పోలీసుల తీరు పై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రైతులను అరెస్ట్ చేసి, వారిని 18 రోజులుగా రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. అమరావతి రైతుల పై పోలీసులు, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసారు. తరువాత కింద కోర్టు ఆదేశాలతో రిమాండ్ కు పంపించారు. అయితే వీరికి ఇక్కడ బెయిల్ నిరాకరించటంతో వారు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. కొద్ది రోజుల క్రితం వీరికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఆ సందర్భంలో హైకోర్టు ఈ అరెస్ట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు, సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకమని తెలిపింది. ఆ అరెస్ట్ ని ఖండిస్తూ పోలీసుల తీరుని కోర్టు తప్పుబట్టింది. ఈ విషయం పై తమకు పూర్తి నివేదక ఇవ్వాలని పోలీసులని, కింద కోర్టుని కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు, కింద కోర్టు, హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసు నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది. పోలీసులు, కింద కోర్టు ఇచ్చిన వివరాలు పరిశీలించిన హైకోర్టు, జరిగిన పరిణామాల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల పై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటం, వారిని జైలుకు పంపించటం, ఇది కచ్చితంగా అక్రమ అరెస్ట్ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి 41 ఏ నోటీస్ ఇవ్వకుండా, ఎందుకు అరెస్ట్ చేసారని పోలీసులని ప్రశ్నించింది. ఇది అక్రమ నిర్బంధం అని, ప్రాధమిక హక్కులు హరించటమే అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

hc 28112020 2

ఈ చర్యను కోర్టు ధిక్కరణ చర్యగా భావిస్తామని, వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, దీని పై తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు ఘాటుగా స్పందించింది. రైతుల తరుపున వాదనలు వినిపించిన న్యాయవాది, పోలీసులు జరిగిన దానికి, కోర్టుకు సమర్పించిన నివేదికకు వ్యత్యాసం ఉందని, వక్రీకరించి చెప్తున్నారని అన్నారు. దీని పై ప్రభుత్వ తరుపు లాయర్ స్పందిస్తూ, ఇప్పటికే వారికి బెయిల్ వచ్చేసింది కాబట్టి, ఈ కేసుని ఇంతటితో వదిలేయాలని, ఈ కేసు ముగిసిపోయినట్టే అని అన్నారు. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, బెయిల్ ఇచ్చినా, అక్రమ నిర్బంధం పై విచారణ చేయవచ్చని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. అయితే దీని పై స్పందించిన ప్రభుత్వ తరుపు న్యాయవాది, ఇది చాలా చిన్న విషయం అని, దీనికి కోర్టు ధిక్కరణ అవసరం లేదని చెప్పగా, కోర్టు స్పందిస్తూ, ఇది మీకు చిన్న విషయం కావచ్చు, ఇక్కడ రైతుల ప్రాధమిక హక్కులు హరించబడ్డాయి, వారు అక్రమంగా అరెస్ట్ చేయబడ్డారు, ఈ కేసు పై సహజ న్యాయ సూత్రాలు పాటిస్తూ, తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. మరి దీని పై పోలీసులు బాధ్యులు అవతారా ? కోర్టు ఏమి చెప్తుంది అనేది వేచి చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read