దివంగ‌త ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డిని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ప్ర‌శంసించారు. నెల్లూరు జిల్లాలో యువ‌గ‌ళం పాద‌యాత్ర కొన‌సాగిస్తున్న నారా లోకేష్ వివిధ వ‌ర్గాల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఓ యువ‌కుడు మాట్లాడుతూ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా ప‌నిచేసిన గౌత‌మ్ రెడ్డి త‌మ ప్రాంతానికి కొన్ని ప‌రిశ్ర‌మ‌లు తెచ్చార‌ని, ఆయ‌న మృతితో అవి త‌ర‌లిపోయాయ‌ని చెప్పుకొచ్చారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేశార‌ని కితాబిచ్చారు. ఉత్సాహ‌వంతుడైన మంత్రి గౌత‌మ్ రెడ్డిని ప‌నిచేయ‌కుండా జ‌గ‌న్ స‌ర్కారు అడ్డంకులు క‌ల్పించంద‌న్నారు. చివ‌రికి గౌత‌మ్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ప‌రిశ్ర‌మ‌లు తెచ్చుకోలేని ప‌రిస్థితుల్లోకి జ‌గ‌న్ రెడ్డి నెట్టేశార‌ని వివ‌రించారు. గౌత‌మ్ రెడ్డి వివిధ ప్ర‌తిపాద‌న‌ల‌తో కంపెనీల‌ను ర‌ప్పించేందుకు చంక‌లో ఫైళ్లు పెట్టుకుని తిరిగార‌ని చెప్పుకొచ్చారు. అయితే జ‌గ‌న్ రెడ్డి తుగ్ల‌క్ పాల‌న దేశ‌విదేశాల‌కి పాకిపోవ‌డంతో తుగ్ల‌క్ వ‌ద్ద‌కి రాలేమ‌ని ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానులు గౌత‌మ్ రెడ్డి మొఖం మీదే చెప్పేశార‌ని లోకేష్ వివ‌రించారు. టిడిపి హ‌యాంలో చేసిన 13 జిల్లాల అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ‌ని ఇప్పుడు జ‌గ‌న్ రెడ్డి ఏర్పాటు చేసిన 26 జిల్లాల విభ‌జ‌న‌కి అనుగుణంగా మార్పు చేయాల్సి ఉంద‌ని.. క్ల‌స్ట‌ర్ బేస్డ్ డెవ‌ల‌ప్మెంట్ ప్లాన్ చేస్తున్నామ‌ని యువ‌నేత లోకేష్ వివ‌రించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read