సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని తితిదే కల్యాణ మండపంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధిస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ‘‘ప్రజలకు మేలు జరగాలని 24 గంటలు కష్టపడ్డాం. దాని ప్రభావం రాబోయే రోజుల్లో చూస్తారు. నరేంద్రమోదీ, కేసీఆర్‌, జగన్‌ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు.. అది సాధ్యం కాదు. విభజన చట్టంలో హామీలు భాజపా అమలు చేయలేదు. దర్యాప్తు సంస్థలు, వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. సీబీఐ, ఈడీ దాడులతో అణచివేయాలని చూశారు. అన్యాయం చేసినప్పుడే తిరుగుబాటు చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేని పరిస్థితికి వస్తున్నాం’’ అని చంద్రబాబు అన్నారు.

cbn pk 15012019 2

అలాగే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై కూడా చంద్రబాబు స్పందించారు. కేసీఆర్‌తో జగన్‌ కుమ్మక్కయ్యారని పవన్‌ చెప్పారని, ఆఖరికి తాము చెప్పిందే పవన్‌ కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇలాంటి కుమ్మక్కు రాజకీయాన్ని ఏపీ తిప్పికొట్టబోతోందని ఆయన చెప్పారు. ఏపీలో ఉంటూ, ఏపీలో రాజకీయ పార్టీ నడుపుతూ ఏపీలో వ్యవస్థపై నమ్మకం లేదంటారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఏం చేయాలో జనమే నిర్ణయిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ ఏకమైనా జనం అభిప్రాయం మార్చలేరని, ఏపీలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధించబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

cbn pk 15012019 3

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసిరావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీతో కలిసి టీఆర్‌ఎస్‌ ఇక్కడ పోటీ చేయొచ్చు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, పోలవరానికి ఎందుకు అడ్డంపడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై వైసీపీ ఎందుకు మాట్లాడదని మండిపడ్డారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మోదీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌తో కలిసి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ చెబుతున్నారని, టీఆర్‌ఎస్, జగన్, మోదీ అంతా ఒకటే కదా.. హోదాపై ఎందుకు ప్రకటన చేయించరని చంద్రబాబు ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలన్నీ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలుంటే ముందుకు రావాలంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి సంవత్సరం తన స్వంత గ్రామమైన నారావారిపల్లె సంక్రాంతి పండుగను జరుపుకోవడం ఆనవాతీగా పాటిస్తున్నారు. అందులోభాగంగా ఈ యేడాది కూడా నారావారిపల్లె నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత షర్మిల తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి కారణం టీడీపీయేనని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. టీడీపీపై షర్మిల ఎందుకు ఆరోపణలు చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నీతివంతమైన రాజకీయాలకే తాము కట్టుబడి ఉన్నామని, షర్మిల వ్యక్తిగత దూషణలకు ఎందుకు దిగారో తెలియలేదని ఆయన వ్యాఖ్యానించారు.

cbn 15012019 2

ఏపీ పోలీసులుపై నమ్మకం లేకనే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు షర్మిల చేసిన వ్యాఖ్యలకు, కోడి కత్తి కేసు విషయంలో కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు కలిపి సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు ఏపీలో రాజకీయం ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. దుష్ప్రచారం చేస్తున్నారని పక్క రాష్ట్రంలో కేసులు పెడతారా అని చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డాక్టర్ల పై నమ్మకం లేదంటారు, అసెంబ్లీ పై నమ్మకం లేదంటారు, సచివాయలం పై నమ్మకం లేదంటారు, రాజధాని పై నమ్మకం లేదంటారు, పోలవరం పై నమ్మకం లేదంటారు, కాని సియం కుర్చీ పై మాత్రమె నమ్మకం ఉంటుంది అని అన్నారు.

cbn 15012019 3

అర్హులకు పెన్షన్లు ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘‘జిల్లాలో సమస్యలు చాలా వరకు తగ్గాయి. దేశంలో లేని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ధనిక రాష్ట్రాలు కూడా చేయలేని పథకాలు అమలు చేశాం. అభివృద్ధి పక్కాగా చేస్తున్నాం. అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. మరో పక్క అమరావతి, పోలవరం పూర్తి చేస్తున్నాం. కేంద్రం సహకారం లేకపోయినా, ఎవరికీ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్తున్నాం. కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలు తెస్తున్నాం. ఉద్యానవన పంటల ద్వారా ఆదాయం, ఆరోగ్యం. గ్రామాల్లో ఎటు చూసినా సిమెంట్‌ రోడ్లే ఉన్నాయి. మట్టిపై నడవడం కూడా ఆరోగ్యానికి మంచిది’’ అని చంద్రబాబు సూచించారు.

పశ్చిమ బెంగాల్‌లో రథయాత్రలు నిర్వహించాలనుకున్న భారతీయ జనతా పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఈ రథయాత్రల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించింది. కేవలం బహిరంగ సభల నిర్వహణకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రథయాత్రలకు సవరించిన ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు బీజేపీని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం ముఖ్యమంత్రి మమత బెనర్జీకి గొప్ప విజయంగా చెప్పవచ్చు. బీజేపీ రథయాత్రల వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తూ, మమత ప్రభుత్వం అనుమతిని నిరాకరించిన సంగతి తెలిసిందే.

amit 15012019 2

ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలను పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఈ యాత్రలను ప్రారంభించవలసి ఉంది. కోల్‌కతా హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ యాత్రలకు అనుమతి ఇచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కు అపీలు చేసింది. డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ, బీజేపీ రథయాత్రలకు అనుమతిని నిరాకరించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ‘సేవ్ డెమోక్రసీ ర్యాలీ’ పేరుతో పశ్చిమబెంగాల్‌లోని 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో రథయాత్రలు నిర్వహించాలని బీజేపీ భావించింది. మమత బెనర్జీని రాజకీయంగా ఇబ్బంది పెట్టటం కోసం, ఈ రధయాత్ర ద్వారా, అమిత్ షా ఎదో స్కెచ్ వేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి బధ్రతల పై ఈ రధయాత్ర ప్రభావం ఉంటుందని, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం భావించింది.

 

amit 15012019 3

సమస్యలు సృష్టిస్తుందన్న అనుమానంతో తృణమూల్ కాంగ్రెస్‌ భాజపా రథయాత్రను అడ్డుకుంటుదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ విమర్శించారు. డిసెంబరు 28 నుంచి 31 మధ్యలో ఈ రథయాత్రను నిర్వహించాల్సి ఉండగా, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మరోసారి షెడ్యూల్ మార్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజవర్గాల్లో ప్రచారం నిర్వహించాలన్న భాజపా ప్రణాళికకు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో అడ్డంకి ఏర్పడింది. గతంలో ఏకసభ్య ధర్మాసనం రథయాత్రకు అనుమతినిస్తూ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు డివిజనల్ బెంచ్ పక్కన పెట్టింది. ఆ నేపథ్యంలో దాన్ని సవాలు చేస్తూ భాజపా సుప్రీంను ఆశ్రయించింది. ఇప్పుడు సుప్రీం కూడా కుదరదు అని చెప్పింది.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి మొదటి ఇంటర్నేషనల్ సర్వీస్ విజయవాడ - సింగపూర్ ఫ్లైట్ మొదలైన రోజున, ఏపి ప్రభుత్వం, ఎయిర్ పోర్ట్ అధికారులు ఎంతో ఆందోళన చెందారు. డిమాండ్ ఎలా ఉంటుందో, మొదటి అంతర్జాతీయ సర్వీస్ సక్సెస్ అవుతుందో లేదో, కేంద్రంతో పోరాడి మరీ, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ చేసి మరీ ప్రారంభిస్తున్నాం అంటూ కంగారు పడ్డారు. కాని, ప్రజల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి, తమ అంచనా తప్పని, ఇది సూపర్ హిట్ అయ్యిందని సంబర పడుతున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను ఆరంభించాక.. ప్రయాణికులు అలవాటు పడేందుకు 4-5 నెలల సమయం పడుతుందని అధికారులు భావించారు. అందుకే.. 50శాతం కంటే తక్కువ మంది ప్రయాణికులు ఉంటే ఇండిగోకు లోటు సర్దుబాటునిధి(వీజీఎఫ్‌)ని కూడా ఆరు నెలలకు రూ.18 కోట్ల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ అవసరం లేకుండానే ప్రయాణికుల రద్దీ నెల రోజుల వ్యవధిలోనే పుంజుకుంది.

vijayawada singapore flight 15102019

రాష్ట్రప్రభుత్వం, భారత విమానయాన సంస్థ(ఏఏఐ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ఇండిగో సంస్థ 180 సీటింగ్‌ ఉన్న ఎ320 ఎయిర్‌బస్‌ సర్వీసులను ఆరంభించింది. గత డిసెంబరు 4 నుంచి ఆరంభమైన ఈ సర్వీసులకు తొలుత సింగపూర్‌ నుంచి వచ్చే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండేది. ప్రస్తుతం విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అతితక్కువ కాలంలోనే ఏపీ నుంచి కూడా 90శాతం పైగా ఆక్యుపెన్సీని సాధించింది. జనవరి ఒకటో తేదీన ఇక్కడి నుంచి బయలుదేరివెళ్లిన విమాన సర్వీసులోని 180 సీట్లూ పూర్తిగా నిండిపోయాయి. నాటి నుంచి అదే రద్దీ కొనసాగుతోంది.

vijayawada singapore flight 15102019

సింగపూర్‌ నుంచి గన్నవరం వచ్చే సర్వీసుల్లో డిసెంబరు నాలుగో తేదీన 170మంది, ఆరున 165, 11న 177, 13న 168మంది ప్రయాణికులు వచ్చారు. అదే సమయంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు డిసెంబరు 4న 86, 6న 42, 11న 86, 13న 68 మంది వెళ్లారు. జనవరి నెలారంభం నుంచి అనూహ్యంగా ఇటునుంచి రద్దీ పెరిగింది. విజయవాడ నుంచి సింగపూర్‌కు జనవరి 1న 180, 3న 178, 8న 153, 10న 155 మంది ప్రయాణికులు వెళ్లారు. సింగపూర్‌ నుంచి జనవరి 1న 81, 3న 88, 8న 80, 10న 128మంది ప్రయాణికులు విజయవాడకు వచ్చారు. అమెరికా, చైనా, జపాన్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా, ఉక్రెయిన్‌, జర్మనీ లాంటి దేశాలకు వెళ్లేవాళ్లంతా గన్నవరం నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుని.. అక్కడి నుంచి తేలికగా వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయే వీలుంది. ఇలాంటి వారంతా ప్రస్తుతం సింగపూర్‌ సర్వీసును వినియోగించుకుంటున్నట్టు తెలుస్తుంది.

Advertisements

Latest Articles

Most Read