అంతా తానై..అన్నీ తానై రాజకీయాలు నడిపించే చంద్రబాబు వ్యూహం మార్చేశారు. పరిస్థితులు అనుకూలించి మంచి నాయకత్వం అందుబాటులోకి రావడంతో బాబు రిలాక్స్డ్ పాలిటిక్స్ చేస్తున్నారు. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ కేడర్ లీడర్లలో మంచి క్రేజ్ ఏర్పడింది. టిడిపి కొద్దిగా బలహీనంగా ఉన్న చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ఇంపాక్ట్ బాగా పడింది. పెద్దిరెడ్డి ఇలాఖాలోనూ టిడిపి యువనేత తొడగొట్టి సవాల్ విసిరి టిడిపిలో నవ్యోత్తేజం నింపారు. చంద్రబాబు రాజకీయాలకి పరిమితమైతే లోకేష్ క్షేత్రస్థాయిలో చుట్టేసి వస్తున్నారు. ఇక ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకి ఎవరు అధ్యక్షులైనా, వారి పాత్ర నామమాత్రమేనని, ఆ పార్టీ అధినేతదే అంతా అనే పద్ధతి మారిపోయింది. కింజరాపు అచ్చెన్నాయుడు దూకుడు, చొరవని నియోజకవర్గ విభేదాలు సరిదిద్దేందుకు, ఐక్యత సాధించేందుకు, కేడర్‌కి అండగా నిలిచేందుకు వాడుతున్నారు. టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండే బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల కాలంలో టిడిపిలో చాలా చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటు ఏపీ, అటు తెలంగాణ టిడిపి కార్యక్రమాలకి హాజరవుతూ తెలుగుదేశంలో జోష్ నింపుతున్నారు. చంద్రబాబుకి లోకేష్, అచ్చెన్న, బాలయ్య రూపంలో మంచి కమిట్మెంట్, చరిష్మా, దూకుడు ఉన్న నేతలు అదనపు బలంగా సమకూరారు. దీంతో కొన్ని కార్యక్రమాలని ఈ ముగ్గురికి అప్పగించి రాజకీయ వ్యూహాలు, పార్టీ ఎత్తులు, ఎన్నికల ప్రణాళికలో నిమగ్నమయ్యారు చంద్రబాబు.
news
తన ప్రభుత్వం పై వస్తున్న ప్రజా వ్యతిరేకత చూసి, ఇప్యాక్ పై జగన్ ఆగ్రహం
వైకాపాలో ఐ ప్యాక్ చెప్పిందే వేదం. జగన్ రెడ్డి ఐ ప్యాక్ గీసిన గీత దాటడు. ఇది నిన్నా మొన్నటి మాట. ఇప్పుడు ఐప్యాక్ అంటే జగన్ యాక్ అంటున్నారు. ప్రభుత్వంపై విపరీతమైన ప్రజావ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో జనంతో జగన్ ఉండేలా ఐ ప్యాక్ కార్యక్రమాలు రూపొందిస్తోంది. అసలు జనం వద్దకి వెళ్లడం ఇష్టంలేని జగన్, తాను వెళ్లకుండా తన పేరుతో ఓట్లు కొల్లగొట్టే ప్రణాళికలు ఇవ్వాలంటూ ఐప్యాక్ ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటే పరదాలు, విపరీతమైన పోలీసు బందోబస్తు, 10 కిలోమీటర్ల ప్రయాణానికి హెలికాప్టర్ వంటివి వాడుతున్న జగన్...జనం అంటేనే భయపడుతున్నారు. సభలకి వచ్చే జనం కూడా తన మనుషులే అయి ఉండాలన్నట్టు, అక్కడ ఎవరూ ఏ సమస్యపై అడగకూడదనేది జగన్ ఆలోచన. ఉప్పెనలో ఎగసిపడుతున్న ప్రజావ్యతిరేకత నేపథ్యంలో అది జరగని పని. ఐప్యాక్ బాధ్యతలు చూస్తున్న రుషిరాజ్ సింగ్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లన్నీ జగన్ రెడ్డిని జనంతో ఇంటరాక్ట్ చేసేలా ఉన్నాయి. జగనన్నకి చెబుదాం అనే కార్యక్రమం చాలా రోజుల క్రితమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ జగన్ ఒప్పుకోక ఇన్నాళ్లూ వాయిదా పడి ఇప్పుడు ఇలా పాత 1100ని నెంబర్ మార్చి 1902 పెట్టి జగనన్నకి చెబుదాం పేరుతో ప్రారంభించేశారు. ఐప్యాక్ చెప్పిన రోడ్లే వేయాలి, ఐప్యాక్ చెప్పిన వారికే టికెట్ అనే స్థాయి నుంచి ఐప్యాక్ చెప్పిన కార్యక్రమం అంటే తరువాత ఆలోచిద్దాం అనేంత వెగటుకి వచ్చేశారట జగన్ రెడ్డి.
వైకాపా పంచన చేరిన, జనసేన ఎమ్మెల్యే రాపాక అడ్డంగా దొరికిపోయాడు.
ఒకరిని విమర్శించామంటే మనం చాలా క్లీన్‌గా ఉండాలి. ఒకరిపై ఆరోపణలు చేశామంటే, మనపై ఎవరూ ఏ ఆరోపణా చేసే అంశాలు లేకుండా ఉండాలి. జనసేనలో గెలిచి, వైకాపాలో కలిసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసేవన్నీ పిచ్చ పనులు..చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. నిత్యమూ పేకాట ఆడుతూ పోలీసులకి దొరికితే అధికార పార్టీ అండతో తప్పించుకుంటూ ఉంటాడు. గెలిచింది జనసేన పార్టీ తరఫున అయినా అమ్ముడుపోయింది వైకాపాకి. తనని పదికోట్లకి కొనుగోలు చేయాలని చూసింది తెలుగుదేశం అంటూ మీడియా ముందుకు వచ్చి పతివ్రతలా పలావు వండాడు. జనసేన సోషల్ మీడియా మామూలుగా ఉండదు. రాపాక బోకు కబుర్లని చీల్చి చెండాడేశాయి. ఆ తరువాత తాను దొంగ ఓట్లతోనే గెలిచానంటూ వ్యాఖ్యానించి, ఇప్పుడు ఎన్నికల కమిషన్ విచారణ ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రజాధనం తన సొంతానికి వాడుకుని వార్తల్లో నిలిచాడు. కోనసీమ జిల్లా మలికిపురం మండలం కత్తిమండ గ్రామంలో ఇటీవల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓ ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంటి వరకూ పంచాయతీ రోడ్డు నుంచి మరో కొత్త రోడ్డు నిర్మించారు. కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకున్న ఎమ్మెల్యే రాపాక, ఆ ఇంటికి రోడ్డు మాత్రం ప్రభుత్వ నిధుల్ని వాడుకున్నాడు. ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేయించుకుని తన ఇంటికి ఏకంగా రోడ్డేసేశారు. ఎంపీ ల్యాడ్స్ నిధులు తన సొంత ఇంటి రోడ్డుకి వినియోగించారని కేశవదాసుపాలెం గ్రామానికి చెందిన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కూడా జరుగుతుంటే, అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యే రాపాక రకరకాల కహానీలు వినిపిస్తున్నాడు.
చంద్రబాబుని ఆ బాబు బురిడీ కొట్టించినట్టే, జగన్ ని ఈ బాబు బోల్తా కొట్టిస్తున్నాడు
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక ఐఏఎస్ బాబు పాలనలో కొత్త విధానాలు, కనిపించే పాలన, కనిపించని ప్రభుత్వం, ఈ ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్ వంటి మంచి ప్రాజెక్టుల అమలుకి నేతృత్వం వహించారు. వీటి ఫలితాలు బాగుండడంతో అతన్ని చంద్రబాబు బాగా నమ్మారు. దీంతో ఆయన తన బృందాలు, టీములతో చంద్రబాబు చుట్టూ చేరి...పార్టీ యంత్రాంగానికి, ప్రజలకి దూరం అయ్యేలా చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు పాలన పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, 98 శాతం, 99 శాతం ఫీడ్ బ్యాక్ చూపించేవారు. 2019 ఎన్నికల ఫలితాలు వస్తే కానీ తెలియలేదు ఆ సంతృప్తిశాతం అంతా బోగస్ అని. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా జనం తన పాలన పట్ల బాగా సంతృప్తిగా ఉన్నారనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని నిజం చేసేలా ఐప్యాక్ రుషిరాజ్ సింగ్ జగనన్నే మా నమ్మకం కార్యక్రమానికి 2 కోట్ల మంది మిస్డ్ కాల్ ఇచ్చి మద్దతు ప్రకటించారని, ఈ ఓట్లు చాలు వైకాపాకి మళ్లీ అధికారం రావడానికి అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చేశారు. అంతటితో ఆగకుండా వైకాపా ప్రభుత్వం పట్ల ప్రజలు కనబరిచిన విశ్వాసం విజయానికి సూచిక అంటూ ఈ కార్యక్రమంలో భాగమైన మొత్తం ఐప్యాక్ బృందాలన్నింటికీ గ్రాండ్ పార్టీ ఇచ్చేశాడు. మొత్తానికి చంద్రబాబు ఐఏఎస్ లు, కన్సల్టెంట్లని నమ్ముకుని ప్రజలకి పార్టీకి దూరమైతే...జగన్ రెడ్డి ఐప్యాక్-సలహాదారుల్ని నమ్ముకుని పార్టీకి-ప్రజలకి దూరం అవుతున్నారు.