నవ్యాంధ్ర, భారత్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతున్నా చంద్రబాబు
పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు విదేశీ ప్రముఖులతో చర్చలు
‘అందరికీ ఇంటర్నెట్’ అద్భుతం
విశాఖలో ‘మాస్టర్ కార్డ్’ టెక్నాలజీ సెంటర్
ఫైబర్ గ్రిడ్, సీఎం కోర్ డ్యాష్ బోర్డుపై ప్రశంసల జల్లు
అధ్యయనానికి రానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం బృందం
దావోస్ : అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మరోసారి మార్మోగింది. అందరికీ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు ప్రశంసలు కురిపించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో ‘ఇంటర్నెట్ ఫర్ ఆల్’ అనే అంశంపై చర్చ జరిగింది. ఇందులో ఏపీ ఫైబర్ నెట్, సీఎం కోర్ డ్యాష్ బోర్డుపై ఉగండా, బ్రెజిల్ సహా పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. అందరికీ ఇంటర్నెట్ విషయంలో ఏపీ అనుసరణీయంగా వుందని, దీనిపై ప్రపంచదేశాలు దృష్టి పెట్టాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధికారులు సూచించారు. ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్టు చెప్పారు. ఏపీలో అమలుచేస్తున్న జల సంరక్షణ విధానాలు, సీయం కోర్ డ్యాష్ బోర్డును సైతం ఈ బందం అధ్యయనం చేయనుంది.
విశాఖలో ‘మాస్టర్ కార్డ్’ టెక్నాలజీ సెంటర్!
విశాఖలోని ఫిన్‌టెక్ కేంద్రంలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ‘మాస్టర్ కార్డ్’ సానుకూలత వ్యక్తం చేసింది. విశాఖలో టెక్నాలజీ సెంటర్ నెలకొల్పాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనకు స్పందించిన ఆ సంస్థ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ ఏన్ కేన్స్ తమ సంస్థ ఆసియా కార్యకలాపాల విభాగాధిపతికి ఈ ప్రతిపాదన తెలియజేసి, తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రపంచవ్యాప్తంగా అమలులోవున్న ఉత్తమ పద్ధతుల గురించి ఏపీ ప్రభుత్వంతో పాలుపంచుకుంటామని ఏన్ కేన్స్ అభిలాష వ్యక్తం చేశారు. చిన్నతరహా వ్యాపారులు, వినియోగదారులకు అందుబాటులో వుండేలా మాస్టర్ కార్డు ద్వారా సాంకేతికతను ఎలా అభివృద్ధి చేస్తున్నది ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం 200పైగా దేశాలలో ‘మాస్టర్ కార్డు’ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ముఖ్యమంత్రితో బజాజ్, ఎయిర్ బస్ దిగ్గజాల భేటీ
భారత పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. దావోస్‌లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భారత్, ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారంటూ చంద్రబాబును రాహుల్ బజాజ్ కొనియాడారు. ఈ సందర్భంగా రాహుల్ బజాజ్‌ను శాలువాతో సత్కరించిన ముఖ్యమంత్రి కొండపల్లి బొమ్మలను బహూకరించారు.
ఎయిర్ బస్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డర్క్ హోక్ ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. చంద్రబాబుతో సమావేశం కావడం డర్క్ హోక్‌కు ఇది మూడవ సమావేశం. గత ఏడాది దావోస్ సదస్సులో, ఆ తరువాత ఆగస్టులో మరోసారి చర్చలు జరిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఆటో గ్రిడ్ సిస్టమ్స్ సంస్థ సీఈవో, డబ్లుఈఎఫ్ సాంకేతిక మార్గదర్శి అమిత్ నారాయణ్ కూడా వున్నారు. వివిధ సాంకేతిక అంశాలపై ఉభయుల మధ్య చర్చ జరిగింది. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై అమిత్ నారాయణ్ ఆసక్తి కనబరిచారు. గ్రిడ్‌లో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థపై అవగాహన కోసం రాష్ట్రానికి రావాలని అమిత్ నారాయణ్‌కు ముఖ్యమంత్రి ఆహ్వానించారు.
విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు సన్నాహాలు
విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుపై ఆ సంస్థ ప్రతినిధి రవికుమార్, ముఖ్యమంత్రి మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఇన్ఫోసిస్ విస్తరణ దిశగా పలు ప్రణాళికలు రూపొందించినట్టు రవికుమార్ వెల్లడించారు. మరోవైపు FtCash సంస్థ ఫౌండర్ వైభవ్ లోథా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు.
పవన విద్యుత్ కేంద్రం స్థాపించనున్న అబ్రాజ్ గ్రూప్
రాష్ట్రంలో 300 మెగావాట్ల సామర్ధ్యం గల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి అబ్రాజ్ గ్రూపు సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కలిసిన అబ్రాజ్ గ్రూప్ లిమెటెడ్ అసోసియేటెడ్ డైరెక్టర్ కునాల్ పరేఖ్, భాగస్వామి తాస్ అన్వారిపౌర్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు ఓ బృందాన్ని పంపనున్నట్టు తెలిపారు.
ఏపీ ఈడీబీని మరింత బలసంవర్ధం చేసేందుకు మీకున్న అనుభవంతో మార్గదర్శనం చేయాలని సింగపూర్ ఈడీబీ చైర్మన్‌ను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
సింగపూర్ ఈడీబీ వ్యవస్థీకృత నిర్మాణం, దాని బాధ్యతల గురించి వివరించిన Beh Swan Gin.
సింగపూర్ దేశానికి పరిశ్రమల్ని తీసుకురావడంలో ఈడీబీ పాత్ర, అక్కడ పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న తీరును విశదీకరించిన Beh Swan Gin.


