ఈ రోజు రాజధాని విషయంలో ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలియజెప్పేందుకే ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం. రాజధానిని 3ముక్కలు చేయడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టంపై నా ఆవేదన గత ప్రెస్ మీట్ లో చెప్పాను. 2014లో విభజన సమయంలో కష్టం నష్టం రాష్ట్రానికి వచ్చినప్పుడు, వరుసగా వారం రోజులు ప్రెస్ మీట్ లు పెట్టి జరగబోయే నష్టంపై ప్రజలను చైతన్యపరిచాం. విభజన జరిగినప్పుడు చాలా బాధపడ్డాం, ఆవేదన చెందాం. నిబ్బరాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి. అప్పుడు ఆ నిర్ణయంపై కోపంతో కాంగ్రెస్ కు ఏవిధంగా బుద్ది చెప్పారో అందరూ గుర్తుచుకోవాలి.విభజన సమయంలో రూ16వేల కోట్ల లోటు బడ్జెట్ రాష్ట్రంలో ఉంది. 23జిల్లాల రాష్ట్రం 13జిల్లాలుగా మారింది. రాజధాని కూడా లేని పరిస్థితిలో, కొత్త రాజధాని మనం కట్టుకోగలుగుతామా అని ప్రజలంతా ఆందోళన చెందే పరిస్థితి. ప్రజలందరి ఆశీస్సులతో రాజధానిని క్రమక్రమంగా అభివృద్ది చేస్తూ ముందుకెళ్లాం. 2019 ఎన్నికల ముందుగాని, మేనిఫెస్టోలో గాని, ప్రతిపక్షంగా అసెంబ్లీలో గాని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో అందరూ అర్ధం చేసుకోవాలి. ఎన్నికల ముందు ఏం చెప్పకుండా, ఎన్నికలయ్యాక రాజధాని మార్చే అధికారం మీకు లేదు. ఇప్పుడీ రాజధాని మార్పు అంశం కోట్లాది మంది యువత భవిష్యత్ కు సంబంధించిన అంశం. ఇది ఏ ఒక వ్యక్తి సమస్యనో, పార్టీ సమస్యనో, ప్రాంతాల సమస్యనో కాదు. ఇది 5కోట్ల ప్రజల సమస్య.

రాజధానిపై ఎన్నికల ముందు మీరేం చెప్పారు..? ఎన్నికలయ్యాక మీరేం చేశారు..? ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడి, ఎన్నికలయ్యాక ఇష్టానుసారం చేస్తామనే హక్కు మీకు లేదు. ఆ రోజు ఏవిధంగా ప్రజలకు చెప్పి, ఈ రోజు ఏవిధంగా మోసం చేశారో ప్రజలంతా అర్ధం చేసుకోవాలి. మీ నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని భావిస్తే మొత్తం అసెంబ్లీని రద్దు చేయండి. ప్రజల దగ్గరకు వెళ్దాం. మీరు చెప్పేది మీరు చెప్పండి. మళ్లీ మీరు గెలిస్తే అమరావతి గురించి ఇకపై ఎత్తం. కానీ ప్రజలకు చెప్పకుండా రాజధానిని 3ముక్కలు చేస్తే మాత్రం అది నమ్మక ద్రోహం అవుతుంది. నమ్మించి మోసం చేసినట్లు అవుతుంది. చెప్పినమాట మీద నిలబడతాం అని పదేపదే ఊదరగొట్టే మీరు , సెప్టెంబర్ 2014న ప్రతిపక్ష నాయకుడి హోదాలో మీరన్న మాటలు గుర్తు చేసుకోండి. , ‘‘''అధ్యక్షా, విజయవాడలో కేపిటల్‌ సిటీ పెట్టడం గురించి మేం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కారణమేమంటే మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రమైపోయింది. 13 జిల్లాల ఈ చిన్న రాష్ట్రంలో ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షా, మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నది ఒక్కటే, కేపిటల్‌ సిటీని మీరు ఎక్కడన్నా పెట్టండి కాని అలా పెట్టే చోట కనీసం 30వేల ఎకరాలైనా వుండాలని మేం మొదటి నుంచి చెబుతున్నామని’’ జగన్మోహన్ రెడ్డి చెప్పింది గుర్తుంచుకోవాలి.

అప్పుడు చిన్న రాష్ట్రం అన్నారు, ఇప్పుడు పెద్దరాష్ట్రం అయిపోయిందా..అని నేను అడుగుతున్నాను.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టంలేక ఒప్పుకుంటున్నా అని ఆరోజు అన్నారు.. ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఇది ప్రాంతాల మధ్య చిచ్చు అవునా కాదా మీరే చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నాను. మీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా వాసి 26.02.2019న ఏం చెప్పారో గుర్తు చేసుకోండి.‘‘ ఎట్టి పరిస్థితుల్లో అమరావతిలో ఉన్నటువంటి కేపిటల్ ఇక్కడే ఉంటుంది. దానిలో లేనిపోనటువంటి ప్రచారాలు పెట్టి వీళ్లు రాజకీయ లబ్ది పొందాలని కొందరు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి హెడ్ క్వార్టర్స్ రాజధాని, దట్ విల్ కంటిన్యూ, ఇక్కడే ఉంటుంది. దీనినే ఒక మంచి సిటి స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. అన్నివసతులు ఇక్కడ ఉండేలానే ఉంటాయి. దానిని కూడా మేము ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా పెడతామని మీ ఎన్నికల మేనిఫెస్టో ఛైర్మన్ స్పష్టంగా చెప్పారు. మీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్(మైలవరం) ఏం చెప్పారో గుర్తు చేసుకోండి..‘‘ ‘‘రాజధాని ఇక్కడే ఉంటుంది. అందుకే మా నాయకుడు సొంత నివాసం, క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయం అన్నీ నిర్మించుకున్నాం. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అమరావతిని రాజధానిగా గుర్తించాం. రాజధాని తరలిపోతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి, శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా’’ అని మీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇప్పుడు రోజూ మాట్లాడే సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ ఆ రోజు ఏం చెప్పారు, ‘‘ఎవరైతే భూకబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు పాల్పడతారో వారికి కావాలి రాజధాని మార్పు.. రాజధాని మార్పు మాకు కాదు.

రాజధాని అమరావతిలోనే ఉంటుందని’’ అని చెప్పిందెవరు, బొత్స సత్యనారాయణ ఇప్పుడు సంబంధిత మంత్రి.. విశాఖలో ఇప్పుడు భూములు కబ్జా చేయాలని అనుకుంటున్నారా మీరు..? ధర్మాన ప్రసాదరావు అప్పుడు(13.11.2014) ఏమన్నారు, ‘‘గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాటును మేము స్వాగతిస్తున్నాం. రాజధానిని వైసీపీ అడ్డుకుంటోంది అనడంలో వాస్తవం లేదని’’ అన్నారు. అప్పుడు ధర్మాన ప్రసాద రావు స్వాగతిస్తారు, ఇప్పుడు వ్యతిరేకిస్తారు. ‘‘రాజధానిని మారుస్తారని కొందరు అపోహ పడుతున్నారు, రైతులు దీన్ని నమ్మవద్దని’’ అక్కడి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 07.04.2018న అన్నారు. “వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిని మరో ప్రాంతానికి తరలించం, అక్కడే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని” ఇప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 16.12.2018న చెప్పారు. “రాజధాని కట్టగల సమర్థుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే అమ‌రావ‌తిలో ఇల్లు కట్టుకుంటున్నారని’’ అప్పట్లో మీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా చెప్పారు. “వైసీపీ అధికారం చేపట్టిన వెంటనే జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణం చేపడతామని’’ విజయనగరం వైకాపా నాయకుడు కోలగుట్ల వీరభద్రస్వామి 01.02.2019న చెప్పారు. మా మేనిఫెస్టో ఒక భగవద్గీత ఒక బైబిల్, ఒక ఖురాన్ అని మీరే చెబుతారు. మీ బైబిల్ లో(మేనిఫెస్టో) చెప్పలేదే రాజధాని 3ముక్కల అంశం.. ఎందుకు చెప్పలేదు..? మీరు చెప్పందే, ఏవిధంగా చేస్తారని అడుగుతున్నాను. సమాధానం చెప్పమని నిలదీస్తున్నాను. ఇది మీ స్వంత విషయం కాదు, 5కోట్ల ప్రజల సమస్య. భావితరాల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఇప్పటికే తెలుగువాళ్లు చాలా దగాపడ్డారు, నష్టపోయారు. ఇప్పుడు ఇష్టానుసారంగా నేను మారుస్తాను, ఇది నాఇష్టం అంటే మీ ఇష్టం కాదు. ఇది ప్రజా వ్యతిరేకం, ప్రజలకు మీరు ద్రోహం చేశారు. వెన్నుపోటు పొడిచారు. కాదూ మీకు నమ్మకం ఉందంటే ఎన్నికలకు వెళ్లండి. ప్రజల ఆమోదం లేకుండా రాజధాని మార్చే హక్కు మీకు లేదు.

దీనివల్ల ప్రజలు ఎంత నష్టపోతారు, భావితరాల భవిష్యత్ ఎంత ప్రశ్నార్దకం అవుతుందో రాబోయే ఐదారు రోజుల్లో ప్రజలకు తెలియజేస్తాం. చైతన్యపరుస్తాం. ఇది నా ఒక్కడి సమస్య కాదు. రైతుల సమస్య ఒక్కటే కాదు, జెఏసి సమస్య కాదు. ఏ ప్రాంతానికో, కులానికో సమస్య కాదు. 5కోట్ల ప్రజల సమస్య. ఎవరైతే నమ్మించి మోసం చేశారో వాళ్లకు బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. మమ్మల్ని రాజీనామా చేయమని వైసిపిలో కొందరు అంటున్నారు..మేము రాజీనామా చేయడం ఒక్క నిముషం పని, అది ముఖ్యం కాదు. మేము 20మందిమి రాజీనామా చేస్తాం, మీరు కూడా రాజీనామా చేయండి, మొత్తం అసెంబ్లీని రద్దు చేయండి. అందరం ఎన్నికలకు వెళ్దాం, ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే, ప్రజాతీర్పును మేము శిరసావహిస్తాం. చెప్పనిదే చేయడం నమ్మకద్రోహం అవునా కాదా, వెన్నుపోటు పొడవడం కాదా..? 5కోట్ల ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా..? ఇష్టానుసారం నమ్మకద్రోహం చేస్తారా..? ఏ దేశం మీకు ఆదర్శం..? సౌతాఫ్రికా మీకు ఆదర్శమా..? ఇప్పుడున్న ప్రజల భవిష్యత్తునే కాదు, భావితరాల భవిష్యత్తును కూడా నాశనం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాలి. ఏమరుపాటుగా ఉంటే ప్రజలే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడున్న పిల్లల భవిష్యత్తే కాదు భావితరాల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. దీనిపై యువత ఆలోచించాలి, విజ్ఞులంతా ఆలోచించాలి,దేశ విదేశాల్లో తెలుగువారంతా ఆలోచించాలి. రాష్ట్రం పట్ల బాధ్యతగల వ్యక్తిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. అదే బాధ్యతతో మీరంతా కూడా వ్యవహరించాలని నా విజ్ఞప్తి. కోర్టుకు పోవడం, న్యాయ పోరాటం చేయడం ఒక యాంగిల్ అయితే, ప్రజాపోరాటం చేయడం, ప్రజాకోర్టులో వైకాపాను దోషులుగా నిలబెట్టడానికి ప్రజలంతా సిద్దం కావాలని కోరుతున్నాను. దీనిపై మిగిలిన రాజకీయ పార్టీలు కూడా వారి బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం హితం కోరే అందరూ వాళ్ల బాధ్యతలు వాళ్లు నిర్వర్తించాలి.

నేనిచ్చిన సవాల్ ను మీరు స్వీకరిస్తారా, లేక రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తారా..? మీరే నిర్ణయించుకోండి, 48గంటల్లో నా సవాల్ పై స్పందించండి. మీ నిర్ణయంపై మీకు నమ్మకం ఉంటే, ఎన్నికలకు వెళ్దాం రండి. మాట తప్పిందెవరు మీరా మేమా..? ఎన్నికల ముందు రాజధాని అంశం మీరు చెప్పారా ..? ఇది ప్రజలకు సంబంధించిన విషయమా, మీ స్వంత విషయమా..? ప్రజలకు చెప్పకుండా, ప్రజల ఆమోదించకుండా ఇలా చేయడం ఎంతవరకు న్యాయం..? ఎన్నికల్లో గెలిచామని, ప్రజలను దొంగదెబ్బ తీస్తారా..? ప్రజలను మోసం చేసింది మీరు, దొంగదెబ్బ తీసింది మీరు. రాష్ట్ర విభజన సమయంలో ఇట్లానే మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఏమైంది..? అదే గతి పడుతుంది ఇప్పుడు మీకు(వైఎస్సార్ కాంగ్రెస్ కు) కూడా..? తెలుగుదేశం పార్టీ వాళ్లు కాదు, మీ పార్టీవాళ్లలోనే మీ నిర్ణయాల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసిన దాంట్లో వెయ్యోవంతు కూడా చేయలేదని మీ మద్దతుదార్లే చెబుతున్నారు అంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన డాక్టర్ పంపిన మెయిల్ ను చదివి వినిపించారు. ‘‘3రాజధానులపై జగన్మోహన్ రెడ్డి నిర్ణయం అతిపెద్ద తప్పిదమని, 70% ప్రజలు దానికి వ్యతిరేకమని, ఒక పేదదేశం సౌతాఫ్రికాను ఆదర్శంగా తీసుకోవడం ఏమిటని, డబ్బులు వెదజల్లి ఏ సామాన్యుడైనా పరిపాలించగలడని’’ ఆ మెయిల్ లో వైకాపా మద్దతుదారుడే పేర్కొన్నాడు. ఇప్పటికైనా మీ తెలివితక్కువ నిర్ణయాన్ని ఉప సంహరించుకోండి. లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్దాం రండి.

రాష్ట్రం ఏర్పాటైంది కేంద్రం రూపొందించిన 2014ఏపి పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం. అందులో ఒక రాజధాని(ఎ కేపిటల్) అని మాత్రమే ఉంది, 3రాజధానులని లేదు. ఆ చట్టం ప్రకారమే హైకోర్టు ఏర్పాటైంది, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రపతి సంతకంతో ఏర్పాటైన హైకోర్టు ఇది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించిన హైకోర్టు ఇది. ఇప్పటికే కోర్టులు 70సార్లు మొట్టికాయలు వేస్తే, అయినా పట్టించుకోకుండా ఇప్పుడీ నిర్ణయాలు తీసుకోవడం ఇది పిచ్చి తుగ్లక్ అవునా కాదా..? పిచ్చిపట్టిన వాళ్లే ఇలాంటి చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై చర్చించుకోవాలి. ‘‘మీకు నష్టమా అవునాకాదా..? మిమ్మల్ని మోసం చేశారా లేదా..?’’ అనేది ప్రజలే చెప్పాలి. ఇప్పటికే చాలా నష్టపోయాం, దగా కాబడ్డాం. శారీరకంగా ఆర్ధికంగా, మానసికంగా ఇప్పటికే తెలుగుజాతికి చాలా అన్యాయం జరిగింది. 3 రాజధానులతో అభివృద్ది జరుగుతుంది అనుకుంటే దానిపై కూడా డిబేట్ జరగాలి. ఏది అభివృద్ది, ఎలా అభివృద్ది అనేది కూడా చర్చించాల్సివుంది. ప్రజలంతా ఆమోదిస్తే నాకెందుకు బాధ, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నేనెందుకు బాధపడాలి. ఎక్కడ రాజధాని కావాలి అనేది నిర్ణయించేది ప్రజలా, మీరా..? దానిపై ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజాతీర్పు కోరదాం రండి. ప్రజలు ఆమోదిస్తే నాకేం నష్టం లేదు. కానీ నిర్ణయించాల్సింది మాత్రం ప్రజలే.. రాజధాని తరలింపు గురించి ఎన్నికల ముందు చెప్పకుండా, ఎన్నికలయ్యాక చేయడం ప్రజలను మోసం చేయడమే..మోసం చేసేవాళ్లే తమకు కావాలని ప్రజలు అంటే, నాకేం బాధ లేదు. దానిని కూడా స్వాగతిస్తాం, శిరసావహిస్తాం. ఏది చేసినా ప్రజల ఆమోదంతో చేయండి కానీ దొంగ దెబ్బ తీయకండి.

ఎల్లుండి ఇదే సమయానికి నా ప్రెస్ కాన్ఫరెన్స్ ...ధైర్యం ఉంటే డిసైడ్ చేసుకోండి. 48గంటలు డెడ్ లైన్. ఎల్లుండి ప్రెస్ మీట్ లోపే నా సవాల్ కు స్పందించండి. ఆ రోజు కూడా 2014లో విభజన బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా. తలుపులు మూసేసి బిల్లు ఆమోదం చేశారు. ఈ రోజు కూడా 5కోట్ల మందికి వెన్నుపోటు పొడిచారు. ఆరోజే 3రాజధానులు పెడతామని వైసిపి చెప్పివుంటే, ఇప్పుడు మేము దానిని అడిగేవాళ్లం కాదు. 3రాజధానులని చెబితే ఓడిపోతామని దొంగనాటకాలు ఆడి ఇక్కడే ఉంచుతామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారు. ఆ రోజలా చెప్పి ఈరోజు ఇలా చేయడం నిజంగా విశ్వాస ఘాతుకం. రైతులను మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు. వీటిపై ప్రజలంతా చర్చించాలి. రాష్ట్ర ప్రభుత్వంతో రైతులు చేసుకున్న ఒప్పందం ద్వారా, రైతులకు రావాల్సిన ప్రయోజనాలు అన్నీ రావాలి. ఈ రోజు అమరావతి రూ లక్ష కోట్ల సంపద. ఇది నాశనం అయితే రైతులకు ఎంత కట్టాలి, రూ లక్ష కోట్లు కట్టాలా, ఎంత పరిహారం చెల్లించాలి అనేది భవిష్యత్తులో తేలుతుంది.  

Advertisements

Advertisements

Latest Articles

Most Read