నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ (నుడా) పాలక వర్గం గురువారం రాజీనామా చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో నామినేటెడ్‌ పదవులన్నీ రద్దు అయ్యే అవకాశం ఉండటంతో మరో నెల గడువు ఉండగానే నుడా పాలక వర్గం తన రాజీనామాను సమర్పించింది. చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డితోపాటు సభ్యులు ఖాజావలి, రంగారావు, రఘునాథరెడ్డిలు వారి పదవులకు గురువారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి సినీ హీరో నందమూరి బాలకృష్ణ గురువారం ఫోన్‌ చేశారు. నుడా చైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్న సమయంలో ఆయనకు బాలకృష్ణ నుంచి ఫోన్‌ వచ్చింది. అధికారం కోల్పోయామని బాధపడాల్సిన అవసరం లేదని, అన్నగా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గతంలో లాగే ప్రజా సమస్యలపై పోరాటాలు సాగిస్తూ ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. నుడా చైర్మన్‌గా నుడా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని బాలకృష్ణ కొనియాడారు. నగరంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం సాగించి టీడీపీని ప్రజలకు మరింత దగ్గర చేయాలని సూచించారు.

nbk 14062019 1

రాజీనామా అనంతరం, నుడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటంరెడ్డి మాట్లాడారు. నుడా కొత్తగా ఏర్పడినప్పటికి అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో అభివృద్ధి చేయగలిగామని చెప్పారు. పాలక వర్గానికి రెండేళ్లు మాత్రమే సమయం ఉండగా కార్యాలయం ఏర్పాటు తదితర కారణాలతో 8 నెలలపాటు పాలనకు దూరంగానే ఉండాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికి గత 13 నెలల్లో రూ.50కోట్ల మేర అభివృద్ధి పనులను చేపట్టి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీల్లో నుడాను నెంబర్‌వన్‌గా నిలిపామన్నారు. ఆదాయ వనరులు పెంపొందించేందుకు చర్యలు చేపడుతునే నెల్లూరులో రూ.30కోట్లతో నెక్లె్‌సరోడ్డు, 11 పార్కుల ఏర్పాటుకు పనులు చేపట్టామన్నారు. అలాగే ఎన్నడూ లేనివిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం గూడూరు, నాయుడుపేట, కోవూరు, ముత్తుకూరు, వరిగొండ, తదితర ప్రాంతాల్లో మరో పది పార్కుల ఏర్పాటుకు పనులను తమ పాలనలో ప్రారంభించి దాదాపుగా పూర్తి చేశామన్నారు.

నుడా ఆర్థిక వనరులను మరింతగా అభివృద్ధి చేసేందుకు లే అవుట్ల కోసం రెండు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రల సహకారంతో నుడా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయగలిగామని చెప్పారు. నగర ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేసినప్పటికి వాటిని సాధించలేకపోయామన్నారు. కొత్త ప్రభుత్వంలోని జిల్లా మంత్రులు నెక్లెస్‌రోడ్డు పనులను పూర్తి చేయించాలని కోరారు. అలాగే రింగురోడ్డు, రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జిలను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. తాము అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ వారికి అండగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఖాజావలి, రంగారావు, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read