సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ మోడీని వేడుకుంటాను అని చెప్పిన జగన్, ఇప్పుడు అమిత్ షా రూట్ లో వెళ్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ మనసు కరిగేలా చూడాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు జగన్‌ విజ్ఞప్తి చేశారు. ‘దీనిపై ప్రధానికి మంచి మాట చెప్పండి’ అని కోరారు. శుక్రవారం ఢిల్లీకి వచ్చిన జగన్‌ నార్త్‌బ్లాక్‌ కార్యాలయంలో అమిత్‌ షాను కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహూకరించారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదాపై వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నార్త్‌బ్లాక్‌ ఆవరణలో జగన్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘దేవుడి దయతో ప్రత్యేక హోదా వచ్చే వరకు... నేను వచ్చినప్పుడల్లా మరిచిపోకుండా ప్రతీ సందర్భంలోనూ అడుగుతూనే ఉంటా. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలో పేరొన్న హామీల అమలు హోం శాఖ పరిధిలో ఉంటుంది. అందుకే హోం మంత్రిని కలిశాను. ప్రత్యేక హోదా ఆవశక్యతను వివరించాను. అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్న రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశాను’’ అని జగన్‌ వివరించారు.

amit 15062019

శనివారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతీ అయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతానని స్పష్టం చేశారు. అమిత్‌ షా స్పందన ఎలా ఉందని ప్రశ్నించగా... ‘‘ఇవన్నీ మాట్లాడేకొద్దీ... చెప్పే కొద్దీ... వారి హృదయాలను మన వైపు సానుకూలంగా మార్చుకోవాలి’’ అని జగన్‌ సమాధానమిచ్చారు. వైసీపీకి లోక్‌సభ డిప్యుటీ స్పీకర్‌ పదవి ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను జగన్‌ ఖండించారు. అవన్నీ ఊహాగానాలేనని తెలిపారు. ‘‘ఆ పదవి ఇస్తామని మాకు ఎవరూ చెప్పలేదు. మేమూ అడగలేదు. దాని గురించే మాట్లాడలేదు. అలాంటి ప్రతిపాదనేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందించాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం’’ అని తెలిపారు.

amit 15062019

ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న నీతీ ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో జగన్‌ పాల్గొననున్నారు. వర్షపు నీటి పరిరక్షణ, కరువు స్థితి - తీసుకోవల్సిన చర్యలు, అభ్యదయ జిల్లాల కార్యక్రమం - విజయాలు, సవాళ్లు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, అంతర్గత భద్రత - మావోయిస్టు ప్రభావిత జిల్లాలపై దృష్టి అనే అంశాలపై సమావేశం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు, శనివారం ఉదయం 10 గంటలకు ఏపీ భవన్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కేంద్ర హోం శాఖ కార్యాలయానికి వచ్చిన జగన్‌కు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ధర్మారెడ్డితోపాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి ఉన్నారు.

 

Advertisements

Add comment


Security code
Refresh

Advertisements

Latest Articles

Most Read