జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఆయన ధోరణి పూర్తిగా మారిపోయింది. నియంత కంటే ఘోరంగా తయారయ్యారని వైసీపీలోనే గుసగుసలు ఆరంభం అయ్యాయి. ఎమ్మెల్యేలతో ఎప్పుడు సమావేశమైనా తన ఫోటోతో గెలిచారు, మీరు కాకపోతే ఇంకొరు వస్తారన్నట్టు చాలా ధీమాగా ఉండేవారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావుదెబ్బతో నలుగురిపై సస్పెన్సన్ వేటు వేసి..తనంత ధైర్యవంతుడు లేనే లేడంటూ సొంత మీడియాలో సెల్ఫ్ డబ్బా కొట్టించుకున్నాడు. అయితే అసలు విషయం టిడిపి వెల్లడించింది. వైసీపీ నుంచి 40 మంది టచ్‌లో ఉన్నారని దాని సారాంశం. ఈ నేపథ్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కి పిలిచారు. ఈ సమావేశంలోనే 25 మందికి టికెట్లు ఇచ్చేది లేదని జగన్ రెడ్డి చెప్పేస్తారని, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తారని లీకులిచ్చారు. తీరా సమావేశం ఆరంభం అయ్యాక బతిమాలుకునే ధోరణిలో జగన్ స్వరంలో మార్పుకి వైసీపీ ఎమ్మెల్యేలు షాకయ్యారు. నా ఫోటోతో గెలిచారు, పీకేస్తాను, విసిరేస్తాను, నా బటన్ నేను నొక్కుతున్నాను, మీరే ఇక చేయాలి అంటూ చెప్పే డైలాగులు ఒక్కటి జగన్ రెడ్డి నోటి నుంచి రాలేదు. ఏ ఒక్క ఎమ్మెల్యేని వదులుకోవడానికి సిద్ధంగా లేనంటూ కొత్త జగన్ నాటకం చూసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇంతలో ఎంత మారిపోయాడంటూ ముక్కున వేలేసుకున్నారు. ఎమ్మెల్సీల ఎన్నికల్లో ఓడించి తమ అధినేత జగన్‌కి బుద్ధిచెప్పిన చంద్రబాబుకి వైసీపీ ఎమ్మెల్యేలు మనసులోనే థ్యాంక్స్ చెబుతున్నారట. టిడిపి దెబ్బకు జగన్ రెడ్డి దెయ్యం దిగిందని, ఎమ్మెల్యేలను గుర్తిస్తున్నారని, ఈ పరిస్థితికి దారి తీయటానికి చంద్రబాబు కారణం అని, అంతర్గత సంభాషణల్లో ఆయనకు థాంక్స్ చెబుతున్నారు.
news
జగన్ నమ్మకాన్నే అమ్మేస్తున్న ఐ ప్యాక్..నియోజకవర్గాల్లో సైడ్ బిజినెస్
వైసీపీ అంటేనే ఐ ప్యాక్. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ షార్ట్ కట్‌లో ఐ ప్యాక్ వైసీపీ అధిష్టానం లెక్క. రోడ్లన్నీ గుంతలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ఐప్యాక్ సెలెక్ట్ చేసిన రోడ్లే వేయాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చారు జగన్ రెడ్డి. వైసీపీ సమీక్షలు, సమావేశాలు, టికెట్ల ఎంపికలు, తప్పించడాలన్నీ ఐప్యాక్ సర్వేల ఆధారంగానే చేస్తుంటారు. ముఖ్యమంత్రికి కళ్లూ, చెవుల్లా మారిన ఐ ప్యాక్ అంతా తమ గుప్పెట్లోకి తెచ్చుకుంది. ప్రతిపక్షనేతగా ఉన్న తనని ముఖ్యమంత్రిని చేసింది ఐప్యాక్ అనే నమ్ముతున్న జగన్మోహన్‌రెడ్డి, ఆ సర్వే సంస్థ ఏమి చెబితే అదే వేదంగా భావిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రతీ నియోజకవర్గంలోనూ ఐప్యాక్ మూడు రకాల సర్వేలు చేస్తూ నివేదికలు వైసీపీ పెద్దలకు అందజేస్తూనే ఉంది. మంత్రుల చుట్టూ ఉండేది కూడా ఐప్యాక్ మనుషులే. సీఎం కూడా పార్టీ నేతలకంటే ఎక్కువగా ఐప్యాక్ టీముని నమ్ముతుండడంతో అందరూ ఐ ప్యాక్ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఐ ప్యాక్ టీము తమకి చేయి తడిపిన వారికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారని వైసీపీకి మద్దతుగా నిలిచే ప్రముఖ దినపత్రికలో ప్రత్యేక కథనం ప్రచురితం అయ్యింది. బాగా పనిచేస్తున్న ఎమ్మెల్యేలు ఐ ప్యాక్ వారికి తృణమో, పణమో ఇవ్వకపోతే వారికి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తున్నారని పార్టీలో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. నేతలంతా ఐ ప్యాక్ బాధితులే. కానీ ఎవ్వరూ సీఎం జగన్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్పలేరు. ఆయన దృష్టికి వెళ్లాలనే వైసీపీలో కీలక నేతలు తమ చెప్పుచేతల్లో ఆ పత్రికలో ఐ-ప్యాక్ ప్యాకేజీ పాలిటిక్స్‌పై ప్రత్యేక కథనం వేయించారని సమాచారం బయటకి పొక్కింది.
ఐ ప్యాక్ సూచన మేరకే, జగన్ ఒంటిమిట్ట పర్యటన రద్దు ?
సీఎం జగన్ రెడ్డి ఒంటరిగా ఒంటి మిట్టకి బయలుదేరారు. అయితే జంటగా వెళ్లాలంటూ ఐ ప్యాక్ సూచించింది. దేవాలయాలకు హిందూ సంప్రదాయాల ప్రకారం దంపతులే వెళ్లి పూజలు చేసి, దేవుళ్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో ఎవ్వరికీ విమర్శించడానికి అవకాశం ఇవ్వకూడదని సీఎంకి హెచ్చరికలాంటి సూచనలు ఐప్యాక్ టీము చేసింది. ఒంటి మిట్ట రాములోరి కళ్యాణానికి ఒంటరిగా వెళ్లొద్దని, సతీ సమేతంగా వెళ్లాలని సూచించింది. అయితే జగన్ కు ఉన్న సమస్యలు కారణంగా అది కుదరని పని కాబట్టి, ఐప్యాక్ వాళ్ల సూచన కాదనలేక ఏకంగా కడప పర్యటననే వాయిదా వేసేశారనే ప్రచారం జరుగుతుంది. గతంలోనూ వ్యాయామం చేస్తూ ఓ సారి కాలు జారిన సీఎం మణిపాల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు కూడా హుటాహుటిన చేయించుకున్నారు. మళ్లీ ఒంటి మిట్ట సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు సమర్పించాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి జగన్ కి మళ్లీ గతంలోలాగే వ్యాయామం చేస్తున్న సమయంలో కాలు బెణికింది. వైసీపీ అధికారిక సోషల్ మీడియా సమాచారం ప్రకారం సాయంత్రానికి నొప్పి తీవ్రం అయ్యిందని, విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు కడప టూరుని అధికారులు రద్దు చేశారు. ముఖ్యమంత్రి ఎంతో భక్తితో ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి వెళ్లాలనుకున్నప్పుడే ఇలా కాలు బెణకడంతో వైసీపీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
చంద్రబాబుపై భారాన్ని, లోకేష్ ఇంతలా తగ్గించాడా ?
టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అన్ని బాధ్యతలు ఆయనే చూసుకుంటారు. 2014 అధికారంలోకి వచ్చాక నవ్యాంధ్ర అభివృద్ధి తప్పించి, పార్టీని కూడా పట్టించుకునే తీరిక లేనంతగా బాబు గడిపారు. తనయుడు లోకేష్ కూడా మంత్రిగా ఉండడంతో ప్రభుత్వం-ప్రజలు-అభివృద్ధి అన్నట్టుగా సాగింది టిడిపి సర్కారు తీరు. సమీక్ష అయినా, పార్టీ కార్యక్రమం అయినా, ప్రతిపక్ష బాధ్యత అయినా అంతా చంద్రబాబు చుట్టూనే తిరిగేది. ఇది నిన్న మొన్నటి వరకు పార్టీలో అన్ని బాధ్యతలు బాబువే.. కానీ ఇప్పుడు లోకేష్ ప్రజల్లో ఉన్నాడు, పిచ్చ క్రేజ్ వచ్చింది, అరవై రోజులు దాటిపోయినా పాదయాత్రకి మరింత స్పందన పెరుగుతుందే తప్పించి తరగడంలేదు. యువనేతగా నారా లోకేష్ జనాకర్షణ శక్తిగా మారారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వెంట ప్రజలు వస్తున్నారు. చంద్రబాబు ప్రజల మధ్య తిరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ప్రజాకర్షక నేతగా లోకేష్ మారారో, చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టడం ఆరంభించారు. పార్టీ మీద ఫోకస్ పెట్టారు. రాజకీయం మొదలు పెట్టారు. దాని ఫలితమే ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు. అంతేకాదు జిల్లాల వారీ సమీక్షలు, బలా బలాల బేరీజు, ఇతర పార్టీలతో సంప్రదింపులు, పార్టీ మంచి చెడు, ఇలా చంద్రబాబు చాణక్యానికి చాలా సమయాన్ని ఇచ్చాడు లోకేష్. దాదాపు ఏడాది పాటు లోకేష్ జనాల మధ్యనే ఉంటారు. ఈ సమయంలో చంద్రబాబు పార్టీ బలోపేతం, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక వంటి కీలక కార్యక్రమాలన్నీ అంతా తానై చక్కబెట్టేస్తున్నారు. ప్రజల్ని చైతన్యం చేసి అరాచక వైసీపీ పోరాడేందుకు సమాయాత్తం చేసే బాధ్యతని బాబు నుంచి లోకేష్ తీసుకోవడంతో చంద్రబాబుకి ఎంతో సమయం చేతచిక్కింది. ఈ సమయాన్నే ఎన్నికల వ్యూహాలు రచించేందుకు బాబు వినియోగిస్తున్నారు.