కరకట్ట కమల్ హాసన్ అని టిడిపి వారు ముద్దుగా పిలుచుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తోక కత్తిరించి పారేశారు జగన్ రెడ్డి. మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ రెడ్డి తనను మోసం చేశారనే ఆగ్రహంతో ఉన్న ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చుట్టూ అసమ్మతులను మొహరిస్తున్నాడు. ఒకానొక దశలో షర్మిల వర్గంగా ఆర్కే బయటపడిపోయారు. దీంతో జగన్ మంగళగిరి ఎమ్మెల్యేని శత్రువుని చూస్తున్నట్టే వ్యవహరిస్తున్నాడు. షర్మిలని వైకాపా నుంచి కానీ, ఏపీ నుంచి ఎవరైనా కలిస్తే క్షణాల్లో జగన్ రెడ్డికి సమాచారం వచ్చేస్తోంది. షర్మిల చుట్టూ జగన్ నిఘా బృందాన్ని ఉంచారని ఇటీవలే డిఎల్ రవీంద్రారెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలతో రహస్య భేటీలు జగన్ దృష్టికి వచ్చాయి. మంగళగిరిలోనూ విపరీతమైన ప్రజావ్యతిరేకత ఉందని, నారా లోకేష్‌ని తట్టుకుని నిలబడే శక్తి కోల్పోయారని ఆర్కే ని దూరం పెడుతూ వస్తున్నారు వైకాపా పెద్దలు. మంగళగిరి చేనేతవర్గానికి చెందిన నేతలని వైకాపాలో చేర్చుకుని ఆర్కేకి పొగబెట్టారు. మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి వంటి వారిని టిడిపి నుంచి తీసుకుని ఒకరికి ఎమ్మెల్సీ, ఇంకొకరికి ఆప్కో చైర్మన్ పోస్టులు కట్టబెట్టారు. వచ్చే ఎన్నికలకి వైకాపా టికెట్ ఆళ్ల రామకృష్ణారెడ్డికి లేదనే బలమైన సంకేతాలు పంపుతున్నారు జగన్. తన కొడుకు పెళ్లికి సీఎంని కనీసం ఆహ్వానించలేదు ఆర్కే. తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగే ఎమ్మెల్యేల సమీక్షకి కూడా హాజరు కాలేదు. ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైకాపాలోనే వ్యతిరేక వర్గంగా ఉన్న దొంతి రెడ్డి వేమారెడ్డికి మంగళగిరి వైసీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి ఆళ్ల రామకృష్ణారెడ్డికి పెద్ద దెబ్బే కొట్టింది వైసీపీ. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన వ్యతిరేక వర్గానికి నాయకుడైన దొంతిరెడ్డికి పదవి కట్టబెట్టడం ముమ్మాటికీ ఆర్కే తోక కత్తిరించడమేనని వైసీపీలో టాక్ వినిపిస్తోంది. ఆర్కేకి పడనివారికి పదవులు కట్టబెడుతూ, ఆర్కేకి కుడిఎడమ భుజాల్లాంటి నేతలైన మంగళగిరి పట్టణ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావును, తాడేపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు బుర్ర ముక్కు వేణుగోపాలస్వామి రెడ్డి పదవుల నుంచి తొలగించారు. అంటే వైకాపా నుంచి ఇక తమరు దయ చేయొచ్చు అని ఆళ్ల రామకృష్ణారెడ్డికి డైరెక్టుగానే సంకేతాలు పంపేశారు జగన్ రెడ్డి.
news
జగన్ ఫ్రాంచైజీకి పడిపోయిన క్రికెటర్ అంబటి రాయుడు ?
ఐపీఎల్-ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడిన అంబటిరాయుడుని జేపీఎల్-జగన్ పొలిటికల్ లీగ్‌లో చేరుతున్నాడు. ఇటీవల వరసగా వైకాపా పాలనని, సీఎం జగన్ రెడ్డిని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్న అంబటిరాయుడు అందరూ ఊహిస్తున్నట్టే సీఎం జగన్ ను కలిశాడు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన అంబటి రాయుడు, నేడో రేపో వైకాపాలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. టీమిండియాకి ఆడిన క్రికెటర్ అంబటిరాయుడు తన ఆటకంటే ఎక్కువగా నిత్యం వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా ఉండేవాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకున్న అంబటి రాయుడు ఆట అంతంత మాత్రమే. క్రికెట్ ఆటని చాలించి పొలిటికల్ గేమ్ కి రెడీ అవుతూ జగన్ పొలిటికల్ లీగ్‌లో చేరడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. దీనికంటే ముందు ఏపీ సర్కారు కార్యక్రమాలను ప్రశంసిస్తూ అంబటి ట్వీట్లు వేశారు. ఏపీ సీఎం చేసే ట్వీట్లను అంబటి రాయుడు రీట్వీట్ చేయడంతో వైకాపాతో టైఅప్‌లో ఉన్నాడని అంతా అనుకున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు జగన్ శంకుస్థాపన సందర్భంగా సీఎం ప్రసంగాన్ని వైసీపీ ట్విట్టర్ నుంచి అంబటి రాయుడు రీట్వీట్ చేశాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం వెల్లలూరు కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు వైకాపా ప్యాకేజీ పాలిటిక్స్ నుంచి బయటకొచ్చి ఏకంగా పోటీకి దిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ ని వీడి జేపీఎల్ లో చేరి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేందుకు ఉవ్విళ్లూరుతున్న అంబటిరాయుడు ముసుగు తీసేసాడు. ఇన్నాళ్లు ట్విట్టర్ హ్యాండిల్ వైకాపాకి అద్దెకిచ్చిన అంబటిరాయుడు ఇప్పుడు తానే జగన్ ఫ్రాంచైజీకి చిక్కాడని తేటతెల్లం అయ్యింది.
అదృశ్యశక్తి పనిచేసిందా ? అవినాష్ రెడ్డి అరెస్టు ఆగిపోయిందా ?
ఏ క్షణంలోనైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని కోర్టుకి చెప్పిన సీబీఐ ఏమైంది? ముందస్తు బెయిల్ పిటిషన్‌ని సుప్రీంకోర్టు హైకోర్టుకి పంపింది. హైకోర్టు అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేసింది. అయినా అవినాష్ రెడ్డి అరెస్టు జరగలేదు. అన్నికోర్టుల్లోనా అవినాష్ రెడ్డి నిందితుడు అని అఫిడవిట్లు వేసిన సీబీఐ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో పూర్తిగా మౌనం దాల్చేసింది. దీని వెనుక ఏదో అదృశ్యశక్తి ఉందంటూ ఏబీఎన్ ఆర్కే తన కొత్త పలుకులో రాశారు. ఆయన పేరు రాయకపోయినా కేంద్రంలో ఉన్న బీజేపీయే ఆ అదృశ్యశక్తి అని ఏపీలో చిన్నపిల్లాడికి సైతం తెలుసు. తన తండ్రిని చంపేశారని రిలయన్స్ ఆస్తులు ధ్వంసం చేయించిన జగన్ రెడ్డి అదే రిలయన్స్ వాళ్లకి రాజ్యసభ సీటిచ్చారు. ఆయనే పరిమళ్ నత్వానీ. రిలయన్స్ తరఫున లాబీయింగ్ చేసే కింగ్ పిన్. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో సీబీఐపై ఒత్తిడి తెచ్చి వివేకానందరెడ్డి కేసు నీరుగార్చేందుకు, అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండేందుకు జగన్ రెడ్డి కోసం పనిచేసిన మొదటి అదృశ్యశక్తి. ఒక కన్నుని పొడిచిన మరో కన్ను అరెస్ట్ తప్పదనుకునే సమయంలో ప్రధాని మోదీకి అత్యంత ఆప్తుడు అదానీతో జగన్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మరో అదృశ్యశక్తి పనిచేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి హాయిగా తడిగుడ్డ వేసుకుని ఇంట్లో పడుకున్నాడు. తనను ఏ సీబీఐ ఏం చేయలేదనే ధైర్యంతో వీడియోలు విడుదల చేస్తున్నాడు. అన్ని అదృశ్యశక్తులు కలిసి..వివేకానందరెడ్డి ఆత్మహత్యచేసుకున్నాడని కేసు క్లోజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఏపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ సామెతను జగన్ నిజం చేస్తున్నాడా ? అమరావతే సాక్ష్యం..
కట్టడం చేతకాని వారు ఏం చేస్తారు? కూలగొడతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాడు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన విధ్వంసం, అమరావతి నాశనానికి కంకణం కట్టుకోవడంతో పతాకస్థాయికి చేరింది. మూడు రాజధానుల పేరుతో విశాఖని ధ్వంసం చేస్తున్నారు. కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ చీవాట్లు పెడుతున్నా రుషికొండకి గుండు కొట్టడం ఆపలేదు. సెల్ఫ్ ఫైనాన్ష్ ప్రాజెక్టు అయిన అమరావతిని పూర్తి చేయడానికి లక్ష కోట్లు కావాలని సాకు చూపెడుతూ, మరోవైపు రాజధానిలో విధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాజధాని అమరావతిలో టిడిపి ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లని నేటికీ లబ్ధిదారులకు వైకాపా ప్రభుత్వం అప్పగించలేదు. ఇప్పుడు రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నిమిత్తం 1134ఎకరాల భూమిని బదలాయించారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా, రాజధాని ప్రాంతంలో నోటిఫై చేసిన ఆర్-5 కొత్త జోన్‌లో పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియ ప్రారంభించడం అమరావతిలో మరో విద్వేష విధ్వంస కుతంత్రమేదో పన్నినట్టు తెలుస్తోంది. గుంటూరు-కృష్ణా జిల్లాల మొత్తం రెవెన్యూ యంత్రాంగమంతా ఈ పట్టాల పంపిణీ పూర్తి చేసేవరకూ వేరే పనులు ముట్టుకోవద్దని ప్రభుత్వ పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందాయని ప్రచారం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గృహప్రవేశాలకి సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను ఇప్పటికీ లబ్ధిదారులకు అప్పగించకుండా, రాజధాని ఇతర ప్రాంతాల పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వైకాపా అనుకూల మీడియా కథనాల ప్రకారం రాజధాని ప్రాంతంలో ఉన్న వ్యతిరేకతతో ఇక్కడి సీట్లు ఓడిపోవడం ఖాయమని, ఇతర ప్రాంతాల నుంచి తమకు సాలిడ్ ఓటింగ్ వర్గాలని ఇక్కడకి తరలించేందుకు ఈ సెంటు స్థలం నాటకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.