టీడీపీ పాలనలో పోలవరం నిర్మాణ పనుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ, పూర్తి వివరాలను, రోజువారీ జరిగే పనుల పురోగతిని ఆన్ లైన్ లో ఉంచడం జరిగిందని, పనులు చూడటానికి వెళ్లిన ప్రతిసారీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జాతీయప్రాజెక్ట్ నిర్మాణ వివరాలను అందరికీ తెలియచేసేవారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు పోలవరం పనులను పరిశీలించడానికి వెళ్లిన ప్రతిసారీ, కేంద్రజలవనరుల శాఖా మంత్రికి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఛైర్మన్ కు, సభ్యులకు, సెంట్రల్ వాటర్ కమిషన్ సభ్యులకు, డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సభ్యులకు, రాష్ట్రప్రజలకు, పూర్తిస్థాయి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా తెలియచేయడం జరిగేదన్నారు. అందుకు విరుద్ధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని, తాను పోలవరం పర్యటనకు వెళ్లిన ప్రతిసారీ, అక్కడేం పనులుజరుగతున్నాయి... తానేం పరిశీలించాడు.. ఏఏ పనులు చేయమని అధికారులను ఆదేశించాడనే వివరాలను ఎందుకు బహిర్గతం చేయడంలేదని ఉమా ప్రశ్నించారు. అసలు జగన్.. పోలవరం పనులు జరుగుతున్న తీరుని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు పోలవరం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి, మీడియా ముందుకొచ్చి వివరాలు ఎందుకు వెల్లడించలేదన్నారు.

గతంలో టీడీపీ ప్రభుత్వంపై పోలవరం నిర్మాణానికి సంబంధించి రోజుకోరకంగా అవినీతి ఆరోపణలుచేస్తూ, రూ.16వేలకోట్ల పోలవరం అంచనా వ్యయాన్ని, రూ.43వేలకోట్లకు పెంచామని, రూ.వెయ్యికోట్లు అదనంగా హెడ్ వర్క్స్ పనులకు కేటాయించామని గగ్గోలుపెట్టిన వైసీపీనేతలు, సాక్షి మీడియా నేడు జగన్ పోలవరం సందర్శనకు వెళితే, ఎందుకు మౌనంగా ఉన్నాయని దేవినేని ప్రశ్నించారు. 2021కి పోలవరం పూర్తవుతుందని జగన్ ప్రభుత్వం చెబుతుంటే, అది ఎలా సాధ్యమవుతుందని ఎవరూ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు? వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నివేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయో, ఎన్ని తట్టల మట్టివేశారో, ఎన్ని యంత్రాలను తెప్పించారో, ఎందరు పనివాళ్లు పనిచేస్తున్నారనే వివరాలు ఎందుకు బయటకు రావడంలేదన్నారు. పోలవరం పనుల్లో రూ.20వేలకోట్ల వరకు దేవినేని ఉమా కాజేశాడని, చిలువలు పలవలుగా విష ప్రచారం చేసిన నోళ్లన్నీ ఏమైపోయాయని ఉమా నిలదీశారు. టీడీపీ పాలనలో పోలవరం పునాదులే లేవలేదని చెప్పిన జగన్, నేడు ఎందుకు మౌనంగా ఉన్నాడన్నారు. రూ.20వేలకోట్ల దోపిడీ జరిగితే, ఆ డబ్బంతా ఎక్కడికెళ్లిందో ముఖ్యమంత్రి ఎందుకు చెప్పడంలేదన్నారు. జగన్ తన బంధువైన పీటర్ తో వేసిన కమిటీ, పోలవరం పనులపై ఏమని నివేదిక ఇచ్చిందో ఎందుకు బయటపెట్టడం లేదని ఉమా ప్రశ్నించారు.

2006లో పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో, ఆనాడు జరుగుతున్న పనులను జగన్ అడ్డుకోవడం జరిగిందన్నారు. జగన్ అత్యాశ కారణంగా, పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న పన్నాగంతో ప్రాజెక్ట్ పనులు ఆరేళ్లపాటు ఆగిపోయింది నిజం కాదా అని దేవినేని నిగ్గదీశారు. జగన్ నిర్వాకం వల్ల రూ.2537 కోట్ల భారం ప్రాజెక్ట్ నిర్మాణంపై పడిందన్నారు. జగన్ వేసిన పీటర్ కమిటీ పవర్ ప్రాజెక్ట్ పనుల్లో రూ.2,346కోట్ల అవినీతి జరిగిందని, 2015-16 ఎస్సెస్సార్ తప్పని చెప్పడం జరిగిందన్నారు. పీటర్ కమిటీ తప్పన్న 2015-16 ఎస్సెస్సార్ నే ఆధారం చేసుకొని, జగన్ ప్రభుత్వం మరలా టెండర్లు ఎలా పిలిచిందో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చాక రెండుసార్లు ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్లిన జగన్, రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు ఒక సంస్థకు అప్పగించాక, మరలా అదనంగా చెల్లింపులుచేయాలని అధికారులను ఎలా ఆదేశించారో చెప్పాలన్నారు. రివర్స్ టెండరింగ్ లో ఒకే కంపెనీ ఎలా పాల్గోందో, అదే కంపెనీకి -14, -12.06శాతంతో పనులప్పగించి, వందరూపాయల పనిని రూ.26తక్కువకు ఎలా చేయిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. 100రూపాయల పనిని 74రూపాయలకు జగన్ రెడ్డి ఎలా చేయిస్తున్నాడు అన్న ఆశ్చర్యం పక్కరాష్ట్రాలకు కూడా ఉందని దేవినేని ఎద్దేవాచేశారు.

కేవలం తాను పనులు అప్పగించిన కంపెనీకి మేలు చేయడానికే జగన్ నేడు పోలవరం వెళ్లాడని, ఆ మేలు ఏవిధంగా, దేన్ని పెంచి చేయాలో కూడా ఆయనే అధికారులను ఆదేశించాడని ఉమా తెలిపారు. చంద్రబాబు కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న జగన్, గతప్రభుత్వం చేసిన పనులుగురించి మాట్లాడే సాహసంచేయడం లేదన్నారు. జాతీయప్రాజెక్ట్ లో దోపిడీచేయడానికే, రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని, ల్యాండ్ అక్విజేషన్ లో గానీ, ఆర్ అండ్ ఆర్ లోగానీ ఒక్కరూపాయికూడా ఎందుకు ఖర్చుచేయలేకపోయారన్నారు. పీటర్ కమిటీ రిపోర్ట్ కేంద్రానికిచ్చి అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయబట్టే, నేడు జగన్ ప్రభుత్వం డీపీఆర్-2ను ఆమోదింపచేసుకోలేని దుస్థితికి వచ్చిందన్నారు. వందలు, వేలు, లక్షలకోట్ల అవినీతి జరిగిందన్నవారు, నేడుపోలవరం పనులు వివరాలను వెల్లడించలేకపోతున్నారో చెప్పాలన్నారు. టీడీపీప్రభుత్వం పునాదుల్లేని పోలవరం నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం దాన్ని 2021కి ఎలా పూర్తిచేస్తుందో సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు. న్యాయం అడవులపాలైంది కాబట్టే, అన్యాయం రాజ్యమేలుతోందని, ఆ అన్యాయం, న్యాయం చేసిన పనులను ఒప్పుకోలేకపోతోందన్నారు. చంద్రబాబు హయాంలో పనులు జరుగుతుంటే, లక్షలాదిరైతులు వాటిని ప్రత్యక్ష్యంగా చూశారని, జగన్ మాత్రం ఒక్కనాడుకూడా పోలవరం వెళ్లలేదన్నారు. గతంలో చాలాసార్లు ఇదే అంశంపై జగన్ ని ప్రశ్నించామని, ఆయనెప్పుడూ నోరు మెదపలేదన్నారు. పోలవరం పునాదులే పూర్తి కానప్పుడు, జగన్ వైఎస్సార్ పేరుబ్రిడ్జికి పెడతానని ఎలా అంటున్నాడో తెలియడంలేదన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read