ఎన్నికలకు మూడు నెలల ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరా తీస్తున్నారు. 2018-19లో బడ్జెట్‌లో లేని అన్నదాతా-సుఖీభవ, పసుపు-కుంకుమ, సామాజిక పింఛన్ల మొత్తం రెట్టింపుపథకాల కోసం.. ఆ బడ్జెట్‌లో నిధులు కేటాయించిన పనులను, బిల్లులను ఎందుకు పక్కన పెడుతున్నారని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బడ్జెట్‌లో ఇతర పనులకు కేటాయించిన నిధులను కొత్త పథకాల కోసం ఎందుకు మళ్లిస్తున్నారని వివరణ అడుగుతున్నట్లు సమాచారం. గత వారమే పెండింగ్‌ బిల్లులపై సమీక్ష నిర్వహించిన సీఎస్‌.. మంగళవారం మళ్లీ వాటిపై వరుస సమీక్షలు చేశారు. మొదట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమీక్షించి.. మరికొన్ని వివరాలు తీసుకురావాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.

three schemes 24042019

వారు ఆ వివరాలతో మధ్యాహ్నం మళ్లీ వచ్చారు. అనంతరం తిరిగి వచ్చి సీఎస్‌ మరికొన్ని వివరాలు అడుగుతున్నారంటూ ఆర్థిక శాఖ కార్యాలయంలో హడావుడి చేయడం కనిపించింది. ఎన్నికలకు ముందు ప్రభుత్వం అన్నదాతా-సుఖీభవ, పసుపు-కుంకుమ, పింఛన్ల రెట్టింపు పథకాలను తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనలన్నిటినీ కేబినెట్‌లో పెట్టి ఆమోదం పొందాకే వాటిని అమల్లోకి తెచ్చారు. 2018 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. అంతకుముందే 4 నెలల కాలానికి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసనసభ ఆమోదించారు. అందులో ఈ కొత్త పథకాలకూ చేర్చారు. పసుపు-కుంకుమ మూడో విడత, అన్నదాతా-సుఖీభవ రెండో విడత చెల్లింపులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక సంవత్సరంలో చెల్లించారు.

 

three schemes 24042019

ఏప్రిల్‌లో కేంద్రం నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల అడహాక్‌ గ్రాంటు వచ్చింది. మిగులు ఐజీఎస్టీ నిధులను కేంద్రం అన్ని రాష్ట్రాలకు పంచింది. ఈ నిధులను సంక్షేమ పథకాలకు ఎందుకు ఖర్చు పెట్టారని సీఎస్‌ ఆర్థిక శాఖ అధికారులను అడిగినట్లు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో లేని ఈ పథకాలకు ఏ విధానం ప్రకారం చెల్లింపులు చేశారని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ పథకాల కింద ఎంత మంది లబ్ధి పొందారో సమాచారమివ్వాలని ఆదేశించారు. ఈ పథకాలకు కేబినెట్‌ ఆమోదం ఉన్నా.. నియమ నిబంధనల ప్రకారమే నిధులు విడుదలయ్యాయా లేదా అని సీఎస్‌ అడిగినట్లు తెలిసింది. మంగళవారం నాటికి రాష్ట్రంలో రూ.14,400 కోట్ల పెండింగ్‌ బిల్లులున్నాయి. పెండింగ్‌ బిల్లుల అంశంపై సీఎస్‌ నిర్వహించిన సమీక్షలో ఆర్థిక శాఖ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read