ఎల్జీ పాలిమర్స్ కు టిడిపి హయంలోనే భూమి ఇచ్చింది అంటూ, వైసీపీ చేస్తున్న ప్రచారం పై చంద్రబాబు స్పందించారు. "ఈ కంపెనీకి భూములు టిడిపి ప్రభుత్వమే ఇచ్చిందనడం పచ్చి అబద్దం. హిందుస్తాన్ పాలిమర్స్ కు 1964 నవంబర్ 23న అప్పటి కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం జీవో 2177ద్వారా 213ఎకరాల భూమిని ఎకరం రూ2,500 రేటు మీద అందజేసింది. ఈ భూమికి 1992 అక్టోబర్ 8న అప్పటి ప్రభుత్వం జీవో 1033 ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి మినహాయింపులు ఇచ్చింది. హైకోర్టు సూచనల మేరకే టిడిపి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది, దానిపై దుష్ప్రచారం చేయడం వైసిపి దివాలాకోరుతనం. ఎల్జీ పాలిమర్స్ లో పాలిస్టైరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్, ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తి జరుగుతుంది. 2018డిసెంబర్ లో స్టైరీన్ ఉత్పత్తికి టిడిపి ప్రభుత్వం అనుమతించిందనే ప్రచారంలో వాస్తవం లేదు. ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ ఉత్పత్తిని, స్టైరీన్ ఉత్పత్తితో ముడిపెట్టడం దివాలాకోరుతనం. వైసిపి అధికారంలోకి వచ్చాకే మొదటి రెండు ఉత్పత్తుల(పాలిస్టైరీన్, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్)కు అనుమతించారు, కేంద్రానికి సిఫారసు చేశారు. వాస్తవాలను వక్రీకరించి వైసిపి దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం." అని చంద్రబాబు అన్నారు.

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటన బాధితులకు అండగా ఉన్న టిడిపి, తదితర ప్రతిపక్షాల నాయకులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. రూ కోటి వద్దు-కూతురే కావాలనే తల్లిపై కేసులు పెట్టడం కన్నా అమానుషం మరొకటి లేదని ధ్వజమెత్తారు. కరోనా కారణంగా లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి, చితికి పోయిన పేదలపై భారాలు మోపడాన్ని గర్హించారు. కరోనా నుంచి ప్రజలను ఆదుకునే చర్యలు వదిలేసి, కరెంటు ఛార్జీలు రెట్టింపు వసూళ్లు చేయడాన్ని ఖండించారు.

అటు ఆర్ధికంగా, ఇటు ఆరోగ్యపరంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారు. సమస్యలను పరిష్కారం చేయడం చేతగాక కొత్త సమస్యలు సృష్టించడమే పనిగా వైసిపి నాయకులు పెట్టుకున్నారు. ఏదో ఒకటి మాట్లాడటం, ఎదురుదాడి చేయడం, తప్పించుకుపోవడం వైసిపి నాయకులకు పరిపాటి అయ్యిందని దుయ్యబట్టారు. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కోవాలని, బాధిత ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులపై, ప్రతిపక్షాలపై, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read