ఏపీ అధికార పార్టీ వైసీపీ లో రాజ్యసభ ఆశావహుల సందడి మొదలైంది. ఏపీలో అధికారంలో కొచ్చిన తర్వాత అనేకమందికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు శాసనమండలి రద్దు కావడంతో రాజ్యసభకు ఒత్తిడి పెరిగింది. ఏపీ నుంచి ఈ ఏప్రిల్లో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి 11, తెలంగాణాకు 7 రాజ్యసభ సీట్లు కేటాయించారు. అందులో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ నేత కె.కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఎంఏఖాన్ ఏప్రిల్ 9న వదవీ విరమణ చేయాల్సి ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సభ్యుడైన టి.సుబ్బిరామిరెడ్డి, టీడీపీ సభ్యురాలు తోట సీతారా మలక్ష్మీ ఏప్రిల్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగా ఈ నాలుగు స్థానాలు మొత్తంగా వైసీపీకే దక్కనున్నాయి. ఇప్పటికే జగన్ ఈస్థానాలు ఎవరికి కేటాయించాలనే దానిపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కేంద్రంతో సన్నిహిత సంబంధాల్లో భాగంగా ఈ నాలుగు స్థానాల్లో ఒకటి బీజేపీకి కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది.

దీంతో చివరకు ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ వైసీపీలో మొదలైంది. ఇప్పటికే రాజ్యసభలో ఇద్దరు సభ్యులున్నారు. విజయసాయిరెడ్డితోపాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసిపి నుంచి సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో సామాజిక, ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ తన సభ్యులను ఎంపిక చేయనున్నారు. అందులో ప్రముఖంగా జగన్ నలుగురు పేర్లను వరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్న ఆళ్ల కుటుంబానికి చెందిన అయోధ్యరామిరెడ్డికి జగన్ రాజ్యసభ అవకాశమివ్వాలని భావిస్తున్నట్లు సమచారం. అలాగే బీసీ కోటాలో నెల్లూరు జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి తాజాగా వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు సైతం అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతుంది.

ఎస్సీ కోటాలో 2014లో టీడీపీ నుంచి అమలాపురం ఎంపీగా గెలిచి, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పండుల రవీంద్రబాబు పేరు సైతం రేసులో ఉంది. తాజాగా ఒక ప్రముఖ పేరు ప్రచారంలోకొచ్చింది. న్యాయవ్యవస్థలో కీలకస్థానంలో వనిచేసిన ఓ ప్రముఖ వ్యక్తికి తన పార్టీ నుంచి రాజ్యసభకు పంపాలని పార్టీ భావిస్తుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే ఆ ప్రముఖుడు మాత్రం అందుకు సిద్ధంగా లేరని తెలుస్తుంది. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు పేరు సైతం వైసీపీ నుంచి రాజ్యసభ రేసులో ఉంది. ఆయన కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. వైసీపీ నుంచి చిరంజీవికి సైతం ఛాన్స్ దక్కే అవకాశమందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. వైసీపీ నుంచి దక్కే నాలుగు సీట్లలో మూడు సీట్లు వైసీపీకి ఒక సీటు బీజేపీకి ఇచ్చే అవకాశాలు లేకపోలేదనే వాదన ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read