కరోనా కట్టడిలో భాగంగా రాజకీయ నాయకులు లాక్ డౌన్ నిబంధనలను గౌరవిస్తూ, భౌతిక దూరం పాటించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లాలో చోడవరంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సామాజిక దూరం పాటించలేదని ఆరోపిస్తూ రాష్ట్ర హై కోర్టుకు న్యాయవాది లేఖను రాసారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ లేఖను స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాముహిక సమీక్ష సమావేశాలు నిర్వహించకపోవడం శ్రేయస్కరం అనే అభిప్రాయాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా లాక్ డౌన్ నిబంధనలను రాజకీయ నాయకులు గౌరవించాలని. వైరస్ వ్యాప్తి జరుగ కుండా భౌతిక దూరం పాటించాలని తన ఆదేశాల్లో ఇచ్చింది. ఈ విషయాన్ని ప్రజా ప్రతినిధులకు తెలియ జేయాలని రాష్ట్ర ప్రభుత్వా నికి జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

మరో పక్క, రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రశాంతంగా సాగుతోంది. వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని జిల్లా ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. చెక్‌పోస్టుల వద్ద అత్యవసర వాహనాలను మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. డ్రోన్‌ ద్వారా స్థానిక పరిస్థితులను పరిశీలిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పేదలకు మాస్కులు, శానిటైజర్లు సహా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా తిరువూరు సమీపంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టును జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తనిఖీ చేశారు. స్థానికంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును పరిశీలించారు. వివిధ సేవాసంస్థలు సమకూర్చిన మాస్కులు, శానిటైజర్స్, కూరగాయలు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా కేసుల నమోదును పరిగణనలోకి తీసుకుని.. కృష్ణాజిల్లాలో ఐదు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించామని తెలిపారు.

కడపజిల్లా రైల్వేకోడూరు సమీపంలో ప్రభుత్వ విప్‌ శ్రీనివాసులు పర్యటించారు. శాంతినగర్, రంగనాయకులపేట వీధుల్లో వైకాపా నేతలతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్థానిక పంచాయతీ అధికారులతో మాట్లాడారు. రైల్వేకోడూరు పట్టణమంతా పరిశుభ్రంగా ఉంచాలని క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటు వీధివీధి తిరిగి బ్లీచింగ్ పౌడర్‌ను పిచికారీ చేశారు. కర్నూలులో లాక్‌డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని వీధుల్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందును పిచికారీ చేస్తున్నారు. విశాఖలోని రెడ్‌జోన్‌ ప్రాంతంగా ప్రకటించిన అక్కయ్యపాలెంలో పూర్తి లాక్‌డౌన్ కోసం పోలీసులు భారీగా మోహరించారు. ఆ ప్రాంతం నుంచి ఎక్కువ కేసులు నమోదు కావటంతో పూర్తిగా దిగ్బంధనం చేయాలని నిర్ణయించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read