కోస్తా తీరప్రాంతాన్ని గజగజలాడిస్తున్న పెథాయ్‌ తుపానును ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ), రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్‌టీజీఎస్‌) నుంచి వచ్చే సూచనలతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని రాష్ట్ర హోంశాఖ, విపత్తుల నిర్వహణ మంత్రి చినరాజప్ప ప్రకటించారు. దీంతో తూర్పుగోదావరి జిల్లాకు సమీపంలోని అయిదు మండలాలపై జిల్లా అధికార యంత్రాంగం పూర్తి దృష్టి సారించింది. రెవెన్యూ మొదలుకొని విద్యుత్తు, ఆరోగ్యం, పంచాయతీరాజ్‌, జలవనరులు, వ్యవసాయ, మత్స్యశాఖలతోపాటు ఇతర శాఖల ఉన్నతాధికారులంతా తీరప్రాంత గ్రామాల బాట పట్టారు. ఆయాశాఖల పరంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి విపత్తు ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన సామగ్రిని, అదనపు సిబ్బందిని ఉంచారు.

pethai 1712018 1

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తీర ప్రాంతంలో సమగ్ర రక్షిత నీటి పథకాలున్నాయి. గాలులు తీవ్రత..విద్యుత్తు అంతరాయం వల్ల ఈ పథకాలకు నీరందే పరిస్థితి ఉండదని ఆలోచించి ఒక్కో రక్షిత నీటి పథకం వద్ద ఒక్కో పెద్ద జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా కోసం నీళ్ల ట్యాంకులను మాట్లాడి సిద్ధం చేసుకున్నారు. విపత్కర పరిస్థితులు వస్తే వీటిని గ్రామాలకు పంపిస్తారు. పెథాయ్‌ తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల పైబడి వేగంతో గాలులు వీచే ఆస్కారం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తూర్పుప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) అందుకు తగ్గ ముందస్తు ఏర్పాట్లు చేసుకుంది.

pethai 1712018 1

గ్రామాల్లో చీకట్లు అలముకోకుండా ఉండేందుకు జనరేటర్లను ఏర్పాట్లు చేస్తున్నారు. స్తంభాలు పడిపోతే వాటి స్థానంలో వెంటనే కొత్తవి వేయడం కోసం 4 వేల స్తంభాలను రాజమండ్రిలో సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే 500 స్తంభాలు ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. సత్వర పునరుద్ధరణ పనుల్లో పాల్గొనే విధంగా 1500 మంది కార్మికులను గుత్తేదారులతో మాట్లాడి ఆయా మండలాల్లో పెట్టారు. అలాగే క్రేనులు కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంచారు. వరిపైరు కోయకుండా పొలాల్లోనే ఉంది. ఈ పంట వర్షంతో కూడిన గాలి వల్ల నేలకొరిగితే కొంత వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తుంది. ఆదివారం ఆ శాఖ రైతులతో సమావేశమై పంట కోతలేవీ ఇప్పుడు పెట్టుకోవద్దని.. నేలకొరిగి నీటి మునిగితే రెండుశాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలని సూచించారు. వరిపైరు కుప్పలు ఉంటే, వీటిపై వెంటనే టార్పాలిన్లు కప్పుకోవాలన్నారు. గతేడాది టార్పాలిన్లు (పరదాలు) పంపిణీ చేశామని వాటిని ఈ సమయంలో ఉపయోగించుకోవాలని, లేని పక్షంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. కోసి పనలుగా ఉన్న వాటిని వెంటనే దిబ్బలు పెట్టించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని సాగునీటి కాలువలు..చెరువులు గండ్లు పడకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. తుపాను ప్రభావిత మండలాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల కోసం కార్మికులను ఇప్పటికే ఆయా మండలాలకు చేర్చారు. తుపాను సహాయక చర్యల నిమిత్తం ఏజెన్సీ నుంచి ఒక్కో మండలానికి అదనంగా పది మంది చొప్పున కార్యదర్శులకు విధులు అప్పజెప్పారు. ఒక్కో మండలంలో నాలుగు పొక్లెయిన‌్ర్ల చొప్పున పెట్టినట్లు తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటి పరిధిలో నిరాటంకంగా వైద్యసేవలు అందించేందుకు వైద్యుల సెలవులను సైతం రద్దుచేశారు. పశువుల సంరక్షణ వైద్యం కోసం ఒక్కో మండలానికి ఒక్కో సహాయ సంచాలకున్ని ప్రత్యేకాధికారిగా నియమించారు. ప్రతి మండలానికి లారీతో పశువుల దాణాను సిద్ధం చేసి ఉంచుతామని అవసరమైన పక్షంలో వినియోగిస్తామంటున్నారు. మరో పక్క, బియ్యం నిల్వలు కూడా ఎక్కడిక్కడ చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read