రాష్ట్రాభివృద్ధిపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని, విధ్వంసకర విధానాలతో పారిశ్రామికాభివృద్ది రేటు మైనస్ కు చేరిందని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి ఎన్.అమర్ నాథ్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ, "రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. ఎక్కడైనా సంపద సృష్టిస్తే ఉపాథి అవకాశాలు పెరుగుతాయి. విశాఖ-చెన్నయ్, చెన్నయ్-బెంగుళూరు, హైదరాబాద్-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లను అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు వస్తాయనే ఆలోచనతో చంద్రబాబు హయాంలో ఈ కారిడార్ల అభివృద్ధిపై దృష్టిసారించి ప్రణాళికలు సిద్ధం చేశారు. గత రెండుసంవత్సరాల్లో కారిడార్లలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా తయారైంది. చిన్న పరిశ్రమలకు కేటాయించిన ఎంఎస్ఎంఇ ల భూములను ఇళ్లస్థలాల కోసం లాక్కోవడం, పరిశ్రమలకు గతంలో ఇచ్చిన భూములకు రెట్టింపు రేటు చెల్లించాలని వత్తిడిచేయడం వంటి చర్యల వల్ల వేలాది పరిశ్రమలు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో పారిశ్రామిక కారిడార్లలో భూసేకరణకు 50వేలకోట్ల రూపాయాలు అవసరం కాగా, బడ్జెట్ లో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. రాష్ట్రంలో 960 కిలోమీటర్ల సముద్ర తీరం పరిశ్రమలకు ఎంతో అనుకూలమైంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సముద్ర తీర ప్రాంతంపై టిడిపి హయాంలో ప్రత్యేకశ్రద్ధ పెట్టాం. ప్రస్తుతం ముఖ్యమంత్రి పోర్టులను తమ బంధువులకు అప్పగించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిస్తూ పరిశ్రమలు పారిపోయేలా చేస్తున్నారు. అధికారపార్టీ నేతల బెదిరింపుల కారణంగా కియా అనుబంధ సంస్థలు తరలిపోయాయి. కడపలో జువారి సిమెంట్స్, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను పిసిబి నోటీసులతో మూసివేసే ప్రయత్నం చేశారు. ప్రకాశంజిల్లాలో తెలుగుదేశం నేతల క్వారీలపై దా-డు-లు చేసి భారీగా పెనాల్టీ వేసి ఆ పరిశ్రమలను నాశనం చేస్తున్నారు. వేలాదిమంది పాడిరైతులకు బాసటగా నిలుస్తున్న సంగం డెయిరీని మూసివేయడానికి కుట్రపన్ని అమూల్ కు లబ్ధికలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడి రాష్ట్రప్రజల జీవనాడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోకుండా కేంద్రానికి దాసోహమంటున్నారు. ప్రకాశంజిల్లాల ఆసియన్ పేపర్ ఇండస్ట్రీ, వైజాగ్, గన్నవరంలో ఐటి పరిశ్రమలు తరిమేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 17లక్షల కోట్ల పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి.

రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు రాకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు -2.58కి, జిఎస్ డిపి -3.26కి పడిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండంకెలుగా ఉన్న వృద్ధిరేటును వైసిపి ప్రభుత్వ విధ్వంసకర చర్యలతో మైనస్ కు దిగజార్చారు. ఇకనైనా ఈ విధ్వంసాన్ని ఆపండి, లేకపోతే భావితరాల భవిష్యత్ అంధకారం అవుతుంది. అభివృద్ధిపై ప్రభుత్వం చెప్పే మాటలకు, గణాంకాలకు పొంతన లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ఇక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత, విధ్వంసకర విధానాల ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం గణనీయంగా పెరిగింది. దేశం మొత్తంమీద సగటు నిరుద్యోగిత రేటు 11.9 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 13.5కి చేరుకొంది. జగన్ ప్రభుత్వ అనాలోచిత, చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. లాక్ డౌన్ సమయంలో కూడా మన పొరుగున ఉన్న తెలంగాణా, ఒడిస్సా, కర్నాటక, మహారాష్ట్ర లు ప్రణాళికాబద్ధమైన విధానాలతో నిరుద్యోగితను గణనీయంగా తగ్గించగలిగాయి. వెనుకబడిన రాష్ట్రాలైన అస్సాం, చత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కూడా అతి స్వల్పమైన నిరుద్యోగరేటును నమోదుచేశాయి. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో వైసిపి ప్రభుత్వం చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే. గత రెండేళ్లలో 4,77,953 ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. అందులో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 2,59,565 వాలంటీర్ ఉద్యోగాలు, గ్రామసచివాలయాల్లో ఆ పార్టీ వారికే ఇచ్చిన 1,21,518 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చినట్లు చూపడం ప్రభుత్వ మోసపూరిత చర్యలకు నిదర్శనం. మద్యం షాపుల్లో వైసిపి కార్యకర్తలకు ఇచ్చిన 12వేల ఉద్యోగులు, హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రిసిటీ విభాగాల్లో గౌరవ వేతనంతో నియమించిన 20వేల తాత్కాలిక ఉద్యోగాలను ప్రభుత్వోద్యోగాలు చూపడం సిగ్గుచేటు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను మూటలు మోసే కూలీలుగా మార్చిన 9,260 రేషన్ డోర్ డెలివరీ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం సిగ్గుపడాల్సిన విషయం. రాష్ట్రంలో 2లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేయకుండా పెండింగ్ లో ఉన్నాయి. గత రెండేళ్లలలో డిఎస్సీ ఊసేలేదు, ఈ నోటిఫికేషన్ కోసం 2లక్షలమంది నిరుద్యోగ టీచర్లు ఎదురుచూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత, విధ్వంసకర విధానాల వల్ల వల్లే రాష్ట్రంలో ఇదివరకెన్నడూ లేనివిధంగా నిరుద్యోగం ప్రబలింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read