స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘానికి అనేక ఫిర్యాదులు చేశారు. అక్రమాలపై, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం నుండి ఎలాంటి చర్యలు లేవు. నాలుగు దశల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపర్చిన అభ్యర్ధులు భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ.. ఫలితాలు ప్రకటించకుండా దాచి, రాత్రి 8 తర్వాత వైసీపీ బలపర్చిన అభ్యర్ధులకు అనుకూలంగా ప్రకటనలు వెలువరుస్తున్నారు. గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ, నేడు జరిగిన చివరి దశలోనూ అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. చీకటి పడిన తర్వాత జరుగుతున్న ఫలితాల తారుమారు అంశాలన్నింటిలో కూడా పోలీసులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వైసీపీ అభ్యర్ధులకు అనుకూలంగా పని చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరపున ఈ ఘటనలను మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. 1. ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదు. 2. చీకటి పడిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలను తారుమారు చేస్తున్నారు. ఉదా: ఈ రోజు (21.02.2021) విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం పెదనగమయ్యపాలెం కౌంటింగ్ సెంటర్లో లైట్లు ఆపేసి వైసీపీ అభ్యర్ధికి అనుకూలంగా ప్రకటన చేశారు. 3. సింగిల్ డిజిట్ మెజార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చినపుడు మాత్రమే రీ కౌంటింగ్ చేయాల్సి ఉన్నా.. వైసీపీ గెలుపు కోసం రెండు, మూడు అంకెల ఫలితాల తేడా ఉన్నప్పటికీ రీ కౌంటింగ్ చేస్తున్నారు. 4. ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్ధుల గెలుపు ఖాయమైనప్పటికీ.. ఫలితాలు బయట పెట్టకుండా దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధులు గెలిచినట్లు ప్రకటిస్తున్నారు. ఉదా 1 : నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరు పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ మద్దతు దారుడు 9 ఓట్ల మెజార్టీతో గెలిచినా ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా దాచిపెట్టారు. ఉదా 2 : కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్టసోమాపురం పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధి ఒక ఓటు మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్నికల ఫలితాలు దాచిపెట్టి.. తర్వాత వైసీపీ అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించారు.

5. ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు రీ కౌంటింగ్ కోరినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉదా : గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనమర్లపూడిలో వైసీపీ అభ్యర్ధి ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటిస్తే.. రీ కౌంటింగ్ చేయాలని ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులు ప్రతిపాదించినా అధికారులు పట్టించుకోవడం లేదు. 6. వైసీపీ అభ్యర్ధులకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లను అనధికారికంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లతో పంపిస్తూ.. ప్రతిపక్ష పార్టీ అభ్యర్ధులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లను మాత్రం పంపించడం లేదు. 7. కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లోకి పోలీసులు వెళ్లి ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధులను, కౌంటింగ్ ఏజెంట్లను, ఎన్నికల అధికారులను కూడా బెదిరిస్తున్నారు. 9. ఒకటి రెండు ఓట్ల తేడాతో ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్ధులు గెలిస్తే.. వైసీపీ బలపర్చిన అభ్యర్ధి గెలిచినట్లు ప్రకటించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. అదే సమయంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించాలి. ఎన్నికల కౌంటింగ్ సమయంలో పలు ఓట్లు దారి మళ్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఎన్నికల సంఘం గమనించి సరైన చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి. ఎన్నికల సంఘం నుండి సరైన స్పందన లేకపోవడంతో ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తోంది. ప్రజల అభిప్రాయాలను నాశనం చేస్తోంది. ఇప్పటికైనా ఎన్నికల ఫలితాల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read