కృష్ణాజిల్లాలో మిత్రపక్షం సీపీఐకి కేటాయించిన రెండు స్ధానాల్లో పోటీ చేయాలని చివరి నిమిషంలో జనసేన తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. జనసేన వైఖరికి నిరసనగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని సీపీఐ నాయకత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. జనసేన తీరుకు నిరసనగా విజయవాడ పశ్చిమ సీటు నుంచి పోటీకి సీపీఐ సిద్ధమవుతుండటం ఇరు పార్టీల పొత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తోంది. ఏపీలో పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. రాష్ట్రంలో పార్టీలన్నీ దాదాపుగా ఒంటరిపోరుకు సిద్ధమైన వేళ.. జనసేన మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకుని చెరో ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయించింది. వీటిలో సీపీఐకి కేటాయించిన కృష్ణాజిల్లా నూజివీడు సీటును జనసేన చివరి నిమిషంలో వెనక్కి తీసుకుంది. నూజివీడు అసెంబ్లీ సీటుకు బదులుగా విజయవాడ ఎంపీ సీటును సీపీఐకి ఆఫర్ చేసింది. దీంతో ఆ పార్టీ తరఫున న్యాయవాది చలసాని అజయ్ కుమార్ బరిలో నిలిచారు.

pk 2224020102019 2

కానీ నిన్న విజయవాడలో జరిగిన జనసేన ప్రచార సభలో పవన్ కళ్యాణ్ సీపీఐకి మరోసారి షాక్ ఇచ్చారు. విజయవాడ లోక్ సభ సీటు నుంచి జనసేన బరిలో ఉంటుందని తేల్చిచెప్పిన పవన్... తమ పార్టీ తరఫున ముత్తంశెట్టి ప్రసాద్ బాబు పోటీ చేస్తారని సంచలన ప్రకటన చేశారు. మిత్రపక్షాలకు కేటాయించిన స్ధానంలో జనసేన పోటీకి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. పవన్ ఏకపక్ష వైఖరిపై సీపీఐ మండిపడుతోంది. తొలుత నూజివీడు అసెంబ్లీ సీటు కేటాయించి వెనక్కి తీసుకున్న జనసేనాని, ఇప్పుడు ఏకంగా విజయవాడ ఎంపీ సీటులోనూ బరిలోకి దిగుతానని ప్రకటించడంపై సీపీఐ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం జనసేనతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగుదామని అధినాయకత్వానికి ప్రతిపాదిస్తున్నారు. అదే సమయంలో విజయవాడ ఎంపీ సీటు అన్యాయంగా లాక్కున్నందుకు నిరసనగా తాము ఇప్పటికే జనసేన పోటీ చేస్తున్న విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటులో పోటీకి దిగుతామని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ హెచ్చరిస్తున్నారు.

pk 2224020102019 3

వాస్తవానికి ఎన్నికలకు రెండు నెలల ముందే వామపక్షాలతో మాత్రమే పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్.. చివరి నిమిషంలో బీఎస్పీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. వారికి 3 ఎంపీ సీట్లతో పాటు 21 అసెంబ్లీ సీట్లు కూడా కేటాయించారు. సీపీఎం, సీపీఎంలకు చెరో 7 అసెంబ్లీ సీట్లు, 5 ఎంపీ సీట్లు కేటాయించారు. కానీ చివరి నిమిషంలో సీపీఐ పోటీ చేసే సీట్లలో నూజివీడు వెనక్కి తీసుకుని జనసేన బరిలో ఉంటుందని ప్రకటించారు. నిన్న విజయవాడ ఎంపీ సీటు కూడా జనసేన తీసుకోవడంతో సీపీఐ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మిత్రధర్మాన్ని గౌరవించకుండా జనసేన ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సీపీఐ నేతలు మండిపడుతున్నారు.... నూజివీడు, విజయవాడ ఎంపీ సీట్లు వెనక్కి తీసుకోవడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని సీపీఐ విజయవాడ ఎంపీ అభ్యర్ధి చలసాని అజయ్ కుమార్ ఆరోపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అన్ని విషయాలు బయటపడతాయని చలసాని వెల్లడించారు. దీంతో జనసేన తీరుపై కమ్యూనిస్టుల ఆగ్రహం ఎన్నికల ఫలితాలపై పడుతుందనే ఆందోళన కూడా ఇరుపార్టీల్లో వ్యక్తమవుతోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read