కుట్ర కోణంలో భాగంగానే మత్స్యకార వర్గానికి చెందిన కొల్లు రవీంద్రపేరును జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హత్యకేసులో చేర్చిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాయలంలో విలేకరులతో మాట్లాడారు. జూన్ 29న ఉదయం 11 గంటలకు మచిలిపట్నంలో హత్య జరిగితే, 1.15నిమిషాలకు ఎఫ్ ఐఆర్ సిద్ధం చేశారని, కేవలం రెండుగంటల 15 నిమిషాల్లోనే ఏ4 గా రవీంద్ర పేరును చేర్చడం కుట్రకాక, మరేమవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, తగురీతిలో విచారణ జరపకుండా, కేవలం కుట్ర కోణంతోనే మాజీ మంత్రి పేరును ప్రభుత్వం ఏ4గా చేర్చిందన్నారు. రెండుకుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా జరిగిన హత్యకేసులో కావాలనే రవీంద్ర పేరు చేర్చారని, ఎఫ్ ఐ ఆర్ లో పేరు చేర్చిన ప్రభుత్వం దాన్ని దాచిపెట్టి ఎందుకు రాజకీయాలు చేసిందని దేవినేని నిగ్గదీశారు. మత్స్యకార వర్గం నుంచి బలమైన వ్యక్తిగా ఎదిగిన కొల్లు రవీంద్ర గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి కేబినెట్ లో 4 శాఖలను సమర్థవంతంగా, నిజాయితీతో నిర్వర్తించి, వివాద రహితుడిగా మంచిపేరు సంపాదించాడన్నారు.

ప్రతిపక్షంలో ఉండి కూడా, తన సమర్థతను చాటుకుంటూ, జగన్ ప్రభుత్వ అవినీతిని, అసమర్థతను ప్రశ్నిస్తున్నాడన్న అక్కసుతోనే రవీంద్రపై ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. తెలుగుదేశం పాలనలో మచిలీపట్నంలో ఏనాడు హత్యలు జరగలేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాకే, రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కారణంగా హత్య జరిగిందన్నారు. ఏ విధమైన ఆధారాలు లేకుండా, విచారణ జరపకుండా మాజీమంత్రి పేరుని హత్యకేసులో ఎలా చేర్చారో, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. ‍హత్యకేసులో రవీంద్ర పేరును చేరుస్తున్నారన్న వార్తలు కొన్ని ఛానళ్లలో వచ్చాయని, దానిపై తాను, కొనకళ్ల నారాయణ పోలీస్ అధికారులను అడగటం జరిగిందన్నారు. దానికి స్పందించిన పోలీసులు, ఆ వార్తలన్నీ అవాస్తవాలని, ఇంకావిచారణలో ఏమివెల్లడి కాలేదని సమాధానమిచ్చా రన్నారు. ఆనాడు పోలీసులు అలా చెప్తే, తరువాత ఏ4గా రవీంద్ర పేరును ఎలా చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.

జూన్ – 29న హత్య జరిగితే, జూలై -02న డిఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారని, ఆనాడు రవీంద్ర ప్రమేయం ఉందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, రవీంద్ర ప్రమేయం లేదని, తగిన ఆధారాలు లేవని డీఎస్పీ సమాధానం చెప్పాడని దేవినేని పేర్కొన్నారు. జూన్ 29న ఎఫ్ ఐ ఆర్ నమోదుచేసి, జూలై 2 నాటి డీఎస్పీ సమావేశంలో రవీంద్ర పేరు లేదని చెప్పడమేంటన్నారు. హత్యకేసు నిందితులకు సంబంధించిన సీసీ.టీవీ పుటేజ్ సోషల్ మీడియాలో వచ్చిందని, దాని కారణంగా అక్కడ పనిచేసిన పోలీసులను వీ.ఆర్ కు పంపారని, ముందేమో సస్పెండ్ అని చెప్పారని, తరువాత వీ.ఆర్ కు పంపారని, ఇవన్నీ ఎందుకు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. బడుగు, బలహీన వర్గాలను కుట్రపూరితంగా కేసులో ఇరికించి వారిని ఎందుకు అణగదొక్కాలని చూస్తున్నారో, ఢిఫ్యాక్టో హోం మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. రవీంద్ర పేరులేదని చెప్పిన తరువాత విశాఖ వెళుతున్న వ్యక్తిని బలవంతంగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని దేవినేని ప్రశ్నించారు. హత్య జరిగిన నాలుగురోజుల తర్వాత రవీంద్రను అరెస్ట్ చేసి, పారిపోతుంటే పట్టుకున్నామని చెప్పడం సిగ్గుచేటు కాదా అని దేవినేని మండిపడ్డారు. రవీంద్ర బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడనే ఆయన్ని జగన్, సజ్జల అరెస్ట్ చేయించారని, ఇవేవీ పట్టించుకోకుండా ఒకమంత్రి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వం తరుపున సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడని దేవినేని ఎద్దేవాచేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read