రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల సమయానికి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 252గా నిర్ధరణ అయింది. కేవలం 20 గంటల్లో 60 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 60 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​లో పేర్కొంది. అత్యధికంగా ఇవాళ కర్నూలు జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దిల్లీలోని సభకు హాజరై వచ్చినవారు, వారి సన్నిహితులే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో విదేశాల నుంచి వచ్చిన 11 మందికి కరోనా పాజిటివ్‌ తేలింది. అంతేకాకుండా వారి సంబంధీకులు ఆరుగురికి ఈ వైరస్ సోకింది. వీరితో పాటు వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన మరో ఆరుగురు వ్యక్తులకు పాజిటివ్​గా తేలిందని హెల్త్​ బులెటిన్​లో పేర్కొన్నారు. మొత్తం బాధితుల్లో ఐదుగురు వ్యక్తులు కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు. ఇక మరణాల సంఖ్య కూడా మూడుకు చేరింది. విజయవాడ, హిందూపురం, మచిలీపట్టణంలో ఈ మరణాలు ఉన్నాయి.

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా రేపటి నుంచి గుంటూరులో లాక్ డౌన్​ను మరింత కఠినంగా అమలు చేస్తామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో 30 కేసులు నమోదు కాగా... వాటిలో 15 కేసులు గుంటూరు నగరంలోనే నమోదయ్యాయని తెలిపారు. రేపు ఉదయం నుంచి గుంటూరు మీదుగా ఇతర ప్రాంతాలకు రాకపోకలు పూర్తిగా నిషేధించినట్లు ఆనంద్​ కుమార్ వెల్లడించారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి జీజీహెచ్​ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సిబ్బందికి మాస్కులు, గ్లౌజులను ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. వైద్యసిబ్బందికి 2వేల పీపీఈ కిట్లను విజ్ఞాన్ సంస్థల తరపున జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడికి అందించారు.

గుంటూరులో లాక్ డౌన్​కు సహకరించాలని ప్రజలను కలెక్టర్ కోరారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులను తామే అందజేస్తామన్నపాలనాధికారి.. ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యసేవలన్నీ ఎస్మా చట్టం పరిధిలోకి వచ్చినందున ప్రైవేటు వైద్యసిబ్బంది సైతం సహకరించాలని ఆదేశించారు. క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నవారికి అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎవరూ దుష్ప్రచారం చేయవద్దని కోరారు. మరో పక్క, తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వైద్యులు రూ.3.35లక్షలను సీఎం సహాయనిధికి అందించారు. చెక్కు రూపంలో ఈ మొత్తాన్ని స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి అందజేశారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read