గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ రాసారు. రైతు సమస్యలు పరిష్కరించాలని కోరితే ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ఫిర్యాదు చేసారు. ఫోన్‌లో కలెక్టర్ స్పందించక నేరుగా కలవాలని నిర్ణయించారని, నేరుగా వినతిపత్రం ఇవ్వాలని రామానాయుడు ఒక్కరే సైకిల్ పై వెళ్తుంటే, భీమవరం వద్ద పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తీసుకు వెళ్ళారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వందలమందితో సమావేశం నిర్వహించారని, సమావేశం నిర్వహించినవారిపై చర్యలు తీసుకోలేదని, మంత్రి, కలెక్టర్ 200 మందితో సమావేశం నిర్వహిస్తే చర్యల్లేవని అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని గవర్నర్‌కు కోరుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేసారు. ఇది చంద్రబాబు పూర్తీ లేఖ... "కోవిద్ 19 వైరస్ కారణంగా లాక్ డౌన్ తో ధాన్యం రైతులు, ఆక్వా రైతాంగం, హార్టీకల్చర్, ఫౌల్ట్రీ, సెరికల్చర్ మరియు రబీ పంటల రైతులంతా తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ వైఎస్పార్ కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేదు. ఈ నేపథ్యంలో పాలకొల్లు శాసన సభ్యుడు, టిడిఎల్ పి ఉపనేత అయిన డాక్టర్ నిమ్మల రామానాయుడుగారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ను స్వయంగా కలిసి రైతులు ఎదుర్కొంటున్న కష్టాలపై వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. "

"దీనిపై డా. రామానాయుడు అనేక ఫోన్ కాల్స్ చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ స్పందించలేదు. కొవిడ్ మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని, అందుకే తానొక్కడే సైకిల్ పై ఏలూరు వెళ్లి కలెక్టర్ ను కలిసేందుకు బయల్దేరారు. భీమవరం సమీపంలో విస్సాకోడూరు వద్ద పోలీసు అధికారులు ఆయనను కొద్దిసేపు నిర్బంధించి, తర్వాత పాలకొల్లు వెనక్కి పంపారు. అనంతరం, అదేరోజున పశు సంవర్ధక మరియు మత్స్యశాఖల మంత్రి జిల్లా కలెక్టర్ తో సహా 200మంది మత్స్యశాఖ అధికారులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు. భీమవరం ఆనంద్ ఫంక్షన్ హాల్ వద్ద నిర్వహించిన ఆ సమావేశానికి నర్సాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరియు పాలకొల్లు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ప్రస్తుత కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆ సమావేశం కేంద్రప్రభుత్వం జారీచేసిన కోవిడ్ ప్రొటోకాల్ మార్గదర్శకాలకు వ్యతిరేకమే కాకుండా విపత్తు నిర్వహణ చట్టం, 2005ను ఉల్లంఘించడమే. "

"కోవిడ్ ప్రొటోకాల్ కు అనుగుణంగా భౌతిక దూరం ఆ సమావేశంలో పాటించలేదు. దానికి ముందే సైకిల్ పై ఒంటరిగా జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న డా రామానాయుడుగారిని అక్రమంగా నిర్బంధించారు. ఈ సమావేశం గురిచి టిడిపికి చెందిన ఉండి, పాలకొల్లు శాసన సభ్యులకు కావాలనే తెలియపర్చక పోవడం శోచనీయం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా ఒంటెత్తు పోకడలకు పాల్పడుతుందో ఇదే ఉదాహరణ. లాక్ డౌన్ పీరియడ్ లో సమావేశం నిర్వహణ, ఇద్దరు శాసన సభ్యులకు ఆ సమావేశం గురించిన సమాచారం ఇవ్వకపోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తామరతంపరగా చేస్తున్న తప్పుడు పనులకు అద్దం పడుతున్నాయి. కాబట్టి మీరు తక్షణమే జోక్యం చేసుకుని, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడాలని, రాష్ట్ర ప్రభుత్వ ఒంటెత్తు ధోరణికి, వివక్షతకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాం. ప్రస్తుత ఆపత్కాల పరిస్థితుల్లో మీ తక్షణ జోక్యం ప్రజాస్వామ్య విలువలను, రూల్ ఆఫ్ లా కాపాడటానికే కాకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు దోహదకారి కాగలదు. " అంటూ లేఖ రాసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read