గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఖ్యాతిని , అంతర్జాతీయస్థాయిలో ఇనుమడింపచేస్తే, జగన్ ముఖ్యమంత్రయ్యాక ఏపీని అంతర్జాతీయ నేరస్తుల అడ్డాగా మార్చాడని, జగన్మోహన్ రెడ్డికి అత్యంత ముఖ్యమైన జైల్ మేట్ లందరూ పలు ప్రదేశాల్లో తలదాచుకున్నారని టీడీపీ నేత, మాజీ ఎమ్మల్యే బొండా ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ కు చెందిన సంస్థల్లో పెట్టుబడిపెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో తలదాచుకున్నాడని, 2008లో వాన్ పిక్ పోర్ట్ నిర్మాణం పేరుతో రస్ అల్ ఖైమా సంస్థను నమ్మించి వారివద్ద సొమ్ము కాజేశాడని, అలా వచ్చిన సొమ్మునే జగన్ సంస్థల్లోకి ప్రసాద్ మళ్లించాడన్నారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం విదేశీ పెట్టుబడిదారులను మోసగించిన వారిపై కఠినచర్యలుంటాయన్నారు. తన తండ్రి వై.ఎస్ ముఖ్యమంతిగా ఉన్న సమయంలో అనేక కుంభకోణాలు వెలుగుచూశాయని, వాటికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలు జైలుకి కూడా వెళ్లొచ్చాడన్నారు. వాటిలో అతి కీలకమైనది 16 – 05 - 2012న సీబీఐ నిమ్మగడ్డ ప్రసాద్ ను అరెస్ట్ చేయడమేనని, ఆనాడు సీబీఐ తన నివేదికలో రస్ అల్ ఖైమాను ఎలా మోసగించారు... వాన్ పిక్ పేరుతో కొట్టేసిన సొమ్ముని ఎటునుంచి ఎటు మళ్లించారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు.

ఈ కేసులో ఏ1 జగన్మోహన్ రెడ్డయితే, ఏ2 విజయసాయి రెడ్డి, ఏ3 నిమ్మగడ్డ ప్రసాద్, ఏ4 మోపిదేవి వెంకటరమణ, ఏ5 ధర్మాన ప్రసాదరావు, ఏ6 బ్రహ్మనందరెడ్డి (ఐఆర్ఎస్), ఏ7 మన్మోహన్ సింగ్ (మాజీ ఐఏఎస్), ఏ8 ఎమ్ శామ్యేల్, ఏ9 నిమ్మగడ్డ ప్రకాశ్, ఏ10 వాన్ పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ11గా జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఏ12 భారతి సిమెంట్స్, ఏ13 కార్మెల్ ఏషియా, ఏ14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ (జగన్ బినామీ కంపెనీ), లు ఉన్నట్టు బొండా పేర్కొన్నారు. వాన్ పిక్ పోర్ట్స్ లో రస్ అల్ ఖైమావారు ఆనాడు రూ. 845కోట్లు పెట్టుబడిగా పెట్టడం జరిగిందని, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇష్టానుసారం ఒప్పందాలు చేసేసి, నిధులు రాబట్టుకోవడానికి చూశారని, రస్ అల్ ఖైమానుంచి నిధులు రప్పించడానికి నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీ పనిచేసిందన్నారు. సూట్ కేస్ కంపెనీలను ఎలా సృష్టించారు.. వాటిద్వారా జగన్ సంస్థల్లోకి అక్రమ సంపాదన ఎలా వచ్చిపడిందనేది సీబీఐ తన నివేదికల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. షైన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ కంపెనీ, శతాబ్లి ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్, ఆర్టిలిజన్ బయో ఇన్నోవేషన్ లిమిటెడ్, డెల్టా సెగ్జమ్ ప్రైవేట్ లిమిటెడ్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇంగోరఫ్ షిన్ ఇన్ వెస్ట్ మెంట్ లిమిటెడ్, మూన్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ కంపెనీలన్నీ కూడా పబ్లిక్ లో లేవని, మొత్తం సూట్ కేస్ కంపెనీలేనని బొండా స్పష్టంచేశారు.

వాన్ పిక్ పోర్ట్ కోసం రస్ అల్ ఖైమావారిని మభ్యపెట్టి డబ్బులు రాబట్టుకొని, ఆ సొమ్ముని భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్స్, తదితర కంపెనీల్లోకి మళ్లించి, అడ్డగోలుగా దోచేశారన్నారు. తమనుమోసం చేయడంతో రస్ అల్ ఖైమా వారు 2013లోనే ఆనాటి ముఖ్యమంత్రికి లేఖ రాయడం జరిగిందన్నారు. భారత్ లో మరీ ముఖ్యంగా ఏపీలో తమకు జరిగిన మోసంపై రస్ అల్ ఖైమా కంపెనీ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించిందని ఉమా తెలిపారు. గల్ఫ్ టైమ్స్ అనే పత్రిక ఫిబ్రవరిలో ఒకవార్తను ప్రచురించిందని, అంతర్జాతీయంగా తమను మోసగించిన వారిని తక్షణమే తమకు అప్పగించాలని కోరుతూ, భారతదేశ ప్రధానికి కూడా లేఖ రాశారని, ఇదే అంశంపై కేంద్ర్రప్రభుత్వంలోకూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని టీడీపీనేత పేర్కొన్నారు. ఆనాడు కేసుల్లో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటంతో, కేంద్రం సంకట స్థితిలో పడిందని, రస్ అల్ ఖైమా కోరినట్లుగా ముద్దాయిలను అప్పగించకపోతే, అంతర్జాతీయ న్యాయస్థానాల ముందు తాము దోషిగా నిలబడాల్సి వస్తుందన్న ఆలోచనలో కేంద్రం ఉందన్నారు. నిమ్మగడ్డ ప్రసాద్ ఐరోపా పర్యటనకు వెళ్లడంతో సెర్బియా లో ఆయన్ని అరెస్ట్ చేయడంతో, వైసీపీ ఎంపీలంతా, కేంద్రమంత్రి జైశంకర్ ను కలిసి, నిమ్మగడ్డను విడిపించాలని గట్టిగా ఒత్తిడి చేయడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన జై శంకర్ , సెర్బియాలోని అధికారులతో మాట్లాడాక ఆయనకు వాస్తవాలు బోధపడ్డాయన్నారు. గల్ఫ్ లో చట్టాల ప్రకారం ఆయన్ని విడుదలచేయడం సాధ్యం కాదని చెప్పడంతో, మంత్రి జైశంకర్, వైసీపీ ఎంపీలను పిలిచి చీవాట్లు పెట్టడం జరిగిందని, ఈ వ్యవహారమంతా గత జూలైలో జరిగితే, ఇప్పటికీ నిమ్మగడ్డను విడిపించడం కోసం ముఖ్యమంత్రి జగన్, ఢిల్లీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడన్నారు.

జగన్మోహన్ రెడ్డి మోసాలగురించి దావోస్ లో పెట్టుబడుల సదస్సులో కూడా చర్చ జరిగిందని, సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొన్న 14మంది (కంపెనీలతో సహా) ఇప్పటికిప్పుడు దేశం దాటితే తిరిగొచ్చే పరిస్థితులు లేవని, అందుకే జగన్ సహా, ఇతర నిందితులంతా తాడేపల్లి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ తాడేపల్లి కి మాత్రమే పరిమితమయ్యారని, దేశం దాటి వెళ్లే సాహసం ఎవరూ చేయడంలేదని బొండా దెప్పి పొడిచారు. అందులో భాగంగానే సౌదీ, దుబాయ్ , దావోస్ లలో జరిగిన పెట్టుబడుల సదస్సుకి రాష్ట్రం నుంచి ఎవరూ హాజరవ్వలేదన్నారు. నిమ్మగడ్డ జీవితం ఐరోపాకే అంకితమైందని, అతను అప్రూవర్ గా మారాడన్న వార్తలు వస్తున్నాయని, అదేగానీ నిజమైతే, తరువాత ఐరోపా బాట పట్టాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డే అవుతాడన్నారు. 2008లో జగన్ చేసిన పాపం, ఇప్పుడు ఆయన్ని పట్టి పీడిస్తోందని, చేసిన పాపం ముఖ్యమంత్రిని నిత్యం వెంటాడుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఈ వ్యవహారం అంతర్జాతీయస్థాయిలో బయటకు పొక్కడంతో, జగన్ అవినీతి కీర్తి ఖండాంతరాలు దాటడంతో, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడంలేదని ఉమా స్పష్టంచేశారు. అంతర్జాతీయ మీడియా జగన్ అవినీతిపై కథనాలు ముద్రించినా, ఆయన స్పందించడంలేదని, నిమ్మగడ్డ అరెస్ట్ పై అందరూ తేలుకుట్టిన దొంగల్లా ఎందుకున్నారో, ఛార్జ్ షీట్లలో పేర్లున్నవారే చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానాలు జగన్ ఒకరాష్ర్టానికి ముఖ్యమంత్రా, మంత్రులా అనేది చూడవని, కావాలంటే 14మంది నిందితుల్లో ఎవరైనా ఒకరుదేశందాటి వెళ్లిరావచ్చని ఉమా సూచించారు. రస్ అల్ ఖైమా సౌదీ అరేబియాలో చేసినఫిర్యాదు ప్రకారం 14మందిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామా అని ఆదేశ పోలీసులు ఎదురుచూస్తున్నారన్నారు. నిమ్మగడ్డ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు కాబట్టి, మిగిలిన ఏ1 నుంచి ఏ13 వరకు ఏ ఒక్కరైనా సరే దేశం దాటి చూపిస్తే వారి పరిస్థితి ఏమిటో రాష్ట్రప్రజలందరికీ అర్థమవుతుందన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read