ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. నిన్న రాత్రి 9 గంటలనుంచి ఉదయం 9 గంటల వరకూ 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దిల్లీ వెళ్లి వచ్చినవారు, వారి బంధువులలో వైరస్ వ్యాప్తి చెందినట్లుగా అధికారులు తెలిపారు. నిన్న ఒక్కరోజే 164 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా, అందులో 147మందికి నెగెటివ్‌, 17 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకూ ప్రకాశం జిల్లాలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 17 కేసుల్లో 12 మంది దిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లుగా తేలింది. వారితోపాటు వారి బంధువులకు కూడా కరోనా పాజిటివ్‌గా నమోదైంది. ఇందులో 10ఏళ్ల బాలుడి నుంచి అన్ని వయస్సుల వారికీ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అనంతపురంలోని లేపాక్షి, ప్రకాశం జిల్లా చీరాల, కారంపూడి, గుంటూరుటౌన్‌, కుంకలమర్రు, కందుకూరుల్లో కేసులు నమోదయ్యాయి.

అత్యధికంగా చీరాలలో కేసులు నమోదు అయ్యాయి. దిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో అత్యధికంగా ప్రకాశం, గుంటూరు నుంచి ఉన్నట్లుగా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అనంతపురం జిల్లాలో రెండు, చిత్తూరులో ఒకటి, తూర్పుగోదావరిలో నాలుగు, గుంటూరులో తొమ్మిది, కృష్ణాజిల్లాలో ఐదు, కర్నూలులో ఒకటి, నెల్లూరులో ఒకటి, ప్రకాశం జిల్లాలో 11, విశాఖ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ చికిత్స పొంది ఇద్దరు వ్యక్తులు రికవరీ అయినట్లుగా వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరు, విశాఖలో రికవరీ అయి డిశ్చార్జి చేసినా... వైద్యుల పర్యవేక్షణలోనే వారిని ఉంచినట్లు ప్రకటించింది.

దిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనకు, రాష్ట్రవ్యాప్తంగా 711మంది హాజరైనట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో 122మందిని వేర్వేరు ఆసుపత్రుల్లో క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే 207మందిని ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రానికి తరలించింది. 297మంది స్వగృహాల్లోనే క్వారంటైన్‌లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరో 85మందికి సమాచారం తెలియరావడం లేద, వీరు దిల్లీనుంచి నేరుగా తిరిగి వచ్చారా లేక ఇతర ప్రాంతాల్లో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ విషయమై ప్రస్తుతం పోలీసు శాఖ ఆరా తీస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read