ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతలు గత ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబుని ఓడిస్తాం అని శపధం చేసారు. చంద్రబాబుని ఓడిస్తాం అంటే, జగన్ ని గెలిపిస్తామనే కదా. అదే చేసారు. ఈ క్రమంలో డిపాజిట్లు కూడా దక్కలేదు. నోటా కంటే తక్కువగా, చివరకు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా తక్కువగా ఓట్లు వచ్చాయి. తాము అనుకున్నట్టే అన్ని మార్గాలు ఉపయోగించి చంద్రబాబుని దించి, జగన్ ని గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నికలు అయిన తరువాత, తమ పార్టీ బలోపేతం పై దృష్టి పెట్టారు. సొంతగా ఎదిగే సమర్ధత బీజేపీకి లేదు. అప్పటి అధ్యక్షుడు కన్నా, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, జీవీఎల్ లాంటి వాళ్ళు, ఎంత హడావిడి చేసినా, వాళ్ళ మాటలు విశ్వసించి, బీజేపీ వైపు తిరిగేవారు ఎవరూ ఉండరు అనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీ బలంగా ఉంది కాబట్టి, ఏపిలో బీజేపీ గురించి, వీళ్ళ మాటలు గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, ఏపిలో మాత్రం ఒక బలమైన బీజేపీ నేత ఎవరూ లేరని చెప్పాలి. ప్రధాని మోడీ పేరు చెప్పి ఏదో హడావిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ని దగ్గరకు తీసారు. ఎన్నికలు అయిన వెంటనే, పవన్ బీజేపీకి దగ్గర అయ్యారు. పాచిపోయిన లడ్డూ, ఉత్తర భారత పార్టీ , చేగోవీరా అంటూ ఏవేవో చెప్పి, ఎన్నికలు అవ్వగానే బీజేపీకి దగ్గరవటం అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే సినిమా హీరో పరంగా పవన్ సూపర్ స్టార్ కానీ, ఎన్నికల పరంగా పెద్ద బలం లేని నాయకుడని తేలిపోయింది.

మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీకి, 6 శాతం ఓట్లతో, ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చింది. పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోయారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసారు. అయితే వీళ్ళు ప్రత్యర్ధి ఎవరు అనేది మర్చిపోయారు. ముఖ్యంగా సోము వీర్రాజు ఏపి బీజేపీ అధ్యక్షుడు అయిన తరువాత, పనిగట్టుకుని మరీ చంద్రబాబుని టార్గెట్ చెయ్యటంతో, ఇది బీజేపీ అజెండానా, లేక సోము వీర్రాజు సొంత అజెండానా అనే చర్చ మొదలైంది. అలాగే అమరావతి ఉద్యమం పై, మాకు సంబంధం లేదు అని చెప్పటం కూడా, బ్యాక్ ఫైర్ అయ్యింది. అధికారంలో ఉన్న వైసీపీ పై చాలా సాఫ్ట్ గా వెళ్తున్నారని, మీడియా ముందుకు వస్తే ఇంకా ఎందుకు చంద్రబాబుని తిడుతున్నారో ఎవరికీ అర్ధం కాలేదు. ఇక జీవీఎల్ అయితే, వైసీపీకి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నట్టు ఎవరికైనా ఇట్టే అర్ధం అయి పోతుంది. అసలు ఏపిలో బీజేపీ వ్యూహం ఏమిటి ? చంద్రబాబుని రానివ్వకుండా చేసి, జగన్ మోహన్ రెడ్డినే శాశ్వతంగా ఎన్నికల్లో గెలిపించే ప్రయత్నమా అనేటట్టు వ్యవహరించారు.

అయితే ఏమైందో ఏమో కానీ, ఏపి బీజేపీ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. గత 15 రోజులుగా బీజేపీ నేతలు, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల పై దృష్టి పెట్టారు. అవసరం అయినప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, సరైన ట్రాక్ లో పడ్డారు. ఇక అవసరం ఉన్నా, లేకపోయినా చంద్రబాబుని టార్గెట్ చేసే విధానం పక్కన పెట్టారు. ఇది ఏపి బీజేపీ నేతలు సమీక్షించి మార్చుకున్న విధానమో లేక, ఎవరైనా పెద్దలు చెప్పారో కానీ, ఏపి బీజేపీ వ్యూహం మార్చింది. అయితే దీని పై మీడియా వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. రెండు వారల క్రిందట, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో, సోము వీర్రాజు, సునీల్ డియోధర్, జీవీఎల్ సమావేశం అయ్యారు. ఆ సమావేశం తరువాతే ఈ మార్పు గమనిస్తున్నాం అని, విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష ఉన్నా, అది పక్కన పెట్టి, ప్రస్తుత ప్రభుత్వం పై బీజేపీ పోరాటం చెయ్యలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పై హెచ్చరిస్తుంది అనే ఆశ. ఏది ఏమైనా ఏపి బీజేపీ ఇప్పటికైనా ప్రజా పక్షాన పోరాడుతుందని, ఈ వైఖరి కొనసాగిస్తుందని ఆశిద్దాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read