ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు 8కి చేరాయని వైద్యవిద్య సంచాలకుడు వెంకటేశ్‌ తెలిపారు. లండన్‌ నుంచి తిరుపతి వచ్చిన విద్యార్థికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మక్కా నుంచి విశాఖ వచ్చిన వ్యక్తి కుమార్తెకు నెగెటివ్‌ వచ్చిందని వెల్లడించారు. అనంతపురం బోధనాస్పత్రిలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. త్వరలో కడప, విశాఖలోనూ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తామని వెంకటేశ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో రెండో రోజు లాక్​డౌన్​ పోలీసులు నియంత్రణతో పూర్తిస్థాయిలో అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ పరిస్థితి నెలకొంది. రహదారులు నిర్మానుష్యంగా మారాయి. నిత్యావసర దుకాణాలు మినహా మిగతా అన్ని షాపులు మూసివేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. నిత్యావసరాల దుకాణాలు సైతం ఉదయం పది గంటల తర్వాత మూసి వేయించారు పోలీసులు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

ఇక మరో పక్క, కరోనా ప్రభావంతో కృష్ణా జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ కొనసాగుతోంది. లాక్​డౌన్ ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం కోరుతుంది. ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లలో ఉదయం 7 గంటలకే కూరగాయలు అయిపోతున్నాయి. ఇదే అదునుగా దళారులు కూరగాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కష్టకాలంలో ప్రజలకు బాసటగా నిలిచేందుకు ముందుకువచ్చారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన తోట వెంకయ్య.

సుమారు 50 వేల రూపాయలతో కూరగాయలు కొనుగోలు చేసి గ్రామాల్లో ఉచితంగా పంపణీ చేశారు. రెండు రోజుల నుంచి కూరగాయలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ సాయం కొంత ఊరటనిచ్చింది. చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఈ నెల 31 వరకు కూరగాయలు ఉచితంగా పంపిణీ చేస్తానని తోట వెంకయ్య తెలిపారు. దాతలు మరికొంత మంది ముందుకొస్తే ప్రజల ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read