రాష్ట్రంలో ధాన్యం క్రయ, విక్రయాలకు సంబంధించి రైతులు ఇబ్బండి పడకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో రైతుల పక్షపాతిగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. రాజ్ భవన్లో శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తొలి విడతగ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశమై లాక్ డౌన్ సమయంలో వ్యవసాయ పనులు ఆగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తికి విఘాతం కలిగితే భవిష్యత్ లో పలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి అధికారులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి రైతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు పేర్కొంటూ వారి ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవసాయదారులతో వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత రబీ సీజన్ లో పౌరసరఫరాల సంస్థ 32.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు గవర్నర్ కు వివరించారు.

వ్యవసాయ క్షేత్రాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు నగదును రైతుల ఖాతాల్లోనే జమ చేసేందుకు కంప్యూటరీకరణ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ వివరించారు. గ్రామాలను యూనిట్ గా తీసుకొని మార్కెటింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా చూడాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మార్కెటింగ్ శాఖ నుంచి సమగ్రమైన కార్యాచరణ అమలు చేస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు. సమీక్షా సమావేశాల్లో పౌరసరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సూర్య కుమారి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

కరోనా కట్టడికి లాక్ డౌన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పాటించినప్పుడే అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. లాక్ డౌన్ విషయంలో చివరి రోజు వరకు ఇదే స్ఫూర్తితో కొనసాగించాలన్నారు. కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో మతపరమైన సదస్సులు, సమావేశాలు మంచిది కాదని గవర్నర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రజలకు మత పెద్దలు తగిన సూచనలు చేయాలని ఆయన పిలుపిచ్చారు. మతపరమైన కార్యక్రమాల వలన సమూహాలు ఏర్పడటం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది కాదన్నారు. కరోనా కట్టడికి నిమగ్నమైన వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో వీరి విధులను అడ్డుకోవడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొంటూ ఈ తరహా ఘటనలు ఏమాత్రం వాంఛనీయం కాదన్నారు.క రోనా కట్టడికి నిరంతరం కష్టపడుతున్న వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read