నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహానగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేవిధంగా అద్భుతంగా నిర్మించాలన్న ధృడ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి గ్రామం వద్ద తాత్కాలిక సచివాలయం (ఐజీసీ-ఇంటెర్మ్ గవర్నమెంట్ కాంప్లెక్స్) నిర్మించారు. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడక దారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు కూడా వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజీసీ, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ ఆహ్లదకరంగా ఉండేవిధంగా అనువైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం పరుస్తున్నారు.
ఇందుకోసం తాత్కాలిక సచివాలయంలోని 5 బ్లాకులతోపాటు పరిసరాలలో 4 కోట్ల 50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో పనులు జరుగుతున్నాయి. బ్లాకులవారీగా పచ్చదనం నింపుతున్నారు. ఇప్పటికే రకరకాల పూల మొక్కలు, పచ్చని చెట్లతో కళకళలాడుతోంది. పూల మొక్కలకు ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి జిల్లా కడియం, కోల్ కత్తా, బెంగళూరుల నుంచి పలు రకాల మొక్కలు తెస్తున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం 92 వేల మొక్కలు నాటి కనువిందు చేయనున్నారు. వందల రకాల పూల మొక్కలతోపాటు గడ్డి మొక్కలను కూడా తీసుకువస్తున్నారు.
ముఖ్యమంత్రి బ్లాక్ ఎదురుగా రెండున్నర ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేస్తారు. ఈ పార్క్ ని రకరకాల పూల మొక్కలతో నింపుతారు. వాటిలో కొన్ని 360 రోజులూ పూస్తూనే ఉంటాయి. పౌంటేన్లు ఏర్పాటు చేస్తారు. పచ్చికబయళ్లు ఏర్పాటు చేస్తారు. శాసనసభ భవనం ముందు కూడా పార్కు ఏర్పాటు చేయడానికి పనులు జరుగుతున్నాయి.
అలాగే నూతన రాజధాని నిర్మాణానికి ఉద్దండరాయునిపాలెంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాన చేసిన ప్రదేశం పూల తోటను మరిపించేవిధంగా రూపొందిస్తున్నారు.