‘ఫొని’ తుపాను తీవ్రత పెరుగుతోంది. ఈనెల 30, మే 1వ తేదీల్లో దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశగా కదిలే అవకాశాలున్నాయని అధికారులు ప్రకటించారు. మరో 6 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న ‘ఫొని’ 30న అతి తీవ్రంగా, మే 1న పెను తుపానుగా మారనుంది. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరం సమీపానికి రానుంది. అయితే ఎక్కడ తీరాన్ని తాకుతుందనేది వాతావరణశాఖ ఇంకా స్పష్టంగా చెప్పలేదు. సోమవారం ఉదయం వరకు ఉన్న సమాచారం ప్రకారం తుపాను ట్రింకోమలీకి 620 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 880 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. మే 1వ తేదీ నాటికి పెను తుపానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు పేర్కొంది.

cyclone 29042019

ఆ సమయంలో గాలుల వేగం 150 కి.మీ. నుంచి 185 కి.మీ. వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 29, 30 తేదీల్లో, కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయని, ఒడిశా తీరంలో భారీ వర్షాలకూ అవకాశమున్నట్లు వివరించారు. ఈనెల 30న తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరంలో గంటకు 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. ఆ తర్వాత మే 2న ఏపీ, ఒడిశా తీరాల్లో గంటకు 40-60 కి.మీ., 3న ఒడిశా తీరంలో 50-70 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

cyclone 29042019

ఆదివారం ఆగ్నేయ బంగాళాఖాతం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో సముద్రం చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. 30న ఇది మరింత తీవ్రంగా మారుతుందని అంటున్నారు. ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు పుదుచ్చేరి, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల్లో, మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం చాలా చురుగ్గా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read