ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఎప్పుడూ లేని విధంగా, కష్టం చేసుకునే రైతుల చేతులకు బేడీలు వేసిన ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరిగింది. గత శనివారం చేసిన చలో గుంటూరు జైలు కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. మహిళల పై పోలీసులు ప్రవర్తించిన తీరు అందరూ చూసారు. అయితే ఇదంతా విధుల్లో భాగంగా చేసామని పోలీసులు అంటున్నారు. ఇది ఇలా ఉంచితే, మూడు రాజధానులకు మద్దతుగా అంటూ, కొంత మందిని ఆటోల్లో వేరే ప్రాంతం నుంచి తరలించి, అమరావతికి తీసుకుని వచ్చి ధర్నా చేపించే క్రమంలో, మీరు మా ఊరు ఎందుకు వచ్చి ధర్నా చేస్తున్నారు అంటూ, కొంత మంది రైతులు వారిని అడ్డుకున్నారు. అయితే దీని పై కేసు పెట్టటంతో, అమరావతి రైతుల పై ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసారు. దళితుల పైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయటంతో అందరూ ఆశ్చర్య పోయారు. అయితే వీరిని నరసరావుపేట నుంచి గుంటూరు జైలుకు తీసుకుని వచ్చే సమయంలో రైతుల చేతులకు సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. దీంతో ఈ సంఘటన పెద్ద దుమారం రేపింది. అయితే దీని పై స్పందించిన జిల్లా ఎస్పీ కొంత మంది పోలీసుల్ని సస్పెండ్ చేసారు. అయితే రెండు రోజులకే వారి పై సస్పెన్షన్ ఎత్తి వేసారు. ఇక మరో పక్క, రైతులు ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికీ వారికీ బెయిల్ రాలేదు.

humanrights 09112020 2

దీంతో వారు హైకోర్టుకు వెళ్ళారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. ఇది ఇలా ఉంటే, రైతులకు బేడీలు వేసిన సంఘటన మానవహక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. మొత్తం ఘటన పై స్పందించిన నతిఒన హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ ఫిర్యాదుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి పంపి, ఈ పూర్తీ ఘటన పై చర్యలు తీసుకుని, 8 వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని, అలాగే ఏమి చర్యలు తీసుకున్నారో, పిటీషనర్ కు తెలపాలని ఆదేశాలు జారీ చేసారు. అక్రమ అరెస్ట్ లు చేసి, బేడీలు వేసి, ఉద్యమం చేస్తున్న వారిని భయానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసారు. మొదటి ఐపిసి సెక్షన్ల కింద కేసులు పెట్టి, తరువాత దీన్ని ఎస్సీ ఎస్టీ కేసుగా మార్చారని, దీని వెనుక రాజకీయ నాయకులకు హస్తం ఉందని ఫిర్యాదులో తెలిపారు. అసలు ఎస్సీల పైనే, ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ పెట్టటం ఎక్కడ ఉండదని అన్నారు. అలాగే రైతులకు బేడీలు వేయటం, సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధం అని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసారు. మరి డీజీపీ గారు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read