పాలకుల మూర్ఖత్వం రాష్ట్రానికి ఎంత కీడు కలిగిస్తుందో రంగుల ఉదంతమే రుజువు.. రాజ్యాంగ ఉల్లంఘనలకు, కోర్టు ధిక్కారానికి, అహంభావానికి- మూర్ఖత్వానికి ఇదే ఉదాహరణ. ప్రభుత్వ భవనాలకు పార్టీ జెండా రంగులు వేయడం వైసిపి మూర్ఖత్వానికి పరాకాష్ట. తాము చేసిందే రైటు అంటూ కోర్టుల్లో పెడ వాదనలు చేయడం, తప్పుడు జీవోలు ఇవ్వడం, వందల కోట్ల ప్రజాధనం వృధా చేయడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ ఉల్లంఘనలు, న్యాయ నిబంధనల (రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, కోర్టులకు దురుద్దేశాలు ఆపాదించడం... ఏడాది పాలనలో వైసిపి ప్రభుత్వం నూరు తప్పులు చేసింది. శిశుపాలుడిని మించి పోయింది తప్పుల మీద తప్పులు చేయడంలో.. రంగులపై ఎంత డబ్బు వృధా చేశారు..? మొదట వైసిపి 3 రంగులు వేశారు. ఎవరో కోర్టుకెళ్తే రంగులు తొలగించమని హైకోర్టు ఆదేశాలిచ్చింది. దానిపై వైసిపి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ తిరస్కరిస్తే మళ్లీ హైకోర్టుకు వచ్చారు. నాలుగో రంగు(మట్టి రంగు) అడుగున వేసి మళ్లీ మసిబూసి మారేడుకాయ చేయాలని చూశారు. రంగులకు వక్రభాష్యాలు చెప్పి కోర్టుల కళ్లుగప్పే ప్రయత్నం చేశారు. ఆ 4 రంగులు కూడా తొలగించాలని హైకోర్టు ఆదేశించింది.

తీర్పు అమలు చేయలేదు కాబట్టి ‘‘కోర్టు ధిక్కరణ’’గా తీసుకుని సిఎస్, సెక్రటరీ, కమిషనర్ హాజరు కావాలని ఆదేశించింది. వైసిపి తప్పులకు ఉన్నతాధికారులు ముగ్గురూ కోర్టులో నిలబడ్డారు. మళ్లీ మూర్ఖంగా దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. నెలరోజుల్లో రంగులు తొలగించాలని ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మీ పార్టీ రంగులు వేయడానికి ఇంత దుర్మార్గమా..? హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ నెలల తరబడి తిరుగుతారా..? హైకోర్టు, సుప్రీంకోర్టు 2చోట్ల ‘‘కోర్టు ధిక్కరణ’’ ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకుంటారా..? కొట్టేస్తారని తెలిసి ఇన్ని జీవోలు ఇస్తారా..? ఇది ఉన్మాదం కాకపోతే ఏమిటి..? దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనూ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు వేసిన చరిత్ర లేదు. ఆ దురాలోచనే ఏ పార్టీ, ఏ నాయకుడు చేయలేదు. అన్నివర్గాల ప్రజలు హాజరయ్యే ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసే దుస్సంప్రదాయానికి ఎవరూ తెగించలేదు. అన్నివర్గాలకు న్యాయం చేసే తటస్థ వేదికలుగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులేయడం అనైతికం. అందరిదీ ఒకదారి అయితే వైసిపిది మరోదారి, అదే ‘‘అడ్డదారి-మాయదారి’’.

రంగులపై డబ్బులు వృధా..అడ్వకేట్లకు ఫీజులు వృధా..ఇప్పుడు తొలగించడానికి డబ్బులు వృధా..? ప్రజాధనం ఇలా దుర్వినియోగం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు..? రాజధాని రైతులకు వ్యతిరేకంగా వాదనలకు రూ5కోట్ల ఫీజులు..ఇప్పుడీ రంగులపై వాదనలకు ఇంకెంత దుర్వినియోగం చేశారో..? ఇలా ఫీజులకు, రంగులకు, కూల్చివేతలకు ‘‘వేలకోట్లు వృధాకేనా ఒక్క ఛాన్స్ ఇవ్వాలని’’ అడిగింది..? తప్పుచేసి, ఆ తప్పును దిద్దుకోకుండా, తప్పు మీద తప్పులు, ఇన్ని తప్పులా చేసేది..? మీరు చేసిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించాలా..? మీ తప్పుడు పనులకు రాష్ట్రం నష్ట పోవాలా..? మీ మూర్ఖత్వానికి జనం జరిమానా చెల్లించాలా..? ఇది సరైంది కాదు. రంగులు వేసినందుకు, వాటిని తొలగించడానికి అయ్యే ఖర్చును వైసిపి నుంచే వసూళ్లు చేయాలి. గతంలో దీనిపై వాదనల సందర్భంగా కోర్టులు కూడా అదే చెప్పాయి. వృధా చేసిన ప్రజాధనాన్ని వైసిపి నుంచి, వాళ్ల తప్పులకు తందాన అనే అధికారుల నుంచి రాబట్టాలి. చేసిన తప్పుకు మూల్యం వైసిపినే చెల్లించాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read