చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలను వైకాపా అధినేత వైఎస్ జగన్ ఈ రోజు, మునగలపాలెంలో పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ద హై-డ్రామా చోటు చేసుకుంది. జగన్ ఓదార్పుకి వస్తూ, తన మంది మార్బలంతో గ్రామంలోకి అడుగుపెట్టి, హంగామాగా చేశారు. జగన్ వెంట వచ్చిన అనుచరులు, సమయం సందర్భం ఏంటో కూడా తెలుసుకోకుండా, ఈలలు వేస్తూ, జై జగన్, జై జగన్ అంటూ గ్రామంలో తిరుగుతూ హంగామా చేశారు.
ఒక పక్క గ్రామంలో విషాదచాయలు ఉండగా, జగన్ అనుచరులు చేసిన హంగామాకు, గ్రామస్తులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో గ్రామస్థులు తీవ్ర నిరసన తెలిపారు. ‘ఓదార్పుకు వచ్చారా, శవ రాజకీయం చేయడానికి వచ్చారా ?, చనిపోయిన వారు మీ వర్గం వారు కాదనేగా రెండు రోజుల తర్వాత వాలారు ? మీ పరామర్శలు మాకొద్దు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు క్షమాపణ చెప్పారు.

