రాష్ట్రంలో లాక్‌డౌన్ రెండోరోజుకూ మంచి స్పందన వచ్చిందని డీజీపీ గౌతం సవాంగ్ పేర్కొన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరిగిందని, స్వచ్ఛందంగా సహకరించారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ మన చేతుల్లోనే ఉందని చెప్పారు. కరోనా నివారణ చర్యలను మరింత కట్టుదిట్టంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నియంత్రణలో విదేశాల నుంచి అనేక విషయాలు నేర్చుకోవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ప్రజలకు డీజీపీ సవాంగ్ సూచించారు. అత్యవసర సమయాల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ప్రజలను కోరుతున్నామన్న డీజీపీ... విదేశాలు, దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి గ్రహించి ప్రవర్తించాలని సూచించారు. అవసరం లేకుండా తిరిగేవాళ్ల వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నాని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 298 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

విదేశాల నుంచి వచ్చేవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవాళ్లు తమ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారన్న డీజీపీ... అలాంటి వారిపై కేసులు పెట్టి పాస్‌పోర్టులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా సరిహద్దుల్లోనూ ఆంక్షలు విధిస్తున్నామని స్పష్టం చేశారు. కరోనాపై ప్రతిరోజూ ఆంక్షలు పెరిగే అవకాశం ఉందన్న డీజీపీ సవాంగ్‌... అత్యవసర సమయాల్లోనూ కారులో ఇద్దరినే అనుమతిస్తామని చెప్పారు. ఏపీకి వచ్చే అన్ని రహదారులను పూర్తిగా మూసివేస్తున్నామని డీజీపీ తెలిపారు. రాత్రి నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వాహనాలను అనుమతించట్లేదని పేర్కొన్నారు. అత్యవసర సరకు రవాణా, అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రహదారుల మూసివేత కారణంగా ప్రజలెవరూ రాకపోకలు కొనసాగించరాదని హెచ్చరించారు.

కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ వాయిదా వేస్తున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. అంగన్వాడీలు ఇళ్ల వద్దకే వచ్చి పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. మరోవైపు కరోనా నియంత్రణకు విస్తృత ప్రచారం చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఒకేచోటకు రాకుండా పలుచోట్ల రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గుంటూరు మిర్చి యార్డులో కార్యకలాపాలు నిలిపివేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. ఆకతాయిలపై 338 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అత్యవసర సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read