రాష్ట్రంలో వైసిపి అరాచకాలు, జగన్ రెడ్డి ఉన్మాది పరిపాలనపై తెలుగుదేశం పార్టీ తీవ్ర నిరసన తెలియజేస్తోంది. డీజీపీని కూడా హెచ్చరిస్తున్నా... కళా వెంకట్రావు గారు చేసిన తప్పేంటి...? రామతీర్థంలో రాముడి తల నరికివేస్తే.. నేను ముందుగా ప్రోగ్రామ్ కు పిలుపునిచ్చా. అది కూడా దుర్ఘటన జరిగిన 5వ రోజున. 29న రామతీర్థం ఘటన జరిగింది. నేను 2న పర్యటనకు ప్రోగ్రామ్ ఇచ్చాను. ముఖ్యమంత్రి 30న అక్కడకు వెళ్లారు. దేవాలయాలపై దాడులను అరికట్టాలనే ఆలోచన ఉంటే, ఆరోజే సీఎం ఎందుకు రామతీర్థం వెళ్లలేదు..? మంత్రులు కూడా ఆ రోజే ఎందుకు వెళ్లలేదు..? నేను 2వ తేదీన వెళితే, అప్పుడు ఏ-2ని ఏ చట్టం కింద అక్కడకు డీజీపీ అనుమతించారు..? రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయా..? ప్రతిపక్ష నేత అక్కడకు వెళితే ఇదేనా మీరు చేసేది..? మీకు లా అండ్ ఆర్డర్ మెయింటేన్ చేయాలన్న ధ్యాస లేదు. విజయసాయిరెడ్డి కరుడుగట్టిన నేరస్థుడు. అలాంటి వ్యక్తికి గులాంగిరీ చేస్తూ, ముందస్తు అనుమతితో వచ్చిన నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారా..? ఇదేనా శాంతిభద్రతలను కాపాడటం...? డీజీపీ సమాధానం చెప్పాలి. అనుమతితో వచ్చిన నన్ను అడుగడుగునా అడ్డుకుంటారా..? నా పర్యటనకు అడ్డంగా లారీలను పెడతారా..? ఏమనుకుంటున్నారు మీరు..? నేరస్థులను అనుమతించి మా ప్రోగ్రామ్ ను అడ్డుకుంటారా...? పోలీసులు ఉంది ప్రతిపక్షాలను అణచివేయడానికి కాదు, శాంతిభద్రతలను కాపాడటానికి ఉన్నారు... ప్రజల్లో తీవ్రమైన ఆవేశం వస్తే, పోలీసులు కూడా వెనక్కి తగ్గక తప్పదు. నిన్న విజయనగరం జిల్లాలో అదే జరిగింది. కళా వెంకట్రావు చేసిన తప్పేంటి...? మీ ఇష్టారాజ్యాంగా చేసి ప్రతిపక్షాలను అణగతొక్కుతామంటే కుదరదు. కోర్టులు, ప్రజలు చీవాట్లు పెట్టినా మీకు లెక్కలేదు. ఏ రూల్ కింద ఆయనను అరెస్ట్ చేశారు? రాముడి తల నరికివేస్తే, నరికేశారని చెప్పడం తప్పా..? అది చూడటానికి వెళితే, మాపై సెక్షన్లు 307, 327, 427, 506, 323, 120ఏ, డెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు పెడతారా...?

ఇది ఇండియన్ పీనల్ కోడా, జగన్ పీనల్ కోడా మీరు అమలు చేసేది..? అంబేద్కర్ రాజ్యాంగమా, రాజారెడ్డి రాజ్యాంగమా మీరు అమలుచేసేది...? దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి. ఇంత దారుణంగా చేసి, ఇంతమందిని చంపిన తర్వాతైనా మానసికంగా మార్పు రాలేదా అని అడుగుతున్నా. పోలీసు సంఘాలను బెదిరించి మాపై స్టేట్ మెంట్లు ఇప్పిస్తారా...? నిన్న తిరుపతిలో ధర్మపరిరక్షణ యాత్రకు పర్మిషన్ ఇచ్చి నేడు క్యాన్సిల్ చేస్తారా..? మా వాళ్లను అరెస్ట్ చేస్తారా..? ఈ రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా, డీజీపీ ఏం చేస్తున్నారు...? ధర్మపరిరక్షణ యాత్ర చేసే హక్కు మాకు లేదా అని అడుగుతున్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? ఏం తమాషానా ఇది..? చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ రెడ్డి క్రిష్టియన్ అనేది వాస్తవం. నాపై క్రిష్టియన్ సంఘాలతో నాకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్లు ఇప్పిస్తారా? రాష్ట్రంలో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కుట్ర జరుగుతోంది. బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయి. ప్రవీణ్ చక్రవర్తి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి. అలాంటి వారికి వంత పాడుతున్నారు. ప్రజలకు సెంటిమెంట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం ఉంటుంది. ఇంతవరకు ఎప్పుడైనా కళా వెంకట్రావుపై ఏదైనా వివాదం ఉందా..? నేను డీజీపీని అడుగుతున్నా. ఆయన వివాదరహితుడు. చాలా సౌమ్యంగా ఉండే వ్యక్తి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర వాసులంతా శాంతికాముకులు. అలాంటి ప్రదేశంలో రాత్రి 9.35కు కళా వెంకట్రావును అరెస్ట్ చేస్తారా..? ఆయనకు బీపీ ఉంటే, ట్యాబ్లెట్ వేసుకుంటానంటే కూడా కనీసం పర్మిషన్ ఇవ్వరా? పోలీసులను ఇష్టారాజ్యంగా వినియోగిస్తానంటే మీ ఆటలు సాగవు. మమ్మల్నందరినీ, ప్రజలందరినీ జైల్లో పెట్టి మీ ఆటలు సాగించుకోండి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read