సీనియర్ ఐపిఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపి ఇంటెలిజన్స్ చీఫ్ గా నియమించేందుక వైఎస్ జగన్మోహనరెడ్డి తన ప్రయత్నాలను తిరిగి కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్ షాను కలిసిన సందర్భంగా స్టీఫెన్ రవీంద్ర నియామక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాస్తవానికి రవీంద్రను ఏపీ ఇంటెలిజన్స చీఫ్ గా నియమించేందుకు జగన్ గత ఏడాది జూన్ లోనే ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఈ అంశం వాయిదా పడింది. తాజాగా అమిత్ షాతో భేటీ అనంతరం ఈ అంశం వెలుగులోకి వచ్చింది. తెలంగాణాలో ఐజిగా పనిచేస్తున్న స్టీఫెన్ రవీంద్ర 1999 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించాలని గత ఏడాది జూన్లో వైఎస్ జగన్ తెలంగాణా ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి కళ్లు, ముక్కు, చెవుల మాదిరిగా వ్యవహరించాల్సి ఉన్న ఇంటెలిజన్స్ విభాగానికి ఐజి స్థాయి అధికారిని నియమించాలని ఏపీ ప్రభుత్వం భావించి తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎఓసి ఇచ్చింది. 

తదుపరి ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖకు నివేదించారు. అపుడు తనకు ఏపీ ఇంటెలిజన్స్ చీఫ్ పోస్టు ఖాయమవుతుందని భావించిన స్టీఫెన్ రవీంద్ర సెలవు పెట్టి అమరావతిలో నెల రోజులు మకాం వేశారు. అయినప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో తన సెలవును మరొ 15 రోజులు పొడిగించుకున్నారు. అప్పటికి కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తెలంగాణా ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి ఆయన తన పోస్టులో జాయిన్ అయ్యారు. అయితే కేంద్రం నుంచి ఇంటర్ క్యాడర్ డిప్యుటేషను అనుమతి లభించక పోవడంతో ఆ ప్రతిపాదనకు తాత్కాలికంగా బ్రేకు పడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆలిండియా సర్వీసు నిబంధనలను అనుసరించి ఇంటర్ క్యాడర్ బదిలీలను అదే సర్వీసులో ఉండి వేరే రాష్ట్రంలో పనిచేస్తున్న వారితో వివాహం చేసుకునే సందర్భంలోను, అసమాన్య ప్రతిభా పాటవాలు కనబరచిన సమయంలో సంబంధిత ఉన్నతాధికారి నిర్ణయం మేరకు మాత్రమే చేయాల్సి ఉంటుంది.

కాగా పోలీసు అధికారులు ఎవరైతే సూపర్‌టైం స్కేల్ (ఐజి ర్యాంక్) పొందుతున్నారో వారు ఇంటర్ క్యాడర్ డిప్యుటేషనుకు అనర్హులు. ఈ నిబంధన ప్రకారం రవీంద్ర ఐజి ర్యాంక్ అధికారి కావడంతో ఇంటర్ క్యాడర్ డిప్యుటేషన్ సాధ్యపడలేదు. మరో కోణంలో చూస్తే ఏరాష్ట్రంలో అయినా ఆ రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అతని ప్రా-ణా-ని-కి హా-ని కలిగే అవకాశం ఉన్నట్లయితే ఆ సమయంలో ఇంటర్ క్యాడర్ బదిలీకి అవకాశం ఉంటుంది. అయితే గతంలో రవీంద్ర పోలీసుశాఖలో చేపట్టిన సంస్కరణల దృష్ట్యా ఆయనను ఇంటర్ స్టేట్ బదిలీకి అర్హునిగా పరిగణించి తమ అభ్యర్థనను గౌరవించాల్సిందిగా జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఇందుకా అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించినట్లు వైకాపా వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే మార్చి మొదటి వారానికి స్టీఫెన్ రవీంద్ర ఏపీలో బాధ్యతలు స్వీకరించే అవకాశం లేకపోలేదని ఒక సీనియర్ పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read