కేంద్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు మెగా బ్యాంకుల విలీనం ఆచరణలోకి వచ్చింది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులు 4 పెద్ద బ్యాంకులుగా అవత రించాయి. ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి కార్యకలాపాలను ప్రారంభించాయి. విలీనమైన చిన్న బ్యాంకుల ఖాతాదారులను పెద్ద బ్యాంకుల ఖాతాదారులుగా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచులుగా కార్యకలాపాలను ప్రారంభించాయని బుధవారం ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం ఏప్రిల్ 1 నుంచి ఆచరణలోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశంలోనే రెండవ అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిందని వివరించింది. ఈ విలీనంతో అంతర్జాతీయంగా పోటీ ఇవ్వగల తర్వాతి తరం బ్యాంక్ అని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. డిపాజిటర్లతో సహా ఖాతాదారులందరూ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు గానే పరిగణింపబడతారని స్పష్టం చేసింది.

విలీనంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచులు 11 వేలు కాగా ఏటీఏంలు 13 వేలకుపైగానే ఉన్నాయి. ఉద్యోగుల సంఖ్య 1 లక్ష, బిజినెస్ మిక్స్ రూ.18 లక్షల కోట్లని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివరించింది. ఆ విలీనంతో ఎక్కువమంది ఖాతాదారులకు, సమర్థవంతమైన సేవలు అందించవచ్చునని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఎస్ఎస్ మల్లికార్జున రావు పేర్కొన్నారు. ఇదిలావుండగా బ్యాంకుల విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.68,855 కోట్లను ఆయా బ్యాంకులకు మూలధనంగా అందజేసింది. ఈ విలీనంతో 2017లో ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్య 27 కాగా 2020లో 12కి తగాయి. ఈ 12లో 6 విలీనమైన బ్యాంకులు కాగా మరో 6 స్వతంత్ర బ్యాంకులుగా పనిచేస్తున్నాయి.

ఆంధ్రాబ్యాంక్ కనుమరుగు... యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమవ్వడంతో ఆంధ్రాబ్యాంక్ కనుమరుగైంది. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి విలీనం ఆచరణలోకి రావడంతో ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకు వినియోగదారులను కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదా రులుగా వ్యవహరించనున్నారు. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిచింది. బ్యాంక్ వ్యాపారం ర.11.59 లక్షల కోట్లకు పెరిగింది. బ్రాంచుల సంఖ్య 9,609కి పెరిగింది. అయితే ఈ పరిణామంతో, ఆంధ్రా ప్రేమికులు, ఒకింత అసహనంగా ఉన్నారు. ఆంధ్రా అనే పదం లేకుండా చెయ్యటం పై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య 1923లో ఆంధ్రా బ్యాంక్‌ను స్థాపించారు. భారతీయ బ్యాంకింగ్ రంగానికి సాంకేతికతను పరిచయం చేసింది ఆంధ్ర బ్యాంక్. తొలి సారి, క్రెడిట్ కార్డులు జరీ చేసిన బ్యాంక్ కూడా ఆంధ్రా బ్యాంకే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read