ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు అయిన మంగళవారం, వాడీవేడిగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ వైఎస్ జగన్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీని పై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు పై వెటకారంగా స్పందించారు వైసీపీ నేతలు. మరీ దిగజారి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో మోడీకి మర్యాదపూర్వకంగా ఇచ్చిన శాలువాలు, తిరుపతి ప్రసాదం పై స్పందిస్తూ, మోడీని కలిసిన ప్రతి సారి చంద్రబాబు ఇచ్చిన శాలువాలు, వీణలు, బొకేలు ఒక బీరువా మొత్తం సరిపోతాయి అంటూ చంద్రబాబుని విమర్శించారు. దీని పై మాట్లాడిన చంద్రబాబు, గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను ఏమి చేసినా రాష్ట్రం కోసమే చేశాను, నేను ఇచ్చింది బీరువా అంత అయితే, మీరు ఇచ్చేది ఏమిటి అన్నారు ? మీరు కూడా ఇప్పటికే చాలా శాలువాలు ఇచ్చారని, ఈ 5 ఏళ్ళలో మీరు ఇచ్చేవి బీరువా కాదు, గదుల్లో సర్దుకోవాలి, ఇలాంటి ఆపి, రాష్ట్రానికి రావాల్సినవి చూడండి అంటూ చంద్రబాబు అన్నారు.

మోడీని కలవటం ఎందుకు, ప్రణాళికా సంఘం దగ్గరకు వెళ్ళండి అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు స్పందిస్తూ, రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించలేదని, ఆయన ఒప్పుకోనప్పుడు ప్రణాళికా సంఘం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. తాను ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చాను అంటున్నారు అని, కాని అప్పుడు జరిగిన విషయం ఇది అంటూ చంద్రబాబు చెప్పారు. తాము ప్రత్యేకహోదా సాధించలేదని ఇప్పుడు వైసీపీ నేతలు అంటున్నారు, హోదా తెస్తారనే ప్రజలు ఓట్లేసి మిమ్మిల్ని గెలిపించారు, హోదా తీసుకు రండి, మేము కూడా మీకు సహకరిస్తాం అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైకాపాకు 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారని,హోదా సాధించమనే అధికార పార్టీకి చెబుతున్నామన్నారు. తన పట్టుదల వల్లే తెలంగాణలోని ముంపు మండలాలను ఏపీలో విలీనం చేశారని, ఇప్పుడు పోలవరం ఇలా ఉంది అంటే, అదే కారణం అని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం ఎంతో నిబద్ధతతో ప్రయత్నం చేశామని, ఎన్డీయేలో మిత్రపక్షంగా ఉంటూనే, వారితో విభేదించామని అన్నారు. దీని వల్లే రాజకీయంగా నష్టపోయాం అని, అయినా రాష్ట్రం కోసం భరించామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read