషయంలో నీతిఆయోగ్‌కు కేంద్రం ఇచ్చిన నిబంధనలను ఆంధ్ర ప్రదేశ్‌తో పాటు ఇతర పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్పూర్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని ఆరోపణలు వచ్చాయి. నాన్‌ బీజేపీ పార్టీలు, అధికారంలో ఉన్న రాష్ట్రాలు తప్పు పడుతున్నాయి. ఆ రాష్ట్రాల ఆర్థికమంత్రుల సదస్సు కొత్త నిబంధనలు ఖండించింది. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తుండడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

ఏడున్నర దశాబ్ధాల విఘ్నాలను పోలవరం ఎట్టకేలకు అధిగమించింది. అమలుకు నోచని విభజన హామీలతో అభద్రతాభావంలో కూరుకుపోయిన ఆంధ్ర జాతికి ఇప్పుడు పోలవరం ప్రాణనాడి కాబోతోంది. ఆల్మట్టి నిర్మాణంతో ఆకా రం కోల్పోయిన కృష్ణా బేసిన్‌కు జీవనాడై ఊపిరులు ఊదబోతోంది. అడుగడుగు విఘ్నాలతో ప్రాజెక్టుపై ప్రజలు ఆశలు కోల్పోతున్న దశ లో ఈ విళంబి నామ సంవత్సరంలో పోలవరం ఊహలకు అందని ప్రొగ్రెస్‌ను సొంతం చేసుకున్నది. ఇప్పటివరకు పూర్తయిన 55 శాతం పనుల్లో గడిచిన అయిదు నెలల కాలంలోనే 25 శాతం పనులు జర గడం ఈ ఏడాది పోలవరం పురోగతికి అద్దం పడుతోంది. సాంకేతిక సమస్యల సమాహారంగా మారిన ఈ ప్రాజెక్టు బలారిష్టాలను దాటు తుండడం ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రజల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

polavaram 10062018 2

నిధుల కేటాయింపులో కేంద్రం కొర్రిలు పెడుతున్నా ప్రాజెక్టు నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్ర భుత్వం ముందుకు సాగుతుండడం సర్కార్‌ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది. నెలకోసారి సందర్శన, వారం వారం సమీక్షలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనులను స్వయంగా పర్యవేక్షిస్తుం డడంతో ఎన్నో దశాభ్దాల పోలవరం కల ఏడాదికాలంలోనే సాకారమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దశాబ్దాల కలగా ఉన్న పోలవరంలో ఎట్టకేలకు కదలిక రావడం అందరిలో ఆశలు రేకెత్తిస్తోంది. ఎన్నో ప్రతిపాదనలను, ఎందరో పాలకులను చూసిన పోలవరం ఇన్నాళ్ల కు సగానికిపైగా పనులు పూర్తి చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుపై పలు హామీ లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలలో తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం సహకారంపై నానాటికీ ఆశలు కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో సింహభాగం పోలవరానికే కేటాయించి అయినా వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

polavaram 10062018 3

ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 23 సార్లు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్లిన ఆయన ఈ నెల 18న మరోసారి పోలవరం సందర్శనకు వెళ్లబోతున్నారు. అదే రోజున ఇప్పటికే పనులు పూర్తి చేసుకున్న డయాఫ్రమ్‌ వాల్‌ను ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రతి సోమ వారం క్రమం తప్పకుండా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తు న్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు జాప్యానికి గుత్తేదారుల నిర్లక్ష్యమే కారణంగా భావించిన ప్రభుత్వం ఆ పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి నవయుగకు బదిలీ చేసింది. అప్పటి నుంచే పనుల్లో కూడా కదలిక వచ్చినట్లు కనబడుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటి వరకు 55 శాతానికి చేరుకోగా అందులో సగ భాగం గడిచిన 5 నెలల కాలంలోనే జరగడంతో లక్ష్యానికి తగ్గట్టుగా అనుకున్న సమయానికి పనులు పూర్తయితాయన్న ఆశాభావం ప్రభుత్వంలో కనిపిస్తోంది. 4వేల మంది కార్మికులు, 150 మంది ఇంజనీర్లు, అత్యాధునిక యంత్రాలతో యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతున్న తీరును బట్టి ముఖ్యమంత్రి ఆశయం నెరవేరే అవకాశం మెండుగానే కనిపిస్తుంది.

496 రోజుల వ్యవధిలోనే 1400 మీటర్ల పొడవైన డయాఫ్రమ్‌ వాల్‌ పని పూర్తికావడం పోలవరం చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. అతి తక్కువ సమయంలో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తికావడం పట్ల ముఖ్యమంత్రి పూర్తి సంతృప్తితో ఉన్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ను ఈనెల 18న జాతికి అంకితం చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కీలకమైన స్పిల్‌వే పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 16.39 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికే సగ భాగం పూర్తి అయింది. ఇప్పటివరకు రోజుకు 3వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనులు జరుగుతుండగా, రోజుకు 4వేల క్యూబిక్‌ మీటర్ల పనులు జరిగేలా అదనపు యంత్రాలను రం గంలోకి దించారు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తి కాగా, ఇందుకు సమాంతరంగా కాపర్‌డ్యామ్‌ పనులు కూడా వేగం పుంజుకున్నాయి. ఇదిలా ఉండగా పోలవరం ప్రధాన కుడికాలువ పనులు 93 శాతం పూర్తికాగా, ఎడమ కాలువ పనులు 60 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికే పోలవరం ప్రాజెక్టుపనులు పూర్తిచేసి , గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read