ఆంధ్రప్రదేశ్ ఐటి, పంచాయితీ రాజ్ శాఖా మంత్రి లోకేష్, వాజ్‌పేయి గారి పై సంతాప సందేశంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. "ఏది సత్యం? ఉండటమా? లేక లేకపోవడమా? లేదా రెండూ సత్యమేనా? ఎవరైతే సజీవులో, వారున్నారనడం సత్యం... ఎవరైతే నిర్జీవులో, వారు లేరనడం సత్యం... అంటూ ఒక కవితలో రాసుకున్నారు వాజ్‌పేయిగారు. కానీ వాజ్‌పేయి వంటి వారిని లేరని ఎవరైనా అనుకోగలరా. ఎంత కష్టంగా అనిపిస్తోంది కదా. మనిషికి మరణం అన్నది సహజం. కానీ కొందరి విషయంలో అలా అనుకోలేం. ఏదో కోల్పోయిన బాధ ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో ఒకరు వాజ్‌పేయి. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. రాజకీయం, కవిత్వం ఒకే వ్యక్తిలో ఉండటం అరుదు. కానీ వాజ్‌పేయి ఉత్తమ పార్లమెంటేరియన్ గానూ, ఉత్తమ కవిగానూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు రాగానే ఆయన వివిధ సందర్భాలలో చేసిన ప్రసంగాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవడం మొదలుపెట్టాయి. అంటే ఆయన ఎంత మంచి ఉపన్యాసకులో అర్థం చేసుకోవచ్చు.

వాజ్‌పేయి వంటి వ్యక్తి పూర్తికాలం ప్రధానిగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ విశిష్టమైన పాత్రను పోషించింది అని తెలుసుకున్నప్పుడు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి హయాం నుండీ తెలుగుదేశంతో అనుబంధం ఉన్నప్పటికీ, ఎన్డీఏ పాలనాకాలంలో తెదేపాకు, చంద్రబాబుగారికి మరింత దగ్గరయ్యారు వాజ్‌పేయిగారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండానే వాజ్‌పేయిగారి విధానపరమైన నిర్ణయాలు, పరిపాలనలో ముఖ్యపాత్ర పోషించింది తెలుగుదేశం. సూక్ష్మ సేద్యం, నాలుగు వరుసల స్వర్ణ చతుర్భుజి, టెలి కమ్యూనికేషన్ విధానం, సెల్ ఫోన్ విధానాల విషయంలో తెలుగుదేశం ఎంతో ప్రముఖమైన పాత్రను నిర్వర్తించింది. తన ప్రభుత్వానికి అండగా నిలబడినందుకే కాకుండా దార్శనికత పరంగా కూడా చంద్రబాబుగారంటే వాజ్‌పేయిగారికి ఎంతో గౌరవం. చంద్రబాబుగారు అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేవారు.

వాజ్‌పేయిగారి హయాంలోనే చంద్రబాబుగారు సైబరాబాద్ ను నిర్మించారు. మైక్రోసాఫ్ట్ ను హైద్రాబాదుకు తేగలిగారు. హైటెక్ సిటీ ప్రారంభోత్సవం వాజ్‌పేయిగారి చేతుల మీదుగానే జరిగిందంటే చంద్రబాబుగారికి ఆయనంటే ఎంత గౌరవం ఉండేదో అర్థం అవుతుంది. అదే సమయంలో చంద్రబాబుగారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానిగా వాజ్‌పేయిగారు ఎంతగా సహకరించేవారో తెలుస్తుంది. ఇతర రాష్ట్రాలు ఎంతగా పట్టుబట్టినా ఐఆర్ డిఏను చంద్రబాబుగారు హైద్రాబాదుకు తీసుకురాగలిగారంటే అది వాజ్‌పేయిగారి చలవే.

రాష్ట్రంలో కరవు ఏర్పడినప్పుడు చంద్రబాబుగారు 4 సార్లు ఢిల్లీ వెళ్ళి వాజ్‌పేయిగారిని కలిశారు. ఆ ఫలితంగా రూ.224 కోట్లతో పాటు రెండువిడతలుగా 15 లక్షల టన్నుల బియ్యం కేంద్రం నుండి సాయంగా అందింది. కలాంగారిని రాష్ట్రపతిని చేయడంలోనూ, దేశానికి తొలి దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగిని అందించడంలోనూ చంద్రబాబుగారు కీలకపాత్ర పోషించారు. ఈ రెండు చారిత్రాత్మక ఘటనలు వాజ్‌పేయిగారి హయాంలోనే జరిగాయి. 2002లో ఆంధ్రప్రదేశ్ 32వ జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. అలాగే తొలి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ కూడా అంతే గొప్పగా ఏపీలో నిర్వహించబడ్డాయి. ఈ రెండిటి నిర్వహణతో చంద్రబాబుగారి పేరు ప్రపంచమంతా మారుమ్రోగింది. నిజానికి ఈ క్రీడా సంబరాలను ఢిల్లీలో నిర్వహించాలని ఎన్నో ఒత్తిడిలు వచ్చినా చంద్రబాబుగారి పట్టుదలకు మెచ్చి వాటిని ఏపీలో నిర్వహించుకునేందుకు అవకాశమిచ్చారు వాజ్‌పేయిగారు. అంతదాకా ఎందుకు! హైద్రాబాదులో శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు చంద్రబాబుగారు ఎంతో పోరాటం చేశారు.

కేంద్ర రక్షణశాఖ పరిధిలోని మిథాని సంస్థ ఇక్కడ విమానాశ్రయ ఏర్పాటును వ్యతిరేకించింది. పట్టువదలని చంద్రబాబుగారు వాజ్‌పేయిగారి వద్దకు వెళ్ళి కూర్చుంటే, శంషాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాల్సిందిగా వాజ్‌పేయిగారు ఆదేశించారు. ఇలా చెప్పుకుంటూ పొతే తెలుగుదేశం పార్టీతోనూ, తెలుగుప్రజలతోనూ వాజ్‌పేయిగారికి ఉన్న అనుబంధం ఒక చరిత్రే అవుతుంది. అలాంటి వాజ్‌పేయిగారు ఇకలేరు అన్న భావన బాధిస్తోంది.

''ఎదుటి వారిని కౌగిలించుకోలేనంతగా ఎదుగుదలని ఎప్పటికీ ప్రసాదించకు, అంత కాఠిన్యాన్ని నాకెప్పటికీ ఇవ్వకు'' ఒక కవితలో వాజ్‌పేయిగారు కోరుకున్న కోరిక ఇది. ఎంతటి సమతాభావం! ఎంతటి మానవతా దృక్పథం! ఎంతటి ఉన్నత వ్యక్తిత్వం!! అందుకే ఆయన అజాత శత్రువు అయ్యారు. నాలాంటి వారికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆ మహానుభావుని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. We will miss you Sir!

Advertisements

Advertisements

Latest Articles

Most Read