రాష్ట్రంలో, అమరావతి మార్పు తరువాత, జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం,కొత్త జిల్లాల ఏర్పాటుకు తాత్కాలిక బ్రేక్ పడింది. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలను 25 జిల్లాలుగా మార్చాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 25 జిల్లా కేంద్రాలుగా మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం జగన్ ఆదేశాలకు అనుగుణంగా కొత్త జిల్లాలకు చెందిన ప్రతిపాదనను రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపారు. జగన్ ఢిల్లీ టూర్లో సైతం ఇదే అంశాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు దాదాపుగా ఖరారు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని సూచించింది.

దేశ వ్యాప్తంగా జాతీయ పౌర పట్టిక జన గణన రూపొందించనున్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో సమస్యలు తలెత్తుతాయని, ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జన గణన ప్రక్రియ 2021 మార్చి 31 వరకు జరుగుతుందని అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలిపింది. సరిహద్దుల మార్పుతో పౌరుల వివరాల సేకరణకు ఇబ్బంది కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. జిల్లాలు, మండలాల సరిహద్దులు మారడం వల్ల జనగణన సిబ్బంది పలు ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనకు దాదాపు బ్రేకులు పడినట్లు అయ్యింది.

జనగణన ప్రక్రియ పూర్తి కావడానికి మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఏడాది అనంతరమే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన జిల్లాలు ఇవే.. నవ్యాంధ్రలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా ప్రభుత్వం మరో 12 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కొక్క పార్లమెంటు నియోజక వర్గాన్ని ఒక్కొ జిల్లాగా ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతి పాదించిన దాని ప్రకారం అనకాపల్లి, అరకు, అమలాపురం, రాజమండ్రి, నర్సాపురం, విజయవాడ, నర్సరావుపేట, బాపట్ల, తిరుపతి, రాజంపేట, నంద్యాల, హిందుపురంలను కొత్త జిల్లాలుగా ఎంపిక చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read